OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?

  • తెలంగాణ కాంగ్రెస్‌లో గాడి తప్పిన క్రమశిక్షణ
  • పార్టీకి, ప్రభుత్వానికి తమ మాటలతో జరిగే నష్టం ఎంత..?
  • ఇంకా లేట్‌ చేస్తే పరిస్థితులు విషమించే ప్రమాదం
  • వేటు వేయాల్సిందేనని కాంగ్రెస్‌ డిసైడ్‌
Otr

Otr

OTR: ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. ప్రధానంగా ముగ్గురి చుట్టూ కాంగ్రెస్‌ రాజకీయం తిరుగుతోంది..? ఆ ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్‌ వినిపిస్తోంది. మరి వారిపై చర్యలుంటాయా..? ఎవరిపై వేటు వేస్తారు..? ఎవరిని కట్టడి చేస్తారు..? ఫారిన్‌ నుంచి సీఎం వచ్చేదాకా ఈ సస్పెన్స్‌ కంటిన్యూ అవుతుందా..? సీఎం వచ్చాక వేట స్టార్ట్‌ అవుతుందా..? కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటూ ఉంటారు ఆ పార్టీ నేతలు. కానీ ఎవరు ఏం చెప్పినా… ఎవరెంత సమర్ధించుకున్నా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పిందనే విషయం స్పష్టమవుతోంది. మొదట కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఆ తర్వాత కొండా సురేఖ కుటుంబం, చివరగా చిన్నారెడ్డి. తాజాగా మళ్లీ కొండా కుటుంబం. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేతలు. పార్టీకి, ప్రభుత్వానికి తమ మాటలతో జరిగే నష్టం ఎంత..? ప్రజల్లో పలుచన అవుతున్నామా..? అనేదేమీ ఆలోచించడంలేదు. అదేమంటే… కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ..! అందరి అభిప్రాయాలు గౌరవిస్తాం అంటారు. కానీ ఇప్పుడదే పార్టీకి తలనొప్పిగా మారిందనే మాట వినిపిస్తోంది. ఇంకా లేటు చేస్తే పరిస్థితులు విషమించే ప్రమాదం ఉందనే అభిప్రాయానికి వచ్చిందట పార్టీ. ఇక వేటు వేయాల్సిందేనని డిసైడ్ అయిందట. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా పార్టీని ధిక్కరించినవాళ్లపై పార్టీ MLAలతోనే మాట్లాడిస్తున్నారు. ఇలా చేయడం వేటుకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడమేనని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట.

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో… మొదట PCC చీఫ్ మహేష్ గౌడ్ కాపాడారట. సీఎం ససేమిరా అన్నప్పటికీ… డిప్యూటీ సీఎం భట్టి దగ్గర్నుంచి సీఎం వద్దకు కొండా సురేఖ కూతురుని తీసుకుని వెళ్లి క్షమాపణ చెప్పించారట. కానీ ఇప్పుడు కొండా సురేఖ కూతురు సుస్మిత మాట్లాడిన మాటల విషయంలో… పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా సీరియస్‌గా ఉన్నారట. అందుకే కొండా సురేఖకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి కొండా సురేఖపై మండిపడుతున్నారు. ఇదంతా పార్టీ ఆలోచనకు అనుగుణంగా జరుగుతోందనే మాట వినిపిస్తోంది. మరోవైపు చిన్నారెడ్డి ఎపిసోడ్‌ను కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ అధ్యయనం చేసిన తర్వాతే… ఏం చేయాలి అనేది ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అయితే పార్టీ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ చిన్నారెడ్డికి ఎలాంటి నష్టం చేయలేదు అనేది కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. అయినప్పటికీ ఆయన అలా ఎందుకు మాట్లాడారనేది నేతలకే అర్థం కావడంలేదట. చిన్నారెడ్డి మాటలు అధిష్టానం వరకు వెళ్ళాయి. కాబట్టి యాక్షన్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువేననే మాట వినిపిస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగానే ఉందట కాంగ్రెస్‌ పార్టీలో. వీటన్నింటిపై ఎమ్మెల్యేలు క్రమశిక్షణా కమిటి చైర్మన్ మల్లు రవిని కలిసి కంప్లైంట్‌ కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారంనాడు హైదరాబాద్ రానున్నారు. సీఎం రాగానే చర్యలుంటాయా..? ఉంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటారు..? వేటు వేస్తారా..? పార్టీ నుంచే పక్కన పెడతారా..? అనేదానిపై కాంగ్రెస్‌లో గట్టిగానే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. సీఎం వచ్చేలోపు చేయాల్సిన పనులు కూడా జరిగిపోతున్నాయట. పార్టీ పరంగా పావులు కదుపుతున్నారట. మంత్రి కొండా సురేఖపై యాక్షన్ ఖాయమని గాంధీభవన్‌లో ఘాటుగానే చర్చ నడుస్తోందట. కానీ అది ఏ రూపంలో ఉంటుందనేది మాత్రం అంతుబట్టడంలేదట. చిన్నారెడ్డిపైనా యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. సీఎం హైదరాబాద్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం… గేమ్‌ స్టార్ట్‌ అనే చర్చ జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్‌లో. జరగబోయే పరిణామాలను కాంగ్రెస్‌ నేతలే కాదు… రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయట.