*నేడు ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రారంభించనున్న సీఎం జగన్
ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ విధానాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో విధానాన్ని ఆవిష్కరించనుంది. ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానాన్ని ముఖ్యమంత్రి పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఈ విధానాన్ని ప్రారంభించిన తర్వాత కావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. వైద్య, ఆరోగ్య సేవలు రాష్ట్రం నలుమూలల విస్తరించాలన్న ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరికీ స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దానికి ఫ్యామిలీ డాక్టర్ అనే నామకరణం చేసింది. ఈ విధానాన్ని ప్రభుత్వం కొన్ని రోజులుగా దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ వస్తోంది. అందులో మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. నేడు ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్‌ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టాల్స్‌ను సీఎం పరిశీలిస్తారు. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం జగన్ తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.
*పద్మభూషణుడు చినజీయర్
పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం చినజీయర్ స్వామి స్పందించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే అని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల రెండో విడత కార్యక్రమం బుధవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయర్‌కి పద్మభూషణ్ అవార్డు లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు వికాస్ తరంగిణి, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించి అందించే సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. “స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ” నినాదాన్ని మేం తీసుకొచ్చామన్నారు. ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా సరే సామాజిక సేవ విషయంలో అందరం కలసి పనిచేయాలన్నదే ఈ నినాదం లక్ష్యం అని తెలిపారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా సేవ చేయాలన్నదే మా ఉద్దేశమన్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడం ఉండదు. కానీ వైపరీత్యాలకు మనిషిలోని అత్యాశే కారణమన్నారు. ఒక జంతువు మరో జంతువును అవసరానికే చంపుతుందని వ్యాఖ్యానించారు.
*23 రోజుల శిశువుకు గుండెపోటు
వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా గుండెపోటు రావచ్చు. పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు అనే తేడా లేదు. ఇటీవలి కాలంలో ముప్పై ఏళ్లు నిండక ముందే నేడు యువత గుండెపోటుకు బలవుతున్నారు. రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సడన్ గా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడం వల్ల చాలామంది మృత్యువాతపడుతున్నారు. గుండెపోటుతో యువకులు, చిన్నారులు మరణిస్తున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. అయితే కొందరు హీరోలు చాకచక్యంగా వ్యవహరించి గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేయించి బతికిన సంఘటనలు కూడా చూశాం. సీపీఆర్.. ప్రస్తుతం గుండెపోటుతో పడిపోయిన వారికి లైఫ్ సపోర్టు. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఈ ప్రాణాలతో బయటపడింది. నెల కూడా నిండని పసికందు శ్వాస ఆగిపోతే సీపీఆర్ చేసి బతుకుతున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్, కవిత సిద్దిపేట్ జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పని చేస్తున్నారు. ఇటీవలే వీరికి పాప పుట్టింది. పాప వయసు 23 రోజులు. ఆమెకు సుబ్బలక్ష్మి అని పేరు కూడా పెట్టారు. అయితే పాపకు స్నానం చేయిస్తున్న సమయంలో వేడినీరు మింగడంతో ఊపిరి ఆగిపోయింది. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ సుగుణ వెంటనే 108 ఏఎన్‌ఎం తిరుమల సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ వెంటనే స్పందించి సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప గుండె, పల్స్ కొట్టకపోవడాన్ని సిబ్బంది గమనించారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు 108 సిబ్బంది సీపీఆర్ నిర్వహించి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిని మంత్రి హరీశ్ రావు వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ ట్విట్ చేశారు.
*ఇంటర్ వారికి గోల్డెన్ ఛాన్స్… రూ.63వేలతో ప్రభుత్వ ఉద్యోగం
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకోబోతోంది. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి 12వ తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి ఇగ్నో దరఖాస్తులను కోరింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 20 ఏప్రిల్ 2023గా నిర్ణయించబడింది. దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు. పరీక్షలో ఎంపికైన అభ్యర్థికి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 200 జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలు మరియు హిందీ టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు తప్పనిసరి. దరఖాస్తుదారుడి వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు. అయితే, రిజర్వ్‌డ్ తరగతులకు, వయోపరిమితిలో నిర్ణయించిన రిజర్వేషన్ ప్రకారం సడలింపు నిర్ణయించబడుతుంది. దరఖాస్తు రుసుమును కూడా ఇగ్నో నిర్ణయించింది. జనరల్ కేటగిరీ, OBC, EWS కేటగిరీల దరఖాస్తుదారులు రూ. 1,000 రుసుము చెల్లించాలి. కాగా, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా దరఖాస్తుదారులకు దరఖాస్తు రుసుము రూ. 600. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టుల నియామక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత CBT ద్వారా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు వేతనం లభిస్తుంది.
*ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచింది. ఆ తర్వాత ఉద్యోగుల జీతం పెరిగింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పే కమిషన్(8వ వేతన సంఘం)ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2024 సంవత్సరంలో ఉద్యోగుల జీతంలో భారీ పెంపుదల ఉండబోతోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త వేతన సంఘంపై కసరత్తు జరగనుంది. ప్రస్తుతం కొత్త వేతన సంఘం విషయంలో ఎంప్లాయిస్ యూనియన్ తరపున దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతోంది. బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎనిమిదో వేతన సంఘం గురించి ఎటువంటి చర్చ లేదు. దీనిపై పార్లమెంట్‌లో కూడా చర్చ నడుస్తోంది.
*ఢిల్లీలో హై అలర్ట్.. జహంగీర్‌పురిలో భారీ భద్రత..
హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. గతేడాది అల్లర్లను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే హనుమాన్ శోభాయాత్ర కోసం పోలీసులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది మతపరమైన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వాహకులతో సంప్రదిస్తున్నామని, వేడుకలు సురక్షితంగా జరిగేలా చూస్తామని ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్(లా అండ్ ఆర్డర్) దీపేంద్ర పాఠక్ తెలిపారు. మంగళవారం జహంగీర్‌పురి ప్రాంతంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రోజు శోభాయాత్ర నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. గతేడాది ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జహంగీర్‌పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. రాళ్లదాడి, వాహనాలు దహనం వంటి హింసాత్మక సంఘటలు చోటు చేసుకున్నాయి. గతవారం రామనవమి వేడుకల్లో కూడా ఇలాంటి మతఘర్షణలే చోటు చేసుకున్నాయి. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి.
*11 మంది బాలికలపై హెడ్ మాస్టర్ లైంగిక దాడి.
ఒడిశాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ హెడ్ మాస్టర్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. 2015లో 11 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సదరు హెడ్ మాస్టర్. ఆయనకు సుందర్‌గఢ్ జిల్లాలోని పోక్సో కోర్టు బుధవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 62 ఏళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా లెఫ్రిపారా బ్లాక్ లోని ఓ పాఠశాలలో పనిచేసేవారు. ఆ సమయంలో స్కూల్ లోని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు వెలుగులోకి రావడంతో జూన్ 14, 2016లో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్నారు. తాజాగా పోక్సో కోర్టు జడ్జ్ మహేంద్ర కుమార్ సూత్తధర్ బుధవారం నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష విధించారు. కోర్టు అతడికి జైలు శిక్షతో పాటు రూ. 47,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా తీర్పు చెప్పింది.
*నేడు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్
ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరును ఓడించేందుకు ప్లాన్ చేసిందని నితిశ్ రాణా సేన ప్లాన్ చేసింది. ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయంతో దూసుకెళ్తున్న RCBని ఓడించేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ KKR, RCB మధ్య పోల్ హెడ్ టూ హెడ్ మ్యాచ్ లు ఇలా ఉన్నాయి. 2017 IPL సమయంలో, KKRపై 132 పరుగులను చేజింగ్ చేస్తున్నప్పుడు RCB కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. రెండు సంవత్సరాల తరువాత, విరాట్ కోహ్లి మాస్టర్ క్లాస్ (58 బంతుల్లో 100) RCBని 213/4కి అందించాడు, అయితే నితీష్ రానా 46 బంతుల్లో 85* మరియు ఆండ్రీ రస్సెల్ (25 బంతుల్లో 65) ఆలస్యంగా కొట్టినప్పటికీ KKR 10 పరుగులతో ఓడిపోయింది. రెండు జట్ల మధ్య చివరిసారిగా మార్చి 30, 2022న పోటీ పడ్డాయి. నవీ ముంబైలో జరిగిన తక్కువ స్కోరింగ్ గేమ్‌లో బెంగళూరు టీమ్ మూడు వికెట్ల తేడాతో KKRను ఓడించింది. ఈడెన్ గార్డెన్స్‌లో, RCBకి వ్యతిరేకంగా KKR హెడ్-టు-హెడ్ రికార్డును కలిగి ఉంది, 10సార్లు రెండు టీమ్ లు పోటీ పడగా అందులో 6 మ్యాచ్ లను కేకేఆర్ గెలిచింది. ఓవరాల్‌గా 31 మ్యాచ్‌లలో KKR RCB 17-14తో ఆధిక్యంలో ఉంది. RCB క్యాంపు నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వెలువడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కుడి భుజానికి గాయమైన లెఫ్ట్ ఆర్మ్ శీఘ్ర రీస్ టాప్లీని జట్టు కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, రజత్ పాటిదార్ టోర్నమెంట్ నుంచి వెళ్లిపోయాడు. ఇంకా జట్టులో వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్ లేకుండా RCB బరిలోకి దిగుతుంది.
*పాయింట్ల పట్టికలో టాప్‌లో ఆ టీమ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో గువాహటిలోని బర్సపరా స్టేడియంలో నిన్న (ఏప్రిల్ 5, 2023) జరిగిన ఎనిమిదో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్, సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌పై ఐదు తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విజయం తర్వాత పాయింట్ల పట్టికలో లాభపడింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా మరోవైపు రాజస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో ఉంది. తొలుత బ్యాటింగ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 197/4 భారీ స్కోరు సాధించింది.. దీనిలో కెప్టెన్ ధావన్ ఇన్నింగ్స్ ప్రారంభించి 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని భాగస్వామి ప్రభాసిమ్రాన్ సింగ్ కూడా అతని అడుగుజాడలను అనుసరించి.. 176.47 స్ట్రైక్ రేట్‌తో కేవలం 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ప్రభాసిమ్రన్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యశస్వి జైస్వాల్‌లో ఓపెనింగ్ చేశాడు.. అయితే అశ్విన్ క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు.. అర్ష్‌దీప్ సింగ్ డకౌట్‌గా ఔటయ్యాడు. జైస్వాల్ మరియు జోస్ బట్లర్ కూడా మొదటి మ్యాచ్ నుంచి తమ ఫామ్‌ను కొనసాగించలేకపోయారు. వరుసగా 11 పరుగుల వద్ద తొలి వికెట్.. 19 పరుగుల మరొ వికెట్ వద్ద ఔటయ్యారు. కెప్టెన్ సంజూ శాంసన్ వచ్చి 25 బంతుల్లో ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 168 స్ట్రైక్ రేట్‌తో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి ప్రయత్నించాడు. అయితే, ఏ ఇతర రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. అలాగే ఇన్నింగ్స్ అంతటా అతిధి పాత్రలు పోషించారు. చివరికి, రాజస్థాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌లో ఓడిపోయింది.