Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*నాయకుల గుణగణాలు తెలుసుకుని ఓటు వేయాలి..
ఎన్నికలలో నిలబడే వివిధ రాజకీయ పార్టీల నాయకుల గుణగణాలు తెలుసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల భవిష్యత్ చూసి బీఆర్ఎస్‌కు ఓటు వేసి, ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపించాలన్నారు. అప్పులలో ఉన్న సింగరేణి సంస్థను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పునరుద్ధరించుకున్నామన్నారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మికుల హక్కులను పొగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సింగరేణిలో 15 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌కు చెందుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి పన్నులు లేకుండా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నామన్నారు. ధరణి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. సింగరేణి సాధించిన లాభాలలో కార్మికులకు 32శాతం వాటా ఇచ్చామన్నారు. సింగరేణి సంస్థ కార్మికులకు ఇన్‌కమ్ టాక్స్ వంద శాతం రద్దు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

 

*మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం
జై బోలో తెలంగాణ అని నినదించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామికి జై కొట్టారు ప్రియాంకా గాంధీ. ఝాన్సీ రెడ్డి కుటుంబం చాలా సేవాభావం గల కుటుంమని ఆమె వెల్లడించారు. రైతుల భూములు లాక్కునే కుటుంబం బీఆర్‌ఎస్ కుటుంబం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని.. ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే మీ ఓటు విలువైనది అంటూ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. త్యాగం చేసిన వాళ్లు ఒకవైపు, దోపిడి చేసిన వాళ్లు మరోవైపు.. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు. మీరు కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయితే, పేపర్‌ లీకులు అవుతున్నాయని.. పేపర్‌ లీకులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యల కారణాలను కూడా ఈ ప్రభుత్వం వక్రీకరించిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని అరికట్టడానికి జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుందన్నారు. మా అక్క చెల్లెళ్లకి క్షమాపణ చెప్తున్నా.. ఇంత సేపు నాకోసం అన్ని పనులు వదిలేసి వచ్చినందుకు అంటూ ప్రియాంక చమత్కరించారు. గ్రామ గ్రామాన వైన్స్, బెల్ట్ షాపులు అక్కా చెల్లెళ్ళ జీవితాలను పాడుచేస్తున్నాయన్నారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు బాగా జరుగుతున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు ప్రియాంకా గాంధీ. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని ఆమె విమర్శించారు. రైతు సంపాదించిన భూములను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని ఆమె ఆరోపించారు. రైతులకి కనీస మద్దతు ధర కచ్చితంగా ఇస్తామని.. కేసీఆర్ సర్కార్ వచ్చి 10 సంవత్సరాలు గడిచినా అన్యాయమే జరుగుతోందని ప్రియాంక విమర్శించారు. మందులకి చివరి తేదీ ఎలా ఉంటాదో.. అలా బీఆర్‌ఎస్‌కు ఎక్సపైరీ తేదీ ఇప్పుడు వచ్చిందన్నారు. ప్రభుత్వాలు మీ ఆలోచనలను మరిచి వాళ్ల కుటుంబ పాలన కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం ఈ ప్రభుత్వం ఫామ్ హౌస్‌లకే పరిమితం అంటూ విమర్శించారు. దళితులకు ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో చాలా లక్షల కోట్ల కుంభకోణం చేసి దోచుకున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేనని.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దొరల తెలంగాణ చేసిందని.. మేము వచ్చాక దొరల తెలంగాణని ప్రజల తెలంగాణ చేస్తామన్నారు.

 

*ఈ సారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బాగంగా బీజేపీ పార్టీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ ను దేశంలోనే ఒక మాడల్ గా అభివృద్ధి చేశామని, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. అటల్ బిహారీ వాజపేయి నుంచి మోడీ వరకు బీజేపీ ప్రభుత్వాలు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని అన్నారు. కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మోసం చేసి పేపర్ లీకేజీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని ఏ ఒక్క దళితునికి ఇవ్వలేదన్నారు. 10 లక్షల దళితబంధు ఎవరికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఉందని బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

 

*పైసా దేనా.. ఓట్ లేనా.. ఇది కేసీఆర్ నైజం
రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్లు నెత్తికి ఎక్కాయన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లా ముదోల్‌లో పర్యటించిన ఆయన అక్కడ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు. ముదోల్ అంటేనే చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయమని, తాము అధికారంలోకి వస్తే అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు. కేసీఆర్ గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు బందుజేయి.. నీ చీటి చెల్లిపోయిందంటూ ఫైర్ అయ్యారు. కేసీఅర్ గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు పెట్టడంలో నంబర్ వన్ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చే పైసలు తీసుకోని.. ఓటు బీజేపీ వేయండిని ఈటెల పిలుపునిచ్చారు. పైసా దేనా.. ఓట్ లేనా.. ఇది కేసీఆర్ నైజమని, అక్కడ ఆయనో చక్రవర్తి.. ఇక్కడి ఎమ్మెల్యే ఓ నిజాం చక్రవర్తి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పేదొల్ల ముఖ్య మంత్రిని అన్న కేసీఆర్.. డబల్ బెడ్ రూం ఇండ్లు యాడపోయినయ్ అని ప్రశ్నించారు. నమ్మకానికి మారు పేరు నరేంద్ర మోదీ అని, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఅర్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే క్వింటాల్‌కు 3100 రూపాయల మద్దతు ధర ఇస్తమని, డిసెంబర్ 4 నుంచి అమలు చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎరువుల సబ్సిడీ తొమ్మిది వేల రూపాయలు ఇస్తామని, ఏ జబ్బులకైనా పది లక్షల ఉచిత వైద్యాన్ని కల్పిస్తామన్నారు. అలాగే డ్రీప్.. డ్రిల్.. సబ్సీడీ ట్రాక్టర్‌లు ఇస్తామని ఈటెల తెలిపారు.

 

*చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి.. భారత్‌లో ప్రమాదం లేదన్న కేంద్రం..
చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో చైనాలోని వూహాన్ నగరంలో ఇలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని తాజా అవుట్ బ్రేక్ గుర్తుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో దీని ప్రమాదం తక్కువే అని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా కేసులు, శ్వాసకోశ వ్యాధుల నుంచి భారత దేశానికి ప్రమాదం తక్కువగా ఉందని తెలిపింది. చైనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉత్తర చైనాలో ప్రస్తుతం H9N2 కేసులు, శ్వాసకోశ వ్యాధుల ఇటీవల పెరిగాయి.ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు గత కొన్ని వారాలుగా చైనాలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత పెరిగిందని, పిల్లల్లో ఈ అనారోగ్యం పెరిగిందని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.‘‘ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత దేశం సిద్ధంగా ఉందని, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు సమగ్రమైన రోడ్ మ్యాప్ అనుసరించడానికి భారత్ ఒక ఆరోగ్య విధానాన్ని పాటిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయంగా బలోపేతం చేయడం జరిగింది’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 అక్టోబర్‌లో చైనాలో WHOకి నివేదించబడిన H9N2 (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్) యొక్క మానవ కేసు నేపథ్యంలో దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులపై సంసిద్ధత చర్యల గురించి చర్చించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ అంచనా మేరకు హెచ్9ఎన్2 కేసుల్లో మానవుడి నుంచి మానవుడకి వ్యాపించే సంభావ్యత తక్కువగా ఉండటమే కాకుండా, మరణాల రేటు కూడా తక్కువ అని కేంద్రం తెలిపింది. మానవులు, పశు సంవర్థక, వన్యప్రాణుల రంగాల మధ్య నిఘాను పటిష్టం చేయడం ముఖ్యమని చెప్పింది.

 

*రష్యాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్.. 16 డ్రోన్లు కూల్చివేత
దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, గత రాత్రి ఉక్రెయిన్ రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. రష్యా రక్షణ వ్యవస్థలు క్రిమియాపై 16 ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేశాయి. ఉక్రెయిన్ దళాలు ఇప్పటికీ రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్నాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దక్షిణాన ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ యూనిట్లపై తమ బలగాలు దాడి చేశాయని తెలిపింది. రష్యన్ దళాలు కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం విఫలమైనప్పటి నుంచి తూర్పు వైపు దృష్టి సారించాయి. అక్కడ ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంటారు. దీంతో దక్షిణ ఖెర్సన్ ప్రాంతంలోని బెరిస్లావ్ పట్టణంపై రష్యా దళాలు దాడి చేయడంతో నలుగురు మరణించారు. జూన్‌లో ప్రారంభించిన ప్రతీకార దాడిలో భాగంగా ఉక్రెయిన్ ద్వీపకల్పంతో పాటు చుట్టుపక్కల ఉన్న రష్యన్ సైనిక లక్ష్యాలపై డ్రోన్, క్షిపణిలతో దాడులను వేగవంతం చేసింది. ఇక, క్రిమియా ద్వీపకల్పంలో గాలిలో 16 ఉక్రెయిన్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా అధికారులు ఇవాళ తెలిపారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. గురువారం రాత్రి ఏరియల్ డ్రోన్‌లను ఉపయోగించి రష్యా భూభాగంపై దాడి చేయడానికి కుట్ర చేశారు.. అయితే ఉక్రెయిన్ ఈ ప్రయత్నాన్ని తాము తిప్పికొట్టామని ఆయన చెప్పారు. 13 డ్రోన్లు క్రిమియన్ ద్వీపకల్పంపై దాడి చేయబోయయి.. మూడు వోల్గోగ్రాడ్ ప్రాంతం వైపు వెళ్లాయి.. వాటిని మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. అయితే, రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తిరిగి తన ఆధీనంలోకి తీసుకోవాలని ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుంది. రష్యా నల్ల సముద్రం నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో మోహరించినందున ఉక్రెయిన్ కూడా ఈ ప్రాంతంపై దాడి చేస్తుంది. ఈ ప్రాంతం ద్వారానే రష్యా తన సైన్యానికి ఆయుధాలను సరఫరా చేస్తుంది.

Exit mobile version