Site icon NTV Telugu

Off The Record: నామ మాత్రంగా జనసేన-బీజేపీ పొత్తు.. మేడం మార్చేస్తారా..?

Purandeswari

Purandeswari

Off The Record: జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్నా… అది పేరుకే తప్ప రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసింది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి ఉద్యమించిన దాఖలాలు లేవు. పైగా… అందుకు కారణం మీరంటే… మీరంటూ.. పరస్పరం విమర్శలు సైతం చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీకున్న అధికారానికి, లోకల్‌గా పవన్‌కున్న మాస్‌ ఇమేజిని కలగలిపి గట్టిగా వర్కవుట్‌ చేసి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదని, ఆ పని మానేసి నిందారోపణలతో కాలం వెళ్ళబుచ్చడంతో… ఇద్దరూ నష్టపోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్న అభిప్రాయం.

మంచి ఫలితాలివ్వాల్సిన పొత్తు నామ్‌కే వాస్తేగా మిగిలిపోవడానికి కారణం బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇంకొందరు వైసీపీ అనుకూలురైన నేతలేనన్న భావన జనసేన వర్గాల్లో బలంగా ఉంది. అందుకే ఓ అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహారం మారిపోయిందన్నది వారి మాట. వివిధ సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు.. వివిధ అంశాల్లో జగన్‌ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి రావడం లేదనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో వీర్రాజును మార్చి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించడంతో ఇప్పడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్‌ను కొత్త అధ్యక్షురాలు తగ్గిస్తారని ఏపీ బీజేపీ వర్గాల్లో నమ్మకం కుదురుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా… పెద్దగా గుర్తించినట్టు కనిపించని జనసేనాని …పురంధేశ్వరిని నియమించిన వెంటనే కంగ్రాట్స్‌ చెబుతూ ప్రకటన ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నాయి ఆ వర్గాలు. పరిస్థితి చూస్తుంటే.. గ్యాప్‌ తగ్గి వ్యవహారం చక్కబడుతుందన్న నమ్మకం పెరుగుతోందంటున్నారట ఏపీ బీజేపీ లీడర్స్.

పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే… కేడర్‌లో జోష్‌ నింపాలంటే ముందు జనసేనతో మీటింగ్‌ పెట్టి అంతరాలు తొలగించుకోవడం ముఖ్యం అన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయమట. ఓ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటే తప్ప రెండు పార్టీల మధ్య ఉన్న అవరోధాలు, అప నమ్మకాలు తొలిగిపోవంటున్నారు బీజేపీ సీనియర్స్‌. ఇన్నాళ్ళు సోము వీర్రాజు జనసేనతో టచ్‌మీ నాట్‌ అన్నట్టుగా ఉండటమే అసలు సమస్య అని, ఇక నుంచి కొత్త అధ్యక్షురాలు ఆ స్థితిలో మార్పు తీసుకు రావాలంటున్నారు. మరి పురంధేశ్వరి ప్రాధాన్యతల్లో జనసేన ఉందా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్‌ మార్క్‌.

Exit mobile version