Off The Record: ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ఓటమి ఎరుగని వాళ్ళు ఆ ఇద్దరు మాజీ మంత్రులు. పార్టీ ఏదైనా సరే… గెలుపు ట్రాక్ ఆ ఇద్దరికీ. ఒకప్పటి ఆప్తమిత్రులు కూడా. అలాంటి ఇద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడుతున్నారు. దీంతో తొలిసారి ఓడేది ఎవరు? గెలిచి అసెంబ్లీ గేటు దాటేది ఎవరన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా ఇద్దరు మాజీ మంత్రులు? ఎక్కడ తలపడబోతున్నారు?
భీమిలి బాద్ షా ఎవరు…?. సీనియారిటీ చక్రం తిప్పుతుందా…!!. విధేయతకు పట్టం కడతారా? ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న హాట్ హాట్ డిబేట్ ఇది. ఎందుకంటే… ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు, పై ఎత్తులతో నరాలు తెగే ఉత్కంఠ పెరుగుతోందట. భీమిలి బరిలో తొలిసారి పోటీకి దిగుతున్నది ఒకప్పటి ఆప్తమిత్రులు, అంతకు మించి గురు శిష్యులు. వాళ్ళ అదృష్టమో….ప్రజాభిమానమోగానీ… ఇప్పటి వరకు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఇద్దరూ గెలుపు గుర్రాలే. అటు వంటి బలమైన కాపు నేతలు భీమిలి అడ్డాలో బలప్రదర్శనకు దిగడంతో ఉత్కంఠ రేగుతోంది. ఎవరు ఎవరికి చెక్ పెడతారనేది ఆసక్తిగా మారింది. గంటా శ్రీనివాసరావు….నాలుగు సార్లు ఎమ్మెల్యే…రెండు సార్లు మంత్రి…ఒకసారి ఎంపీ అయ్యారు. అవంతి శ్రీనివాస్‌కు తొలి విజయం భీమిలిలోనే. 2014లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరపున పోటీ చేస్తే భీమునిపట్టణం ప్రజలు ఆదరించారు. ఇక ప్రతిసారీ నియోజకవర్గాలు మార్చే అలవాటున్న గంటా… రాజకీయంగా తన ఎదుగుదలకు కారణం అయిన భీమిలి సీటు కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. సరిగ్గా ఇక్కడ నుంచే రాజకీయం రసకందాయంలో పడింది. గంటాకు తొలిసారి బలమైన రాజకీయ ప్రత్యర్ధి రూపంలో ఆయన ఒప్పటి ఆప్త మిత్రుడు అవంతి శ్రీనివాస్ రావడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో భీమిలిలో బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ఉధ్ర్రతంగా నిర్వహిస్తున్నారు.
వైజాగ్ ఎంపీ సీటులో వైసీపీ తరుపున బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండగా….సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ చాణక్యం నడుపుతున్నారు. సెమీ అర్బన్ నియోజక వర్గమైన భీమిలిలో పట్టుబిగించేందుకు వైసీపీ ఇప్పటికే విస్త్రతమైన గ్రౌండ్ వర్క్ చేసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం కాగా.. ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారు మూడున్నర లక్షలు. జగన్ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే… భీమిలి రాజధాని ప్రాంతం అవుతుంది. ఇటువంటి కీలక స్ధానంలో ఎట్టిపరిస్ధితుల్లోనే గెలిచి తీరడం అనేది వైసీపీ హైకమాండ్ కు ఇజ్జత్ కా సవాల్ . అదే సీటులో పోటీకి రెడీ అయి తొడగొడుతున్నారు గంటా. దీంతో భీమిలి యుద్ధం పతాక స్ధాయికి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. తన చేతిలో ఓడిపోవడానికే గంటా భీమిలి వస్తున్నారని పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అవంతి. దాంతో పాటు అవంతి చేసే ఆరోపణలపై స్పందించడం లేదు గంటా. కారణం, ఒకరు లోతులు ఒకరికి స్పష్టంగా తెలియడమే. పైగా, విమర్శలు, ప్రతివిమర్శలతో కాలయాపన కంటే సైకలాజికల్‌గా గా దెబ్బ కొట్టుకో వడమే కీలకంగా భావిస్తున్నారట ఈ మాజీ మంత్రులు. రాజకీయ వలసలు ప్రోత్సహించడం మొదలు పెట్టారు గంటా. ఒక జెడ్పీటీసీ సహా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలకు పసుపు కండువాలు కప్పేస్తున్నారు. అయితే వైసీపీ నుంచి స్ధానిక నాయకత్వంను కదిలించినంత మాత్రాన ఇక్కడ టీడీపీకి బలం పెరిగినట్టు కాదనేది ఒక విశ్లేషణ. గత ఐదేళ్ళుగా గంటాకు భీమిలి కేడర్ తో సంబంధాలు తగ్గిపోయాయి. ఇన్చార్జ్ గా వున్న కో రాడ రాజబాబు టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో వున్నారు. జనసేన నుంచి ఐదేళ్ళుగా పోరాటం చేసిన పంచకర్ల సందీప్ వర్గం సైలెంట్ అయిపోయింది. అధిష్టానం ఆదేశించినందున మొక్కుబడిగా పనిచేసినా… ఇక్కడ కూటమి తరపున మనసుపెట్టి నిలబడే వాళ్ళు గంటాకు ఇప్పటికిప్పుడు దొరకడం లేదట. అయితే, గతంలో ఎలక్షనీరింగ్ చేసిన అనుభవం, భీమిలిలో వున్న పరిచయాలు ఖచ్చితంగా పనికొస్తాయనే అంచనాలు వున్నాయి. ఈ పరిస్థితుల్లో భీమిలి ఏపీ మొత్తం మీద హాట్ సబ్జెక్ట్ అయింది.