Off The Record: విజయనగరం జిల్లా టీడీపీలో తొలినాళ్ల నుంచి ఒకే ఒక సెంటర్ ఆఫ్ పవర్ ఉండేది. ఆ బంగ్లాలో తీసుకున్న నిర్ణయమే పార్టీ హైమాకమాండ్కు సైతం శిరోధార్యమట. గవర్నర్ గిరి నుంచి గ్రామస్థాయి ఆఫీస్ బేరర్ వరకు ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అక్కడే డిసైడ్ అవుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఆ సంప్రదాయానికి కేంద్రబిందువు అశోక్ గజపతి రాజు. ఆయన మాటకు టీడీపీ అధినేత సైతం సై అనేవారని తెలుస్తోంది. అందుకే విజయనగరం టీడీపీలో అశోక్ గజపతి రాజు తర్వాత ఎవరు?అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదట. నిజానికి…బంగ్లా పాలిటిక్స్ అంటే మామూలు వ్యవహారం కాదనేది జిల్లా నేతల మాట. ఎదిరిస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదన్న భయం క్యాడర్లో ఎప్పటి నుంచో పాతుకుపోయిందట. అందుకే బంగ్లా చుట్టూ తిరిగే వాళ్లపై ఎన్ని విమర్శలు ఉన్నా వదులుకోరనే టాక్ నడుస్తుండేది.
ఇక… ఎన్నికలకు ముందు కొందరు నాయకులు పార్టీలో చేరటం కోసం అశోక్ గజపతి రాజు వద్దకు వెళ్లిన సందర్భాలను గుర్తుచేస్తున్నారు క్యాడర్. ఆ సమావేశంలోనే ప్రస్తుత మంత్రి కొండపల్లి కుటుంబాన్ని ఉద్దేశించి వీళ్లు కిరికిరిగాళ్లు…మీరు ఇష్టపడే పార్టీలోకి వస్తున్నారా?అనే వ్యాఖ్యలు చేశారట అశోక్ గజపతిరాజు. ఆ మాటకు అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారని సమాచారం. అలా బంగ్లా మాటే పార్టీకి వేదవాక్యంగా కొనసాగిన కాలం అది. గతంలో మంత్రిగా పనిచేసిన కిమిడి మృణాళిని విషయంలోనూ అదే పరిస్థితి ఉండేదట. రాజుగారి మాటే ఆమె రాజకీయానికి మార్గదర్శకం అయ్యిందని రాజకీయ వర్గాల్లో అప్పట్లో ప్రచారం నడిచింది.
ఇంతకాలం బాగానే సాగిన వ్యవహారాల్లో ఇప్పుడు చాపకింద నీరులా మార్పులు జరుగుతున్నాయని పార్టీ వర్గల్లో టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారు పావులు కదుపుతూ, పదవులు దక్కించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బంగ్లా మాటకు విలువ తగ్గిందని చెప్పుకుంటున్నారట సొంత పార్టీ నాయకులు. ప్రస్తుతం ఇదే చర్చ క్యాడర్‌లోనూ మొదలైంది. కానీ ఈ విషయం మాత్రం బయటకు రానివ్వడం లేదని టాక్ నడుస్తోంది.
విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎంపికే ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంగ్లా మాటకు ఈసారి చుక్కెదురైందనే డైలాగ్ వినిపిస్తోంది. బంగ్లాను వదిలీవదలనట్టుగా ఉన్న కొందరు పెద్దలు తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. తమ పదవులను కాపాడుకోసం లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. బంగ్లా హవా కొనసాగితే రాబోయే రోజుల్లో తమకు ముప్పు ఉంటుందన్న భయం వెంటాడుతోందట. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి నాగార్జుననే కొనసాగించాలనే వ్యూహానికి అక్కడి వాళ్లే తెరలేపారని తెలుస్తోంది.
వాస్తవానికి అధ్యక్షుడి రేసులో మొదట నాగార్జున పేరు లేదన్నది పార్టీలో బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఆయనకు అప్పటికే డీసీసీబీ ఛైర్మన్ పదవి ఉంది. జోడు పదవులు పార్టీ అధినేత అనుమతించబోరన్న అంచనాతో ఆయన పేరు పక్కన పెట్టారని సమాచారం. అధ్యక్ష పదవికి పోటీ పడినవాళ్లలో డెంకాడ మాజీఎంపీపీ కంది చంద్రశేఖర్, సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, కరణం శివరామకృష్ణ, కొండపల్లి అప్పలనాయుడు ఉన్నారనే ప్రచరం సాగింది. ఇందులో కరణం శివరామకృష్ణకు బంగ్లా మనిషిగా ముద్ర పడిందట. అశోక్ గజపతి రాజు సిఫార్సులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మద్దతు ఉందన్న టాక్ గట్టిగానే నడిచింది. మిగిలిన ఎమ్మెల్యేల్లో కొందరు సువ్వాడకు, మరికొందరు చంద్రశేఖర్‌కు మద్దతుగా నిలిచారు. ఐతే శివరామకృష్ణకు అధ్యక్ష పీఠం ఇస్తే కొందరికి రాజకీయ ఇబ్బందులు వస్తాయన్న భయం ఉందని తెలుస్తోంది. దీంతో బ్యాక్‌డోర్ ప్లాన్‌లో అడ్డుకట్ట వేసినట్లు ప్రచారం నడిచింది. ఇంఛార్జి మంత్రి మనిషిగా సువ్వాడకూ గుర్తింపు ఉందట. ఆ పెత్తనాన్ని తగ్గించాలని పడని అదే వర్గం అడ్డు తగిలిందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. చివరికి నాగార్జుననే కొనసాగిస్తే చాలనే వాదనను పైకి తీసుకువచ్చి…తమ పంథాను నెగ్గించుకున్నారట. ఈ పరిణామాలతో బంగ్లా మాటకు ఈసారి విలువ లేకుండా పోయిందన్న భావన టీడీపీలో బలపడుతోంది.
ఇక…ఈ పరిణామాలతో శత్రువుగా భావించిన వర్గానికి చెందిన వ్యక్తి పక్కకు పోయేలా చేయగలిగారన్న సంతృప్తి కొందరిలో కనిపిస్తోందని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం పార్టీలో అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ కూడా నోరు మెదపడం లేదట. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు కొందరు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష పదవి, డీసీసీబీ ఛైర్మన్ పదవి రెండూ ఒకరికే ఇవ్వడం విజయనగరం టీడీపీలో ఎప్పుడూ లేని సంప్రదాయం అని పార్టీ నేతలే బాహాటంగా అంటున్నారని తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో పార్టీలో కొత్త చిచ్చు రేపుతోందని విజయనగరం జిల్లా టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోందని సమాచారం.