NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌లో అంతర్మథనం.. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని భావిస్తోందా..?

Brs

Brs

Off The Record: వరుస ఓటములు, నాయకుల వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం కాస్త తేరుకుని ఇక దిద్దుబాట పడుతోందట. తాము పవర్‌లో ఉన్నప్పుడు కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేశామని, దాని పర్యవసానాన్ని అనుభవిస్తున్నామని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలకపాత్ర పోషించారు. ఉవ్వెత్తున ఉద్యమించి నాడు బీఆర్‌ఎస్‌ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా… ముందుండి జై కొట్టారు. ఆ తర్వాత గులాబీ సర్కార్‌ ఏర్పడ్డ కొత్తల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి ఈ రెండు వర్గాలు. కానీ… క్రమంగా సీన్‌ మారిపోయింది. తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్‌ఎస్‌ అధికార కాలంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, ఇంకా చెప్పాలంటే తమను పూచిక పుల్లతో సమానంగా తీసేసి కనీసం ఆందోళనలు చేసే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదన్న కసితో రగిలిపోతున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఈ రెండు వర్గాలు కూడా కారణమని గ్రహించిందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం.

Read Also: By-elections: ముగిసిన అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్..పలు చోట్ల ఘర్షణలు

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్‌దాకా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు.. ఈసారి బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ గట్టిగానే ప్రచారం చేశారు. ఆ ఎఫెక్ట్‌ శాసనసభ ఎన్నికల్లో కనిపించిందన్నది కారు పార్టీ పెద్దల విశ్లేషణగా తెలుస్తోంది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని ప్రచారం చేసింది బీఆర్‌ఎస్‌. ఇచ్చిన హామీల్ని అమలు చేయని పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయొద్దంటూ వెళ్లిన ప్రతి చోట చెప్పారు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు. కానీ.. అదేమీ పని చేయలేదు. పైగా.. తామొకటి చెబితే జనం మరోటి అర్ధం చేసుకున్నారన్నట్టుగా అసలు బీఆర్‌ఎస్‌కే లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. పార్టీ చరిత్రలోనే తొలిసారి ఒక్క ఎంపీ సీటు గెల్చుకోలేకపోవడంతో ఉలిక్కిపడ్డ గులాబీ అగ్ర నేతలు ఎక్కడ పోగొట్టుకున్నామంటూ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్నట్టు తెలిసింది. వెంటనే రూట్‌ మార్చాలని, ఏ విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమాల పునాదుల మీదైతే ఎదిగామో.. తిరిగి అక్కడికే వెళ్ళాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే… ప్రస్తుతం డీఎస్సీని వాయిదా వేయాలని, గ్రూప్ 1 పోస్టుల రేషియో అంశం, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ అంశాలను ఎత్తుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌. ఈ ఆందోళనలతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు దగ్గర అవ్వొచ్చన్నది పార్టీ అగ్ర నాయకత్వపు ఆలోచన అట.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అందుకే ఇప్పుడు జరుగుతున్న నిరసనలు, ధర్నాల్లో బీఆర్ఎస్‌ విద్యార్థి విభాగం కీలకంగా ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఉద్యోగాల అంశంపైనే వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కాంగ్రెస్ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయంటూ ప్రశ్నిస్తున్నారాయన. పార్టీ విద్యార్థి విభాగంతో ప్రతి రోజూ మీడియా సమావేశం పెడుతూ విద్యార్థులకు, నిరుద్యోగులకు దగ్గర అవ్వాలని చూస్తోందట బీఆర్‌ఎస్‌. ఇది చూస్తున్నవారంతా…విద్యార్థులు , నిరుద్యోగులు తలుచుకుంటే పవర్‌ దూరం చేయగలరు, ఇవ్వగలరన్న విషయాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం తొందరగానే గ్రహించిందని కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్‌ని గుర్తు చేసుకుంటున్నారట. బాబూ… బద్దం… నువ్వు దేంతో మొదలయ్యావో చివరికి నీకు అదే మిగులుతుందన్న డైలాగ్‌ని రిపీట్‌ చేస్తూ… మూలాలు మర్చిపోతే ఇలాగే ఉంటుందని కూడా సెటైర్స్‌ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మొత్తంగా బీఆర్‌ఎస్‌ అధిష్టానంలో వస్తున్న మార్పు పార్టీని ఎంతమేర ముందుకు తీసుకువెళ్తుందోనన్న చర్చ మొదలైంది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.