నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు’ కేసు:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ కూడా వేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది.
ఏపీ హైకోర్టులో బాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ:
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు. ఆ పిటిషన్లపై నేడు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై తన ఇంటి దగ్గరే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరుగనుంది.
సైక్లింగ్ టు ఓటు- వాక్ టు ఓటు పేరుతో వాక్తన్ కంపెయిన్:
హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైన ఎలక్షన్ కమీషన్ ఆధ్వన్యంలో ఓటర్ అవేర్నెస్ కంపెయిన్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. వాక్తన్, సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. సైక్లింగ్ టు ఓటు- వాక్ టు ఓటు పేరుతో వాక్తన్ కంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేలు పాల్గొన్నారు. ఇక, రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సైబరాబాద్ సీపీ స్టీపెన్ రవీంద్ర, ఉన్నత అధికారులతో పాటు పెద్ద ఎత్తున యువతీయువకులు పాల్గొన్నారు.
ఉల్లి వ్యాపారుల పోరాటానికి బ్రేక్:
దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ లాలాస్‌గావ్‌లో 13 రోజుల తర్వాత ఉల్లి వ్యాపారుల పోరాటానికి బ్రేక్ పడింది. దీంతో నాసిక్ జిల్లాలో ఉల్లి ఆన్‌లైన్ వేలం ప్రారంభమైంది. వేలంలో ప్రారంభ ధర క్వింటాల్‌కు రూ. 1000 నుంచి రూ. 2541 వరకు ఉంచారు. ఉల్లి ఎగుమతి సుంకం పెంపునకు నిరసనగా వ్యాపారులు సమ్మెకు దిగారు. దాదాపు 13 రోజుల తర్వాత నాసిక్ జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో ఉల్లి వేలం ఆరంభం అయింది. ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గావ్ ఏపీఎంసీకి మంగళవారం ఉదయం 545 బండ్లు చేరుకున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం:
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్థిరాస్తుల వ్యవహారంలో జిఅర్ కన్వెన్షన్స్ యజమాని రవి కాట్రగడ్డ.. నిర్మాత అంజిరెడ్డిని హత్య చేశాడు. డీమార్ట్ బెస్ మెట్ 2 సెల్లార్ పార్కింగ్‌లో ఇద్దరు బీహారీలతో కలిసి అంజిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. నిర్మాత పేరుతో పలు భవనాలను ధ్వంసం చేసేందుకే రవి కాట్రగడ్డ ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.
రహస్యంగా ఉర్ఫీ జావేద్ నిశ్చితార్థం:
తన అసాధారణ ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ఉర్ఫీ జావేద్.. మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె వార్తల్లో ఉన్నది తన బట్టల విషయంలో కాదు. ఉర్ఫీ నిశ్చితార్థం రహస్యంగా జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫోటోలలో ఉర్ఫీ సల్వార్ సూట్ ధరించి.. ఓ వ్యక్తితో పూజలో కూర్చున్నారు. ఫోటోలో ఆ వ్యక్తి ముఖం బ్లర్ చేయబడి ఉంది. ఉర్ఫీ అతనికి ఉంగరం పెట్టారు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు:
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం ఉదయం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–16తో పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ఇక రజత పతకాన్ని ఖాయం చేసేందుకు తెలుగు తేజం సింధు మరో గెలుపు దూరంలో ఉంది.
టెండూల్కర్‌కు అరుదైన గౌరవం:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023కి సచిన్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గ్లోబల్ అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీతో సచిన్ మైదానంలోకి వస్తాడు. దాంతో ప్రపంచకప్ 2023 అధికారికంగా ఆరంభం అవుతుంది.