*మోడీ రాక ముందు తెలంగాణలో ఐఎస్‌ఐ ఏజెంట్లు ఉండేవారు
నరేంద్రమోడీ రాక ముందు తెలంగాణలో ఐఎస్‌ఐ ఏజెంట్లు ఉండేవారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో.. మాట్లాడుతూ.. హైదరాబాద్ లో గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్, లుంబిని పార్క్ లలో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, పాకిస్థాన్ ఐఎస్ఐ భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందన్నారు. ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK 47 లు లేవు, RDX లు లేవని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించడం జరిగిందని ఆయన అన్నారు. భారత్ లో విద్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ పాకిస్థాన్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచంలో పాకిస్థాన్‌ను ఏకాకిగా నిలబెట్టామని ఆయన అన్నారు. అంతేకాకుండా.. వారికి వారే చంపుకు చస్తున్నారు. పాపం పండితే ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పాకిస్థాన్ చంపే వాళ్ళు, మనం చచ్చే వాళ్ళం.. మన ఖర్మ ఇంతే అనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. నరేంద్ర మోడీ వచ్చాక చరిత్ర ను తిరగ రాశామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మీరు చంపితే చచ్చే వాళ్ళం కాదు.. మీరు ఒక్కరినీ చంపితే మేము పది మందిని చంపుతామని పాకిస్థాన్ కు చూపామన్నారు. ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 46 వేల మంది భారతీయులు ఉగ్రవాదానికి బలయ్యారని, పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతం చేసి ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. బాబర్ దురాక్రమణలతో అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని ద్వంసం చేసి, బాబర్ గాడి జ్ఞాపకార్థం కోసం బాబ్రీమసీదును నిర్మించారని, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 1990 అద్వానీ రథయాత్ర చేపట్టారన్నారు. నాటి నుంచి నేటి వరకు రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ పోరాటం చేస్తోందని, ప్రజలు శాంతిగా ఉండటం కొన్ని పార్టీలకు నచ్చడం లేదని, కుహానా సెక్యులర్ వాదులు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోందన్నారు. కాంగ్రెస్ కున్న పార్లమెంట్ స్థానాలను తిరిగి గెలుచుకునే పరిస్థితులు కాంగ్రెస్ లో లేవని, మరోసారి మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని, ఒక్క అవినీతి మచ్చ లేకుండా నీతివంతoగా పరిపాలన అందించిన ఘనత మోడీ ది అని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ నెలలో 25 రోజులు సచివాలయం రాకుండా ఫామ్ హౌస్ లో ఉండేవారని, రాహుల్ గాంధీ ఏడాదిలో రెండు నెలలు విదేశాల్లో విహారం చేస్తారని, బీచ్ లలో నిక్కర్ లు వేసుకునే తిరుగుతారన్నారు. బీజేపీని, మోడీని తట్టుకోలేక అధ్యక్ష పదవికి రాజీనామ చేసి విదేశాలకు పారిపోయిన రాహుల్ గాంధీ ఇవాళ ప్రధాని అవుతాడా? తెలుగు ప్రజలకు ఇవాళ సంక్రాంతి అయితే మోడీ మూడోసారి ప్రధాని అయిన రోజే దేశ వ్యాప్త సంక్రాంతి పండుగ అని, 370 రద్దు చేసి ఉగ్రవాదులను తరిమి కొట్టినమన్నారు. పాకిస్థాన్ లో ముద్రిస్తున్న ఇండియన్ నకిలీ కరెన్సీ ని అరికట్టడానికి పెద్ద ఓట్లను రద్దు చేశామని, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం.. రామ మందిరా నిర్మాణము జరుగుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
*వ్యవసాయంపై దృష్టి పెట్టనున్న కేసీఆర్
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే మొదట నిజంగానే కేసీఆర్ తనకు కాల్ చేశాడా? అనే అనుమానం వచ్చింది. నిజంగానే మాజీ సీఎం కేసీఆర్ మాటలు వినపడటంతో ఖంగు తిన్నాడు. సార్ చెప్పండి అంటూ ఫోన్ పట్టుకుని మాట్లాడగా.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు. పది రోజుల్లో ఫామ్ హౌస్‌కి వస్తానని చెప్పారు. అంతేకాకుండా.. వ్యవసాయం చూసుకుంటానని తెలిపారు. ఎరువుల యజమాని మాజీ సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేయగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అయితే కేసీఆర్ ఫోన్ కాల్‌తో ఎరువుల యజమాని మాట్లాడటం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫోన్ కాల్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2023 డిసెంబర్ 8వ తేదీ రాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అదే నెల 9న కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత వాకర్ సాయంతో కేసీఆర్‌ను డాక్టర్లు నడిపించారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్‌లోని తన సొంతింటికి వెళ్ళారు. అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుపడినట్లు.. ఎరువుల యజమానితో మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ వెళ్లాలని, అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ గడిపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏదేమైనా కేసీఆర్ కోలుకుని ఒక రైతుగా మళ్లీ ప్రజల్లోకి రావాలని చూస్తున్నారన్నట మాట.. కేసీఆర్ ను చూసేందుకు తెలంగాణ ప్రజలు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆముహూర్తం ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే..
*జ్యోతిషం చెప్పినట్లు ఉంది.. బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్..
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బండి సంజయ్ మాట్లాడిన మాటలు జ్యోతిషం చెప్పినట్లుగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఅర్ఎస్ ఒక్కటే అంటే నమ్మలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుందని మాట్లడడం నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఅర్ఎస్ కి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరన్నారు. జగథ్గురు చెప్పినగాని అశాస్త్రీయంగా అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని, ఇది ఎన్నికల స్టంటే అన్నారు. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవ్వరూ చేయాలో తెలియదా? ఇది అరిష్టం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండిసంజయ్ నంబర్ వన్ అన్నారు. మాజీ ఎంపి వినోద్ కుమార్ కరీంనగర్ కి ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించండి అన్నారు. కేసీఆర్, వినోద్ కుమార్, కేసీఆర్ లు ఎంపిలుగా ఏం అభివృద్ధి చేసారో, నేను ఎంపిగా ఏం చేసానో చర్చకి వస్తారా? అని సవాల్ విసిరారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపి ఓట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన అసహనం తో ఉన్నారని అన్నారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ పవర్ పుల్ అనేది భ్రమ అన్నారు. కేసీఆర్ పదానికి పూజ చేసుకోండి అంటూ తెలిపారు. సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అంటే కొడుకు సీఎం పదం కంటే కేసీఆర్ పదం పవర్ అంటాడు అని గుర్తు చేశారు. జీవితంలో ఎప్పుడూ కూడ బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేయవని స్పష్టం చేశారు. అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు మరోసారి జిల్లాల, నియోజకవర్గాల మండలాల పునర్విభజన జరగాలన్నారు. పునర్విభజనపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది…కమిటీ వేయనుందన్నారు. దేశం కోసం ఎవరు ఏం చేశారో తెలుసన్నారు. దేశ సంపద కాంగ్రెస్ సృష్టిస్తే, సంస్థలు ఏర్పాటు చేస్తే బిజేపి అమ్ముతుందన్నారు. పెళ్ళాం పుస్తెలు అమ్మిన ఎన్నికల్లో కొట్లాడిన అన్న వ్యక్తి బండి సంజయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశావన్నారు. పెద్దపెద్ద కటౌట్లు ప్లెక్సీలు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడివి? అని ప్రశ్నించారు. ఆర్టీసీని గత ప్రభుత్వం చంపేసిందన్నారు. త్వరలోనే ఆర్టీసి ప్రయాణీకుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు ఫిర్యాదు చేయండి చర్యలు చేపడుతామని క్లారిటీ ఇచ్చారు.
*వైజాగ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్
వైజాగ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ చేపట్టింది. వైజాగ్ స్కాంకు సంబంధించి ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో నితిన్, అమిత్‌లు కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను నితిన్, అమిత్ మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. బెట్టింగ్ యాప్‌లో వచ్చిన నిధులతో నితిన్, అమిత్ ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. నితిన్, అమిత్ భార్యల పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తుల కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే చత్తీస్‌గఢ్‌లో అయిన కేసులో అక్కడి ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహదేవ్ బెట్టింగ్ యాప్‌ను కేంద్రం నిషేధించిన విషయం విదితమే.
*బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్
వైసీపీ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మెత్తబడినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు పాటించాలని నిర్ణయానికి మల్లాది విష్ణు వచ్చారు. వెల్లంపల్లికి వచ్చే ఎన్నికల్లో సహకరించాలని తన వర్గానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంకేతాలు ఇచ్చారు. అధికారికంగా రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఇస్తామని విష్ణుకి అధిష్ఠానం హామీ ఇచ్చింది. 2 రోజుల్లో బెజవాడ సెంట్రల్ ఇంఛార్జి వెలంపల్లి శ్రీనివాస్ పార్టీ ఆఫీసును సెంట్రల్‌లో ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ మా మేనిఫెస్టోలో అంశాలనే ఫాలో అవుతున్నారని విమర్శించారు. 2014లో కలిసి పోటీ చేసి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కర్నూలు హైకోర్టు బెంచ్, విశాఖ వ్యాపార రాజధాని, అమరావతి అంటూ మా విధానాన్నే ఫాలో అయ్యారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వైసీపీ సరైన నిర్ణయాలే తీసుకుంటోందన్నారు. సీట్ల సర్దుబాటు దగ్గరే టీడీపీ, జనసేన ఆగిపోయాయన్నారు. మేం ఏ విధంగా ఎన్నికలలో పనిచేయాలో ప్రణాళికలు కూడా చేసేశామని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ సీటు విషయంలో తరువాత మాట్లాడుతానని ఆయన అన్నారు.
*ఇంకా కొలిక్కిరాని వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి కసరత్తు
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై వైసీపీ అధిష్ఠానం పూర్తిగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై సీఎం జగన్ చాలా రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. చలమలశెట్టి సునీల్ పోటీకి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. 2014లో వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్‌ను గీత స్థానంలో పోటీ చేయించాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇదే విషయాన్ని సునీల్ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ ఆయన మాత్రం కాకినాడ నుంచి పోటీ ప్రసక్తే లేదని వైసీపీ పెద్దలకు తేల్చి చెప్పేశారు. కాకినాడ ఎంపీ సీటు నుంచి ఇప్పటికి మూడుసార్లు వేర్వేరు పార్టీలనుంచి పోటీ చేసినా కలిసి రాక వరుస ఓడిపోయి నా తనకు ఇకపై బరిలోకి దిగే ఆసక్తి లేదని చెప్పేశారు. వాస్తవానికి కాకినాడనుంచి ఎంపీగా గెలవాలనే పట్టుదలతో సునీల్ హైద రాబాద్‌నుంచి వచ్చి కాకినాడ ఎంపీ సీటుకు 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసినా ఓటమి పాలయ్యారు. వరుసగా మూడుసార్లు ఓటమి పాలవడంతో ఇకపై కాకినాడనుంచి బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆయన కాపు సామాజికవర్గం నేత కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతో గీత స్థానంలో ఈయన్నే మళ్లీ దించాలని వైసీపీ భావిస్తోంది. కానీ సునీల్ మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెప్తున్న సునీల్‌ను పార్టీ పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుకి మరొక సారి పార్టీ ప్రపోజల్ పెట్టింది. పార్లమెంట్‌కి పోటీ చేయడానికి మరొక సారి అభ్యర్థుల వడపోతను పార్టీ చేపట్టింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం కోఆర్డినేటర్‌గా వైసీపీ నియమించింది. ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ గెలవాలనే నినాదాలు వినిపిస్తున్న జగన్ దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికపై ముందుగానే అలర్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాల్లో మార్పులు చేర్పుల అనంతరం సంక్రాంతి తర్వాత నాలుగో విడత జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
*గమ్యస్థానానికి 50 కి.మీ దూరంలో దించిన బస్సు.. బాధితుడికి రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశం..
బస్సు ప్రయాణంలో తనను గమ్యస్థానానికి చేర్చకుండా ఇబ్బందులకు గురి చేసిన ట్రావెల్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించారు. బాధితుడైన ముంబై వాసికి టికెట్ డబ్బులతో పాటు రూ. 2 లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. ట్రావెల్ పోర్టర్, బస్ సర్వీస్ రూట్ మార్పు గురించి ఫిర్యాదుదారుడికి ముందుగానే తెలియజేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. టిక్కెట్ ధర రూ. 745తో పాటు 2 లక్షలు 69 ఏళ్ల వ్యక్తికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రావెల్ సంస్థ నిర్ణయంతో సీనియర్ సిటిజన్ అసౌకర్యంతో పాటు బాధను అనుభవించారని చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. 2018లో సూరత్ నుంచి ముంబైకి వస్తున్న కండివాలి నివాసి అయిన శేఖర్ హట్టంగడి గమ్యస్థానానికి 50 కిలోమీటర్ల దూరంలో డ్రాప్ చేసింది. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ చర్యల వల్ల ఫిర్యాదుదారుడికి మానసిక వేదన, ఇబ్బంది ఎదుర్కొన్నారని, అతను పరిహారం పొందేందుకు అర్హుడని వినియోగదారుల ఫోరం చెప్పింది. అతను Travekyaari.com అనే ట్రావెల్ పోర్టల్ ద్వారా బస్సు టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అహ్మదాబాద్-ముంబై హైవేలో మరమ్మతులు జరుగున్నందున, బస్సు డ్రైవర్ ప్రధాన రహదారి నుంచి థానే వైపు మళ్లించాడు. రూట్ మ్యాప్ గురించి ఫిర్యాదుదారునికి కనీస సమాచారం అందించలేదు. డిసెంబర్ 12, 2018న వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా పౌలో ట్రావెల్స్ టికెట్ కొనుగోలు చేశానని, తనకు సూరత్‌లో కరెక్ట్ పికప్ పాయింట్ అందించకపోవడంతో పాటు ముంబై శివార్లలో 50 కిమీ దూరంలో తనను బలవంతంగా దించేశారని వినియోదారుల వివాదాల పరిష్కార కమిషన్ ముందు ఫిర్యాదు చేశారు. తనను గమ్యస్థానానికి చేర్చడంలో పాలో ట్రావెల్స్ విఫలమైందని, మాన్‌టిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం ఈమెయిల్ ద్వారా క్షమాపణలు చెప్పింది కానీ.. తన బాధ్యతను అంగీకరించలేదని శేఖర్ హట్టంగడి చెప్పారు. ఈ కేసులో మాన్‌టిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, పాలో ట్రావెల్స్ పరిహారంగా టికెట్ ధరతో కలిపి రూ. 2 లక్షలు చెల్లించడమే కాకుండా.. న్యాయ ఖర్చులు రూ. 2000 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
*రామమందిర వేడుకకు 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖుల రాక..
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న అట్టహాసంగా జరగబోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూపీలో యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులు అతిథులుగా వెళ్తున్నారు. మొత్తం 7 వేల మంది వరకు అతిథులతో పాటు లక్షల మంది ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమానికి హాజరవనున్నారు. ఇదిలా ఉంటే ఒక్క మనదేశం నుంచే కాకుండా ప్రపంచంలోని 55 దేశాలకు చెందిన 100 మంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. విదేశాల రాయబారులు, ఏంపీలు ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరవుతున్నారని ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ ఈ రోజు చెప్పారు. VVIP విదేశీ ప్రతినిధులందరూ జనవరి 20న లక్నోకు చేరుకుంటారు, ఆ తర్వాత జనవరి 21వ తేదీ సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారన్నారు. మరికొంత మంది విదేశీ అతిథులను ఆహ్వానించాలని అనుకున్నప్పటికీ.. స్థలం తక్కువగ ఉండటంతో అతిథుల జాబితాను తగ్గించాల్సి వచ్చిందన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22న మధ్యాహ్నానానికి రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. జనవరి 16 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణప్రతిష్ట వేడకకు 11 రోజుల ముందు ప్రత్యేక అనుష్టాన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఆహ్వానించిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బోట్స్వానా, కెనడా, కొలంబియా, డెన్మార్క్, డొమినికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఈజిప్ట్, ఇథియోపియా, ఫిజి, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, గయానా, హాంగ్ ఉన్నాయి కాంగ్, హంగరీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, జమైకా, జపాన్, కెన్యా, కొరియా, మలేషియా, మలావి, మారిషస్, మెక్సికో, మయన్మార్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, నార్వే, సియెర్రా లియోన్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక , సురినామ్, స్వీడన్, తైవాన్, టాంజానియా, థాయిలాండ్, ట్రినిడాడ్ & టొబాగో, వెస్టిండీస్, ఉగాండా, UK, USA, వియత్నాం మరియు జాంబియా ఉన్నాయి.
*రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్.. ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని షాన్ మార్ష్ తెలిపాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న షాన్ మార్ష్ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. చివరి మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. మార్ష్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఫాన్స్ సహా అందరూ షాకయ్యారు. 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసినప్పుడు మార్ష్ వయసు 17 ఏళ్ల 236 రోజులు. పెర్త్ స్కార్చర్స్ తర్వాత అతను 2019లో రెనెగేడ్స్‌లో చేరాడు. షాన్ మార్ష్ 2008 నుంచి 2019 వరకు 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 5,293 పరుగులు చేశాడు. టెస్ట్‌లలో 2265, వన్డేలలో 2773, టీ20లలో 255 రన్స్ బాదాడు. 2017-18లో ఆస్ట్రేలియా యాషెస్ విజయంలో మార్ష్ కీలక పాత్ర (రెండు సెంచరీలు) పోషించాడు. 2008-17 మధ్యలోపలు ఐపీఎల్ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 2477 పరుగులు చేశాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న విషయం తెలిసిందే.