*చంద్రబాబుకు భారీ షాక్
చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సర్కారు అటాచ్ చేసింది. చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్‌ప్రోకు పాల్పడ్డారని, వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి గెస్ట్‌హౌస్‌ను పొందారని సీఐడీ పేర్కొంటోంది. వ్యాపారి లింగమనేనికి లబ్ధి చేకూరేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది.
*టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టారు..
తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. తానొక్కడినే తెలివైన వాడిని అనుకుంటాడని ఆయన పేర్కొన్నారు. జగన్‌ను తిట్టడం కోసమే పవన్ రోడ్డు మీదకు వస్తుంటాడని ధ్వజమెత్తారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ విమర్శించేవాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ డైలాగులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎవరో టీ కొట్టు అతను వ్యాన్ ఇస్తే పవన్ వారాహి అని పేరు పెట్టాడని.. ఇప్పుడు ఆ వారాహి ఎక్కడికి పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. “పట్టుమని పది రోజులైనా రాష్ట్రంలో ఉండి ప్రజల కోసం పని చేశాడా??. వీకెండ్‌లో రావటం, జగన్ ను, జనాలను తిట్టడం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోవటం.రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా రోబో సినిమాలో రజనీకాంతా?? కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై చంద్రబాబు దాష్టికం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు??. కాపులను రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే ఎందుకు అడగలేదు. 50 శాతం పైబడి రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదని జగన్ నిజాయితీగా చెప్పారు. ఎన్నికలకు ముందు ఇలా చెప్పగలిగే దమ్ము ఉన్న నాయకుడు జగన్. కాపులను దగా చేసింది చేసింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాదా?.” అని పేర్ని నాని మాట్లాడారు.
*టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ క్లారిటీ!
టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌ను తీసుకువచ్చారని.. అదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. పవన్‌కల్యాణ్ కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారన్నారు. పొత్తులపై తమ అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఉండవని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఫలితాలు మరొక రాష్ట్రంలో ప్రభావం చూపించవన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సానుకూల ఫలితాలు ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ప్రతిపక్షాలు ఎక్కువ ఆరాటపడితే భంగ పాటు తప్పదన్నారు. విశాఖ అభివృద్ధిలో 90శాతం కేంద్ర ప్రభుత్వ సహయంతోనే జరుగుతోందని ఆయన అన్నారు. కావలిలో బీజేపీ నాయకులపై పోలీసులు దాష్టీకం జరిపారని తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రంలోగా ఆ పోలీసులను సస్పెండ్ చెయ్యకపోతే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. డీఎస్పీ రమణారావుపై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఈనెల 19న ఛార్జ్ షీట్ వేస్తామన్నారు.
*ప్రెగ్నెంట్లకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్
గర్భిణులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు. సాధారణంగా ఈ టీఫా స్కాన్‌ను తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. టిఫా స్కానింగ్ టెస్ట్ ద్వారా గర్భంలోని శిశువుల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అనే ఉద్దేశంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు, గర్భిణులకు మధ్య ఒక అనుబంధ వ్యవస్థ ఏర్పాటైనట్టు తెలిపారు. గర్భం ధరించిన 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌లు చేస్తారు. గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ చేయడానికి వీలుగా వివరాలను ఆన్‌లైన్‌లో పొందిపరిచామని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్ హరేంధిరప్రసాద్ తెలిపారు.
*రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో ట్విస్ట్
సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇవి హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1.64 కోట్ల నగదు, భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేడు. పని చేసే ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రభుత్వ విద్యుత్ వ్యాపారం కాంట్రాక్టు పనులు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి హవాలా నగదు కుప్ప కనిపించింది. దీంతో స్థానిక పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి హవాలా సొమ్ముపై ఆరా తీస్తున్నారు. హవాలా లావాదేవీల వ్యవహారంలో శ్రీనివాస్ పై దృష్టి సారించారు. మీరు ఏదైనా హవాలా వ్యాపారం చేస్తున్నారా? హవాలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఐటీ దర్యాప్తు చేస్తోంది. ఐటీ అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చెక్క ఫర్నీచర్ ఉండడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించడంతో అంతా అంధకారంగా మారింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని గుర్తించారు. కాగా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
*పెళ్లింట్లో భారీ చోరీ
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని ఓ పెండ్లి ఇంట్లో భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. రూ. 11 లక్షల సొత్తుతో దొంగలు ఉడాయించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫేజ్ 1-16బి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి తలుపులు పగలగొట్టి రూ. 3,72,000 విలువైన 6 తలా బంగారు గొలుసులు, ఉంగరాలు, రూ. 3 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, రూ. 3,75,000 విలువైన 5 కిలోల వెండి వస్తువులు, రూ. 10 వేల నగదు అపహరించారు. బుల్లెట్ వాహనాన్ని కూడా దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చెల్లి పెళ్లి వేడుక ముగించుకుని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చేసరికి వెనుక తలుపు పగులగొట్టి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. ఇంట్లో అంతా చిందరవందరగా ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంత పకడ్బందీగా దొంగలు ఇంట్లోకి వచ్చి సొత్తును దొంగాలించారంటే కుటుంబ సభ్యులకు తెలిసిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఇంత సొత్తు ఉంటుందని ముందే వారికి ఎవరైనా చేదీశారా? లేక ఇంట్లో వున్న వాల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పకడ్బందీగా ఈ చోరీ ప్లాన్ చేశారంటే దొంగలు ఈ ఇంటిపై ఎప్పటినుంచే కన్ను వేసి వున్నారని గ్రహించారు. ఇంట్లో ఇంత సొత్తు ఉంటుందని ముందే వీరి గ్రహించారు కాబట్టి ఇంట్లో ఎవరు లేని సమయంలో సునాయాసంగా వెనుక తలుపులు పగుల గొట్టి చోరీ చేశారని పోలీసులు భావిస్తు్న్నారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండాలని కోరారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ఇంట్లో ఎలాంటి డబ్బులు, బంగారం వంటి వస్తువులు పెట్టి వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని కోరారు.
*సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని షాంగ్రీ-లా హోటల్‌లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి ఎంపికను నిర్ణయించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి వదిలివేసే తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆమోదించాలని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరూ ఉన్నత పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం పరిష్కరించబడకపోతే పార్టీలో ప్రతిష్టంభన ఏర్పడుతుందనే భయాలు కాంగ్రెస్ పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ, పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇస్తూ శనివారం సాయంత్రం పార్టీ అగ్రనేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సోనియా గాంధీని కలవనున్నారు. ఈరోజు బెంగళూరులో జరిగే భారీ సమావేశానికి ఆయన హాజరుకావడం లేదు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధరామయ్యకు ఉన్నట్లు తెలుస్తోంది.
*దేశ చరిత్రలోనే భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత.. విలువ వేలకోట్లు
దేశ సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా గుట్టురట్టు చేశారు అధికారులు. అక్రమంగా రవాణా అవుతున్న 2,500కిలోల హై ప్యూరిటీ మెతామ్ఫిటమైన్ ను పట్టకున్నారు. దీని విలువ రూ. 12 వేల కోట్లు ఉండనున్నట్లు అంచనా. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర తీరం వెంబడి డ్రగ్స్ రవాణా జరుగుతుందని 15 రోజుల క్రితమే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు నార్కోటిక్స్ నియంత్రణ విభాగం (ఎన్సీబీ), భారత నేవీ సంయుక్తంగా జరిపిన ఈ దాడిలో అరేబియన్ సముద్రంలో ఇరాక్ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా నౌకలో రవాణా అవుతున్న హెరాయిన్‌ను పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 12,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. డ్రగ్స్ లో మెత్ గా ఈ మాదకద్రవ్యాన్ని పిలుస్తారు. డ్రగ్స్ పట్టివేత కోసం అధికారులు ఆపరేషన్ సముద్ర గుప్త నిర్వహించారు. శ్రీలంక, మాల్దీవులు సమాచారంతో ఇండియన్ నేవీ ఎన్సీఈఆర్బీ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు NCRB గుర్తించింది. ఇంతకుముందెప్పుడూ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. సముద్ర జలాల్లోనే డ్రగ్స్ పట్టివేత.. పాకిస్తాన్ దేశానికే చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాల్లో శనివారం నలుగురు స్మగ్లర్ల నుంచి పోలీసులు భారీగా నగదు, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు వివిధ రాష్ట్రాల్లో హెరాయిన్ సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
*పాస్టర్ మాట నమ్మి శవాలయ్యారు..
కెన్యాలో దారుణం జరిగింది. ఓ చర్చి పాస్టర్ నిర్వాకం కారణంగా 200మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నెల రోజులనుంచి కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు అధికారులు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. మరో 600 మంది జాడ గల్లంతైంది. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ 2019లో అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో జీవం విడిస్తే .. జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఇలా చేస్తూ డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి ఏప్రిల్ నెలలో మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు. చాలా మంది ఆహారం తినకుండా, గొంతు పిసికినట్లు, ఆయుధాలతో దాడి చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. మెకంజీ చర్చీలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు.
*స్కీం పేరుతో స్కాం.. దంపతులకు 12,640ఏళ్ల జైలు శిక్ష
థాయ్ లాండ్ లో తప్పు చేస్తే శిక్షలు ఘోరంగా ఉంటాయి. నేరాలు చేసిన వాళ్లకి అక్కడ కోర్టులు కఠిన శిక్షలు వేస్తున్నారు. తాజాగా ఓ దంపతులకు కోర్టు సంచలన శిక్ష వేస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఆన్ లైన్ పోంజి స్కీం పేరుతో సోషల్ మీడియాలో మోసానికి పాల్పడిన భార్యభర్తలకు ఒక్కొక్కరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. వాంటనీ తిప్పావెత్, మేతి చిన్ఫా పాంజీ దందపతులు..తమ దగ్గర పొదుపు చేస్తే ఎన్నో రెట్లు అదనంగా సొమ్ములు ఇస్తామని జనాలను మోసగించారు. దీంతో వారికి థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. వీరు 2019లో పోంజి మోసానికి తెర లేపారు. తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని ప్రకటించారు. స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంజి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు. ఈ విధంగా వచ్చిన డబ్బుతో తాము ఒక జ్యూయెలరీ షాప్ ను కూడా కొనుగోలు చేశానంటూ రకరకాల నగలు ధరిస్తూ వాంటనీ ఆ వీడియోలో చూపిస్తూ రెచ్చగొట్టేవారు. నిజానికి తన ఆఫీస్ లోని రూమ్ నే నగల షాప్ గా భ్రమింపజేసేలా వారు నకిలీ వీడియోను తయారు చేశారు. దీంతో 2500 మందికి పైగా వారి పథకంలో పెట్టుబడి పెట్టారు. సుమారు 51.3 మిలియన్ డాలర్లు సేకరించి దంపతులు ఎత్తి వేశారు. దీంతో వీరిపై కేసు నమోదైంది. విచారణలో థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు వీరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే నిందితులు నేరాన్ని అంగీకరించడంతో జైలు శిక్షను 5,056 ఏళ్లకు తగ్గించారు. నిజానికి వారికి అన్ని ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ థాయ్ లాండ్ చట్టం ప్రకారం దంపతులు ఒక్కొక్కరు 20 ఏళ్లు మాత్రమే ఆ దేశం జైలులో ఉంటారని ఒక అధికారి పేర్కొన్నారు.
*ఎమోషనల్ గా ‘విమానం’ టీజర్!
శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన సినిమా ‘విమానం’. ఇందులో వీరయ్య అనే తండ్రి పాత్రలో సముతిర కని , కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను శనివారం వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఇందులో సినిమా థీమ్ ను దర్శకుడు తెలియచేశాడు. అంగ వైక్యలంతో ఇబ్బంది పడుతున్నా వీరయ్య తన కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాలని ఆలోచనలతో ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించమని బతిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చదువుకుంటే నువ్వే విమానం ఎక్కవచ్చునని కొడుకుతో అంటుంటాడు వీరయ్య. తండ్రీ కొడుకుల మధ్య అసలు ఈ విమానం గోల ఏంటనేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. టీజర్వీ లో తండ్రి కొడుకుల మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు. ఎందుకు?’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి’ అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే డైలాగ్ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని తెలిపేలా వుంది. ఈ ఎమోషనల్ జర్నీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.