NTV Telugu Site icon

Off The Record: ఏపీలో వైసీపీ-బీజేపీ ఒకటేనా ? బీజేపీ ఎదక్కపోవడానికి కారణం ఏంటి ?

Bjp

Bjp

Off The Record: గేర్‌ మార్చండి…స్పీడ్‌ పెంచండని ఏపీ బీజేపీ నేతలకు అధినాయకత్వం పదే పదే చెబుతోంది. ఆ పెద్దోళ్ళు చెప్పారు కదా… అని ఇక్కడి నేతలు క్లచ్‌ తొక్కిందే తొక్కుతూ… గేర్‌ మార్చిందే తెగ మార్చేస్తున్నారట. కానీ… ఏం లాభం … క్లచ్‌ తొక్కి కాళ్ళు, గేర్‌ మార్చి చేతులు నొప్పులు పుడుతున్నాయి తప్ప బీజేపీ బండి మాత్రం ముందుకు కదలడం లేదట. ఏదో అప్పుడప్పుడూ ఒక జర్క్‌లాగా ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తున్నా.. వాస్తవంగా కదలికలు లేవు. అందుకు కారణం మీరంటే మీరంటూ… ఏపీ బీజేపీలోని రెండు వర్గాల నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సరైన నాయకత్వ పటిమ లేకుండా సోము వీర్రాజు రాష్ట్రంలో ఎదగకుండా చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుండగా…
కొత్తగా వచ్చే వారే పార్టీని షెల్టర్‌లా వాడుకుంటున్నారు తప్ప ఏ మాత్రం ఉపయోగపడటం లేదని, పైగా.. అన్ని రకాలుగా డ్యామేజ్‌ చేస్తున్నారని మరో వర్గం నాయకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల టైంలో ఏపీ బీజేపీ ఎలా ఉందో…ఇప్పుడు కూడా అలాగే ఉంది.

పాత స్టోరీ అంతా ఒక ఎత్తయితే…తాజాగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఏపీ బీజేపీ ఎదుగూ బొదుగూ లేకుండా పోవడానికి కారణం వాళ్ళు… వీళ్ళు కాదని, అంతా అక్కడున్న వాళ్ళే చేస్తున్నారని అధిష్టానం పెద్దల వైపు మళ్లుతున్నాయి వేళ్ళు. అలా చెబుతున్న వాళ్లు అందుకు కారణాలను కూడా చూపిస్తున్నారు. సీఎం జగన్‌ ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కావలి ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలపై సీఎంను కలిసి నివేదిక ఇచ్చేందుకు జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడొకరు ప్రయత్నించారు. ఆ నాయకుడిని ముందుకు వెళ్లనివ్వకుండా డీఎస్పీ అడ్డుకోవడమే కాకుండా.. కాళ్ల మధ్యలో పీకను నొక్కిపట్టేశారు. ఆ ఫోటో బాగా వైరల్‌ అయింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలన్నీ స్పందించాయి. కానీ బీజేపీ హైకమాండ్‌ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. అటు అమిత్‌ షా కానీ.. ఇటు జేపీ నడ్డా కానీ ఈ ఘటనపై స్పందించి ఉంటే కార్యకర్తల్లో మరింత జోష్‌ వచ్చి ఉండేదని అంటున్నారట ఏపీ నాయకులు. చిన్న చితకా అంశాలకు స్పందించకపోయినా ఫర్వాలేదని.. కానీ ఓ బీజేపీ నేత తలను పోలీస్‌ అధికారి తన బూటు కాళ్ల మధ్య నొక్కిపెట్టి కర్కశంగా ప్రవర్తించిన ఘటనపై కూడా నోరు మెదపకుంటే దాన్నెలా అర్దం చేసుకోవాలని అంతర్గతంగా చర్చించుకుంటున్నారట ఏపీ కమలనాధులు. అంత క్రూరంగా ఉన్న ఆ ఫొటో చూసైనా స్పందించకపోతే ఇక రాష్ట్రంలో రాజకీయం ఎలా చేయగలమని నిట్టూరుస్తున్నారట.

ఇలాంటి సందర్భాల్లో కూడా రియాక్ట్‌ అవకపోవడం వల్లే వైసీపీ-బీజేపీ ఒకటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తోందని అంటున్నారట ఆంధ్ర బీజేపీ నేతలు. ఆ ఘటన మీద ఢిల్లీ నాయకత్వం స్పందించి ఉంటే…ఇక్కడి పోలీస్‌ యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టేవని.. అలా చేయకపోవడం వల్ల తామంటే స్థానికంగా లెక్కలేనితనం పెరిగిపోతోందని ఆవేదనగా ఉన్నారట. అయితే ఈ విషయం పార్టీ పెద్దల దృష్టిలో ఉందని అంటున్నారు కొందరు కమలనాధులు. దీనిపై జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని.. దీన్ని పార్టీ పెద్దలు దగ్గరుండి ఫాలో అప్‌ చేస్తున్నారని అంటున్నారు. బీసీ కమిషన్‌ త్వరలోనే స్పందిస్తుందని, ఏపీ పోలీసులకు తామేంటో కచ్చితంగా చూపిస్తామని చెప్పుకొస్తున్నారట సదరు నాయకులు. మరో వర్గం మాత్రం ఆ మాటల్ని నమ్మడం లేదు. జాతీయ స్థాయిలో నిజంగానే డెవలప్‌మెంట్స్‌ ఉంటే… వాటిని బయటికి చెప్పకుండా దాచుకోవడంలో అర్ధం ఉందా అని ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా చూస్తే.. ఏపీ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఉందన్న సంకేతాలు బయటికి వెళ్తే తప్ప స్థానికంగా పార్టీ బలపడదని, అప్పటిదాకా తాము ఎంత చించుకున్నా… ఉపయోగం ఉండదన్న అభిప్రాయం ఎక్కువ మంది నాయకుల్లో ఉన్నట్టు తెలిసింది. తప్పంతా హైకమాండ్‌దే తప్ప తమది కాదని అంటున్నారట ఆ నేతలు.