*నేటి నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు వెబ్ ఆప్షన్లు!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల అయింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) గురువారం ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కన్వీనర్ కోటా సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు శుక్రవారం (ఆగష్టు 4) ఉదయం 10 గంటల నుంచి ఆదివారం (ఆగష్టు 6) సాయంత్రం 6 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ జాబితా, వైద్య కళాశాలల వారీగా సీట్ల వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో ఉంటాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలకు కూడా కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆగష్టు 4 ఉదయం 10 గంటల నుంచి ఆగష్టు 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలన అనంతరం అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల కానుంది. ఈఏడాది విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వార్షిక ఫీజు రూ. 12 వేలుగా ఉంది. ఇదే ఫీజు మరో మూడేళ్ల పాటు కొనసాగనుంది. ప్రైవేటు/ మైనార్టీ/ నాన్‌మైనార్టీ, ఈఎస్‌ఐ కాలేజీల్లో ఏ కేటగిరి (కన్వీనర్ కోటా) సీట్ల ఫీజును యథాతథంగా ఉంచారు. గతంలో ఏడాదికి రూ. 60 వేలు ఉండగా.. రానున్న మూడేళ్లకు ఇదే కొనసాగనుంది. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఫీజును తగ్గించారు. దక్కన్ కాలేజి ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బీ కేటగిరి సీటు ఫీజును రూ. 14.5 లక్షలు నుంచి రూ. 12.50 లక్షలకు.. షాదన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫీజును రూ. 14 లక్షల నుంచి రూ. 12 లక్షలకు తగ్గించారు. అపోలో వైద్య కళాశాల, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ల్లో బీ కేటగిరి సీటు ఫీజు రూ. 12.5 లక్షల నుంచి రూ. 13 లక్షలకు పెరిగింది. మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీ, మమత అకాడమీ ఆఫ్‌మెడికల్ సైన్సెస్, ప్రతిమా, మెడిసిటీ, ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బీ కేటగిరి సీటు ఫీజు రూ. 11.55 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెరిగింది.
*నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. వచ్చే సోమ, మంగళవారాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి సీఎం ఓ కార్యాలయం ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని అధికారికంగా విడుదల చేస్తుంది.
*సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం
గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి. గంజాయి, గుట్కాలు గుట్టు చప్పుడు కాకుండా ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. చాలా కాలంగా ఖైదీలకు మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సెంట్రల్ జైలులో ఖైదీలకు మత్తు పదార్థాలను చేరవేస్తున్న మైలపల్లి ఎల్లాజీని సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మత్తు పదార్థాలను బాల్స్‌లాగా చుట్టి జైలు గోడ మీద నుంచి విసరడం ద్వారా ఖైదీలకు నిందుతుడు చేరవేస్తున్నాడు. చాలా కాలంగా నిందితులను పట్టుకోవాలని వేచిచూస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని పట్టుకోవడం కోసం నిఘా పెట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఆరిలోవ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబమని పోలీసులు హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
*అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాజాగా INDIA కూటమిలో ప్రధాన సభ్యురాలైన మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశపెట్టిన సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూనే.. ఊహించని షాకిచ్చారు. మీ INDIA కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోడీనే అధికారంలోకి వస్తారన్న లోక్‌సభలో అమిత్ షా వ్యాఖ్యానించగా.. ఆయన చెప్పింది కరెక్టేనంటూ మమతా కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలోనే పార్లమెంట్ ఉంది కాబట్టి.. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. అమిత్ షా తెలిసి అన్నారో, తెలియక అన్నారో తెలీదు కానీ.. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో అధికారం INDIA కూటమిదేనన్నారు. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే ఈ కూటమి ఏర్పడిందని అన్నారు. తమ INDIA కూటమి కొత్తదే అయినా.. దేశవ్యాప్తంగా తమకు ఉనికి ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. NDA కూటమి బలహీనమైందని.. అందులోని సభ్యులు కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని చెప్పారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే.. తమ INDIA కూటమి అధికారంలోకి రావాల్సిందేనని నొక్కివక్కాణించారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామని అంటున్నారని.. తమకు కూడా కాషాయమంటే ఇష్టమని, కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వాళ్లు కేవలం హింసనే ఎంచుకుంటున్నారని మండిపడ్డారు. కాషాయం మన హిందు దేవుళ్లకు, త్యాగానికి సంబంధించిన దివ్యమైన రంగు అని.. ఒకవేళ ఈ రంగుని వాళ్లు హింస కోసం వినియోగిస్తే.. దాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని వెల్లడించారు. టెర్రర్ సృష్టించడం వారి సాంప్రదాయమని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు చిత్రహింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రిపోర్టర్లను కూడా ‘నువ్వు హిందువా? ముస్లిమా?’ అని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస తప్ప వేరే మార్గం లేదని వారు అనుకుంటున్నారని మమతా ధ్వజమెత్తారు.
*భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది గల్లంతు
రుద్రప్రయాగ్‌లోని గౌరీకుండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి.. కేదార్‌నాథ్ యాత్ర ప్రధాన స్టాప్ వద్దనున్న రెండు షాప్‌లపై దూసుకొచ్చాయి. ఈ దెబ్బకు ఆ రెండు షాప్‌లు పూర్తిగా కూలిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. వాటిల్లో చాలామంది నిద్రిస్తున్నారు. అందుకే, ఈ ప్రమాదాన్ని వాళ్లు పసిగట్టలేకపోయారు. ఈ ఘటనలో 13 మంది గల్లంతు అవ్వగా, ఇంకా చాలామంది ఈ శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసి.. NDRF, SDRF బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కానీ.. ఎడితెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో.. రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఘటనపై ఒక అధికారి మాట్లాడుతూ.. భారీ వర్షాల దెబ్బకు కొండచరియలు విరిగిపడి, రెండు షాప్‌లపై పడ్డాయని అన్నారు. ఆ దుకాణాలు పూర్తిగా కూలిపోగా.. అందులో నిద్రిస్తున్న జనాలు శిథిలాల కింద ఇరుక్కుపోయారని, మరో 13 మంది గల్లంతయ్యారని అన్నారు. గల్లంతైన వారిలో నేపాల్, స్థానిక ప్రజలు ఉన్నారన్నారు. మరోవైపు.. వర్షం కారణంగా మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాలకు గురువారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో.. మూడు జిల్లాల్లోనూ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఇదే సమయంలో.. డెహ్రాడూన్, హరిద్వార్, పౌరీ, ఉధమ్ సింగ్ నగర్‌లలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
*బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన పసిడి ధరలు!
బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. ఈ రెండు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 450 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,350లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా వరుసగా రెండోరోజు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 75,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏకంగా రూ. 2300 తగ్గింది. ఈ రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ. 3000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,000గా ఉండగా.. చెన్నైలో రూ. 78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,500ల వద్ద కొనసాగుతోంది.
*మారుతీ సినిమా నుంచి ఈరోజైనా అప్డేట్ వస్తుందా మాష్టారు?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్ గా సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు మారుతీ. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన షూటింగ్ ని చాలా వరకూ మారుతీ కంప్లీట్ చేశాడని టాక్. షూటింగ్ నుంచి లీక్ అయిన ప్రభాస్, మారుతీ కలిసి ఉన్న ఫోటోలు తప్ప మరో అఫీషియల్ అప్డేట్ అయితే ఈ ప్రాజెక్ట్ గురించి బయటకి రాలేదు. లీక్ అయిన ఫోటోస్ లో ప్రభాస్ స్టైలిష్ గా ఉండడంతో ప్రభాస్ అభిమానుల దృష్టి మారుతీ సినిమాపై పడింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్ ని బట్టి చూస్తే… ఈ మూవీలో అప్పుడప్పుడూ ప్రభాస్ లోకి ఒక ఆత్మ వచ్చి వెళ్తుందని, దాని ద్వారా ఫన్ జనరేట్ చేస్తూ సినిమా సాగుతుందని సమాచారం. ప్రభాస్ తో కామెడీ టచ్ ఉన్న సినిమా లేదా పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకి చాలా ధైర్యం కావాలి. ఆ సాహసాన్ని చేయడానికి మేకర్స్ అయితే రెడీ అయ్యారు మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈరోజు హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే కావడంతో కనీసం ఈరోజైనా ప్రభాస్-మారుతీ సినిమా నుంచి ఒక్క అఫీషియల్ పోస్టర్ బయటకి వస్తుందేమో అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అలాంటి అప్డేట్స్ ఏవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. మరి మారుతీ, ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ ని ఎప్పటి నుంచి మొదలుపెడతాడు? ఎలాంటి కంటెంట్ తో బయటకి వస్తాడు అనేది చూడాలి.
*ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం
వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ సేనకు గట్టి షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించి 150 పరుగులు ఛేదించలేక 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ జట్టు 1-0తో ముందంజలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 41 పరుగులు, రోవ్‌మన్ పావెల్ 48 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు కూడా చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ స్కోరును అదుపు చేయగలిగారు. అనంతరం పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా బ్యాటర్లు.. విండీస్ బౌలర్ల ధాటికి కాస్త తడబడ్డారు. మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు తిలక్ వర్మ 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కానీ ఫెపర్డ్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి హెట్‌మేయర్‌కు చిక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 21, హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో మెక్‌కాయ్, హోల్డర్, షెపర్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హోసేన్ ఒక వికెట్ తీశాడు.