Off The Record: నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గతపోరు చల్లారకపోగా అంతకంతకూ పెరుగుతోంది. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతున్న ఘటనలు అగ్గికి ఆజ్యం పోస్తున్నాయట. గతంలో భూమా, ఏవీ వర్గాల ఘర్షణలు, పరస్పరం కేసులు పెట్టుకున్నా, యువగళం పాదయాత్ర ఘర్షణ తరువాత మేటర్ ముదిరిపోయింది. సుబ్బారెడ్డి మరింత స్పీడ్ పెంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పట్టుకోసం పావులు కదుపుతున్నారన్నది లోకల్ టాక్.
దీని మీద భూమా వర్గం అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసిందట.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
నంద్యాలలో యువగళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అఖిల ప్రియకు సుబ్బారెడ్డి కాలు తగలడం, ఇద్దరి మధ్య మాట మాట పెరిగి సుబ్బారెడ్డిపై దాడి జరగడం అప్పట్లో పార్టీ పరంగా కలకలం రేపింది. పరస్పరం హత్యాయత్నం కేసులు పెట్టుకున్నారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి రచ్చ పెరగకుండా ఆగినా….అఖిల ప్రియ అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాక ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ తర్వాతి నుంచే ఏవీ సుబ్బారెడ్డి… భూమా వర్గానికి వ్యతిరేకంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట. గ్రామాల్లో తిరుగుతూ ముఖ్య నేతలను కలుస్తున్నారట. నంద్యాలలో తనపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇందులో తప్పు ఎవరిదో చెప్పాలని మండల స్థాయి టీడీపీ నేతలతోపాటు సామాన్యులనూ ప్రశ్నిస్తున్నారట. ఆళ్లగడ్డలో బలపడడం ద్వారా ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని టీడీపీ అధిష్టానంపై ఒత్తిడితెచ్చే వ్యూహంలో సుబ్బారెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: Off The Record: ఆ జిల్లా టీడీపీలో కొత్త నేతల హడావిడి మొదలైందా..?
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి పర్యటనలపై అఖిలప్రియ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాను నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నప్పుడు ఆయన ఎలా తిరుగుతారన్నది అఖిల క్వశ్చన్. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదు. పాదయాత్రలో ఘర్షణ పై టీడీపీ అధిష్టానం నియమించిన త్రీమెన్ కమిటీ నివేదిక ఇచ్చింది. దాని మీద కూడా మౌనంగానే ఉంది అధినాయకత్వం. ఇలా ప్రతి విషయంలోనూ… మౌనం దాల్చడంపై నంద్యాల టీడీపీలో చర్చ జరుగుతోందట. ఈ అగ్గి ఇలా రాజుకుంటూనే ఉంటే… ఎన్నికల ఏడాది మేమెలా పనిచేయాలని ఆందోళన పడుతున్నారట కార్యకర్తలు.