Off The Record: గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టింది గ్రేటర్ రాయలసీమ. ఇక్కడ దాదాపుగా అన్ని అన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీకి అండగా నిలిచాయి. కానీ.. ఈసారి మాత్రం అందులో బలిజల సహకారం అనుమానమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాపులనే రాయలసీమలో బలిజలుగా పిలుస్తారు. కానీ.. ఈ విడత సీమలో ఆ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు వైసీపీ. దీంతో వాళ్లంతా గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నాయి. దాదాపు పాతిక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి వాళ్ళది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రాజంపేట లోక్‌సభ పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక తిరుపతి పార్లమెంటులో అయితే తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఎక్కువుగా ఉన్నారు బలిజలు.
కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు సిటీ, ఎమ్మిగనూరు, ఆదోనిలో వీరి ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో వీరి వల్ల అత్యధికంగా లబ్ది పొందింది కూడా వైసీపీయేనన్నది ఓ పరిశీలన. అయినాసరే.. ఈ విడత మొత్తం 52 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదు అధికార పార్టీ. దీంతో తీవ్రంగా రగిలిపోతున్నారట ఆ సామాజికవర్గం నేతలు. దీనికితోడు తనకు రాజ్యసభ ఇస్తామని చెప్పి.. హ్యాండిచ్చారంటూ జనసేనలో చేరిపోయారు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే సమయంలో ఆయనకు తిరుపతి టిక్కెట్ ఇచ్చింది జనసేన. అటు రాజంపేటలో కాపు నేత బాల సుబ్రమణ్యంకు టిక్కెట్ ఇచ్చింది టీడీపీ. ఇలా కూటమిలోని రెండు పార్టీలు చెరో సీటు బలిజలకు ఇవ్వడంతో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నది వైసీపీ నేతల అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎఫెక్ట్ పడకుండా పెద్దిరెడ్డి లాంటి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బలిజలకు కీలమైన పదవులు ఇచ్చామని, ప్రాధాన్యత పరంగా ఎలాంటి డౌట్స్ అవసరం లేదని వివరిస్తున్నారట. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా రాయలసీమలో ప్రచారానికి టిడిపి వంగవీటి రాధాను దింపింది. దీంతో పరిస్థితులు ఎక్కడ చేయిదాటి పోతాయోనని వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వంగవీటి రాధా ఇప్పటికే చిత్తూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేశారు. త్వరలో చంద్రగిరి, పుంగనూరు, నగరి సహా బలిజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోందట. ఇప్పటికే సీటు ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా బలిజలు.. రాధా ప్రచారంతో ఎలా రియాక్ట్ అవుతారోనన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి వద్ద కొద్దిమంది పార్టీ నేతలు తాజా పరిస్థితిని ప్రస్తావించినట్టు సమాచారం. బలిజల ఓట్లు దూరమైతే.. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఇబ్బంది ఉంటుదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దల అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో వంగవీటి రాధా ప్రచారం ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్ అయింది.