Off The Record: మంత్రి రోజా మీద మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో విపరీతంగా చర్చకు దారి తీశాయి. గతంలో అయ్యన్న పాత్రుడు వంటి నేతలు అన్న మాటలు ఒక రకమైతే… ఇప్పుడు బండారు కామెంట్స్ అంతకు మించి అన్నట్టుగా ఉన్నాయని టీడీపీ నేతలే అనుకుంటున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ మాటలు విని టీడీపీలోని చాలా మంది నేతలే షాక్ అయ్యారట. ఓ పక్క చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో వీలైనంత వరకు సానుభూతి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంభిస్తోందని, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ తరహా కామెంట్లు టీడీపీని సహజంగానే ఇరకాటంలోకి నెట్టేసినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం ముమ్మరంగా సాగింది. ఇదే సందర్భంలో బ్రాహ్మణి, భువనేశ్వరి తెర మీదకు వచ్చారు. వాళ్లు కూడా వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకట్రొండు సందర్భాల్లో ప్రభుత్వానికి గట్టిగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు భువనేశ్వరి త్వరలోనే బస్ యాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ విధంగా.. నందమూరి ఆడపడుచులు రోడ్డెక్కి ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన కామెంట్స్ పార్టీ మహిళా నాయకత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
ఆడవాళ్ళను అంత నీచంగా మాట్లాడవచ్చా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ లెక్కన చూసుకుంటే.. బండారు కచ్చితంగా టీడీపీని ఇరకాటంలోకి నెట్టేశారన్న భావన కలుగుతోందంటున్నారు కొందరు పార్టీ నాయకులు. ఇదే సందర్భంలో టీడీపీలో మరో చర్చా జరుగుతోంది. రోజా మీద బండారు కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డామని ముందు అనిపించినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చాలా వరకు ఊరట లభించిందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. మంత్రి ఉద్దేశించి మాజీ మంత్రి అన్న మాటలతో పాటు.. మంత్రి టీడీపీలోని మహిళలను ఉద్దేశించి గతంలో అన్న మాటలు, కొన్ని సందర్భాల్లో ఆమె హావభావాలని మరోసారి బయటికి తీసి విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నాయి ఇటు టీడీపీ, అటు జనసేన సోషల్ మీడియా వింగ్స్. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి పీతల సుజాతను ఉద్దేశించి చేసిన కామెంట్స్,.. రోజా హావాభావాలను ట్రోల్ చేస్తున్నాయి రెండు పార్టీలు. అలాగే లోకేష్ పుట్టుక విషయంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడారు? తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. ఇతర మహిళా నేతల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే అంశం పైనా సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
వీటితో పాటు పవన్ కళ్యాణ్ తల్లిని, మెగా ఫ్యామిలీని ఉద్దేశించి వైసీపీ నేతలు గతంలో అన్న మాటలు కూడా మరోసారి తెర మీదికి వచ్చాయి. ఇదంతా చూస్తుంటే… కొంత ఇబ్బంది కలిగినా ఎక్కువగా అవతలి వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయగలిగామన్న అభిప్రాయం ఉందట టీడీపీ వర్గాల్లో. బండారు తరహా కామెంట్స్ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఇబ్బంది పడేవాళ్లమేమో కానీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సమస్య లేదన్నది టీడీపీ వెర్షన్‌గా కనిపిస్తోంది. ఎమ్మార్వో వనజాక్షి అంశం గత ఎన్నికల్లో తమను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాలను మరిచేలా మరిన్ని ఘోరాలు చేసింది కదా అంటున్నారు పార్టీ నాయకులు. ఇక రోజా కూడా వివిధ సందర్భాల్లో ప్రత్యర్థులను నోటికొచ్చినట్టు మాట్లాడి ఉండటంతో… బండారు ఘాటుగా అన్నా… ఆ ప్రభావం పార్టీ మీద అంతగా ఉండదన్నది టీడీపీ వర్గాల విశ్లేషణగా చెబుతున్నారు. అయితే… పార్టీ ఏదైనా, నాయకులు ఎవరైనా సరే… మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదన్న అభిప్రాయం మాత్రం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇకపై ఇలాంటి తప్పులు జరక్కుండా అధిష్టానం ఇప్పటికే నాయకులందరికీ ఓ తరహా వార్నింగ్ ఇచ్చిందనేది టీడీపీ వర్గాల సమాచారం.