నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు ఉంటాయి.
క్రిస్మస్ వేడుకల్లో విషాదం:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తాళ్లపల్లి శంకర్-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జస్వంత్, సుశాంత్ (13). దంపతులిద్దరూ కూలీ పనులు చేస్తుండగా.. ఇద్దరు కుమారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆదివారం క్రిస్మస్ పండుగకు సుశాంత్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ ఆనందంగా డాన్స్ ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇంతలోనే సుశాంత్ కిందకు పడిపోయాడు. సుశాంత్ కింద పడిపోవడంతో అందరూ షాక్ తిన్నారు. కుటుంబసభ్యులకు కాసేపు ఏమీ అర్థంకాలేదు. ఊరిపి ఆడకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు సుశాంత్ ను హుటాహుటిన సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స పొందుతూ సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించని రన్‌వే:
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలితో ప్రజలు వణికిపోతున్నారు. అదే సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పొగమంచు కారణంగా నల్గొండ జిల్లాలో ఇద్దరు, వికారాబాద్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పొగమంచు విమాన ప్రయాణానికి ఆటంకం కలిగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పైలట్లకు రన్‌వే కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విమానాలను నిలిపివేశారు.
నేడు హస్తినకు రేవంత్ రెడ్డి, భట్టి:
మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తినకు పయనం కానున్నారు. పీఎం మోడీ అపాయింట్‌మెంట్ ఫిక్స్ కావడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోడీని కలవనున్నారు. మర్యాదపూర్వకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిగా ఎవరు ఉంటే వారిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఈ ప్రత్యేక సమావేశంలో విభజన సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, వాటి అనుమతులపై ప్రధానితో చర్చించనున్నారు. అలాగే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని మోడీతో చర్చించనున్నట్లు సమాచారం.
అఖిలేష్ యాదవ్ కు తలనొప్పిగా మారిన ప్రసాద్ మౌర్య:
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ బ్రాహ్మణ సదస్సులో ఇచ్చిన హామీ 24 గంటలు కూడా నిలవలేదు. హిందూ మతానికి సంబంధించి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన హిందూ మతానికి ద్రోహం అన్నారు. మతం, కులం వ్యాఖ్యలపై నిషేధం విధిస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. పార్టీ అధినేత సలహాను పట్టించుకోని స్వామిపై సమాజ్‌వాదీ పార్టీ చర్యలు తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇజ్రాయెల్ యుద్ధ బడ్జెట్ వెల్లడి:
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకు శాంతి, స్థిరత్వం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాల్పుల విరమణ కారణంగా కొన్ని సర్కిల్స్‌లో ఏర్పడిన ఆశ కూడా కాలక్రమేణా ఆవిరైపోయింది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అంచనా ఈ సందర్భంలో మరొకటి సూచిస్తుంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. హమాస్‌పై ఇజ్రాయెల్ ఆపరేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. 2024లో గాజాపై సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి ఇజ్రాయెల్ దాదాపు 50 బిలియన్ షెకెల్స్ లేదా 14 బిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా, ఇజ్రాయెల్ బడ్జెట్ లోటు మూడు రెట్లు చేరవచ్చు. వీటిలో దాదాపు 30 బిలియన్ షెకెళ్లను భద్రత కోసం ఖర్చు చేయనుండగా, మిగిలిన 20 బిలియన్ షెకెళ్లను పౌరులకు సంబంధించిన ఇతర ఖాతాలకు ఖర్చు చేయనున్నారు.
ఫ్యామితో ఎన్టీఆర్ జపాన్ టూర్:
జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు వెకేషన్ బయలుదేరారు. ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులతో కలిసి ఎన్టీఆర్ జపాన్ వెకేషన్ వెళ్లారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెకేషన్ వెళ్లారు. సినిమాల విషయానికొస్తే.. దేవర తర్వాత హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 మల్టీస్టారర్ మూవీలో తారక్ నటించాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తో చిత్రం కూడా ప్రారంభం అవుతుందట.
మెగా హీరోలందరూ ఒక్కచోట కలిస్తే పండగే:
సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప్పలేము. మెగా, అల్లు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒక్కచోటకు చేరారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒక్కటిగా కనిపించడం.. ఆయా హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.
నేడే దక్షిణాఫ్రికా, భారత్ తొలి టెస్టు:
దక్షిణాఫ్రికాపై టీ20, వన్డేల సిరీస్‌లు గెలుచుకున్న భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఇరు జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సఫారీ గడ్డపై టెస్టుల్లో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో రోహిత్ సేన ఉంది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రెండు టీమ్‌ల నుంచి కూడా టీ20, వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న టాప్ ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం తప్పేలా లేదు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి ఆరంభం కానుంది.