Nurse Recruitment Exam Paper Leak: మధ్యప్రదేశ్‌లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ నర్సుల నియామకం కోసం నిర్వహిస్తోన్న పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో రద్దు చేయబడింది. ప్రశ్నాపత్రం కాపీలను తీసుకెళ్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నర్సుల నియామకం కోసం రెండు భాగాలుగా పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండో రౌండ్లు పరీక్షను నిర్వహిస్తుండగా.. పేపర్ లీక్ అయినట్లు తేలడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పెద్ద రాకెట్‌లో భాగమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే పనిలో ఉన్న కంపెనీ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు గ్వాలియర్‌కు చెందినవారు, ఇద్దరు ప్రయాగ్‌రాజ్, మరో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా.. ఒకరు బీహార్‌కు చెందినవారు. ప్రధాన సూత్రధారి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నివాసి, పరారీలో ఉన్నట్లు తెలిసింది
ఉదయం మొదటి రౌండ్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష రద్దు చేయబడింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 2,284 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరిగింది. దాదాపు 45,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సోమవారం రాత్రి పక్కా సమాచారం మేరకు పోలీసులు గ్వాలియర్ జిల్లా శివార్లలోని టేకాన్‌పూర్ ప్రాంతంలోని ఓ హోటల్‌పై దాడి చేశారు. లోపల ఉన్న ఎనిమిది మంది నుంచి పరీక్ష పేపర్ కాపీలు లభ్యమయ్యాయి.
BJP: కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి.. అదానీతో ఉన్న రాబర్ట్ వాద్రా ఫొటోలు విడుదల
వారి వద్ద 80 మంది అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా లభించాయని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘీ వెల్లడించారు. అలాగే 39 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రశ్నాపత్రాల కోసం సుమారు రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. మోసం చేశారని ఆరోపిస్తూ వారిపై పోలీసు కేసు నమోదైంది. వీరిపై మధ్యప్రదేశ్ రికగ్నైజ్డ్ ఎగ్జామినేషన్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా అభియోగాలు మోపినట్లు తెలిసింది.