Off The Record: నంద్యాల జిల్లా బనగానపల్లెలో టిడిపి, వైసిపి పోరు పొగలు సెగలు రేపుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరస్పర ఆరోపణలు ఒకవైపు, కాటసాని అనుచరుడి కిడ్నాప్, మరో అనుచరునిపై దాడి ఘటనలతో పరిస్థితి చేయిదాటి పోయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయట. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి ఆచారి పై టిడిపి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అటు ఎనకండ్లకు చెందిన వడ్డే సుబ్బారాయుడు అనే వ్యక్తిని కిడ్నాప్ చేయడం వంటి ఘటనలతో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయట. ఒకే రోజు రెండు ఘటనలు జరగడంతో… వైసీపీ శిబిరం ఆగ్రహంతో రగిలిపోతోందట. అదే సమయంలో పోలీసుల తీరుపై మండి పడుతున్నారు మాజీ ఎమ్మెల్యే. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు అరాచకాలు సృష్టిస్తూ దాడులు పాల్పడుతున్నా… పోలీసులు మాత్రం తమాషా చూస్తున్నారని, వాళ్ళే సకాలంలో స్పందించి ఉంటే… ఇవన్నీ జరిగేవి కావని ఆరోపిస్తున్నారు కాటసాని. బనగానపల్లె ఫ్యాక్షన్ ప్రాంతం కాబట్టి ఎప్పుడూ సెన్సిటివ్ గానే ఉంటుందనీ… మంత్రి జనార్దన్ రెడ్డి సామరస్యంతో రాజకీయం చేయకుండా రెచ్చగొడితే… పరిస్థితులు వేరేలా మారిపోతాయని అంటున్నారు స్థానిక వైసీపీ నాయకులు.
వీటిని ఆపకపోతే మును ముందు జరిగే ఘటనలకు మేము బాధ్యులం కాదనీ, సహనం నశిస్తే ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేమని కాటసాని రామిరెడ్డి హెచ్చరించడం నియోజకవర్గంలో తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. తాము చేతగాని వాళ్లం కాదని, రేపో ఎల్లుండో ఒకటో రెండో లేస్తాయంటూ ఎస్సై దుగ్గిరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే ఫైరైపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు స్థానికులు. తాజా పరిణామాలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మంత్రి వర్గీయులు మాత్రం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమంటున్నారట. వైసీపీ పాలనలో ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోమని కౌంటర్ ఇస్తున్నారు. అపుడు దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, బీసీ జనార్దన్ రెడ్డిని జైలుకు పంపడంవంటి పరిణామాలను ఎలా మర్చిపోతామన్న చర్చ జరుగుతోందట టీడీపీ వర్గాల్లో.
Read Also: Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్
వెన్నుపోటు దినం ర్యాలీ సందర్భంగా కాటసాని రామిరెడ్డి…. బీసీ జనార్దన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటున్నారు. మంత్రి పదవి కోసం టీడీపీ పెద్దలకు 250 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని, కంకర క్రషర్ మిషన్ల యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కాటసాని ఆరోపించడాన్ని సహించలేకపోతున్నారట టీడీపీ నాయకులు. ఇక కోవెలకుంట్లలో 6 పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాటసాని. దీనికి కూడా టీడీపీ వైపు నుంచి గట్టిగానే కౌంటర్స్ పడ్డాయి. ఇలా… తరచూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో… ఈ ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుందోనన్న భయం పెరుగుతోంది నియోజకవర్గంలో. బనగానపల్లె నియోజకవర్గం ఇప్పుడిప్పుడే ఫ్యాక్షన్ నుంచి బయటపడి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో ప్రస్తుత రాజకీయం మళ్ళీ ఫ్యాక్షన్‌కు పురుడు పోస్తుందా అన్న భయాలు సైతం పెరుగుతున్నాయి. ఈ రాజకీయ ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.
