Story Board: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఊసు లేకుండానే.. 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు . శనివారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అయితే జనసేన తరఫున 24 సెగ్మెంట్లకుగానూ కేవలం ఐదు స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్. జనసేన తాను పోటీ చేసే 24 స్థానాల్లో మరో 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మొత్తానికి చాలా రోజుల చర్చ తర్వాత టీడీపీ, జనసేన ఒక అడుగు ముందుకు వేశాయి. టీడీపీ 94 మంది, జనసేన అయిదుగురిని మాత్రమే ఎనౌన్స్ చేశాయి. అంటే 99 చోట్ల ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ వచ్చేసింది. నిజానికి టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసుందనే చర్చ చాలా కాలంగా ఉంది. ఎన్డీఏలో భాగంగా ఉన్న జనసేన, చంద్రబాబు జైల్లో ఉన్నపుడు అనూహ్యంగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ల తర్వాత బీజేపీ కూడా ఈ పొత్తులో ఉందనే క్లారిటీ వచ్చిందన్నారు. ఇటు పవన్ కల్యాణ్ తాను చాలా కష్టపడి బీజేపీని ఒప్పించానని దీనికోసం త్యాగాలు కూడా చేశానని చెప్పుకున్నారు.. ఆ లెక్కన చూస్తే బీజేపీ పొత్తులో ఉందని భావించాలి. అప్పుడు బీజేపీ కూడా సీట్ల ప్రకటనలో భాగం అయి ఉండాలి. కనీసం, బీజేపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో అనే విషయమైనా క్లారిటీ ఇచ్చి ఉండాలి. కానీ, ఇప్పుడు బీజేపీతో సంబంధం లేకుండానే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించేశారు.
మరి పొత్తులో ఉన్న బీజేపీ ప్రస్థావన లేకుండా టీడీపీ, జనసేన ఎలా అభ్యర్థుల్ని ప్రకటించాయి? ఏ పరిస్థితిలో ఇదంతా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు వినపిస్తున్నాయి.. నిజానికి ఏపీలో ఎన్నికల హీట్ మొదలై చాలా రోజులైంది.. వైసీపీ వరుస జాబితాలతో ఒక్కసారిగా దూకుడు కనబరిచింది. ఇప్పటికే 7 జాబితాల్లో 65 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులతో వైసీపీ కలకలం రేపింది. వైసీపీ జాబితాలు రాగానే అసంతృప్తులు రేగాయి. కొందరు రాజీనామాలు చేశారు. అంటే, కొందరు నేతలు వెళ్లారు. మరి కొందరు వెనక్కి కూడా వచ్చేశారు. అంటే వైసీపీ అసంతృప్తులన్ని బుజ్జగించటం కూడా పూర్తి చేసి
ఎన్నికల వైపే సూటిగా వెళ్తోంది. అటు వరుసగా సిద్ధం సభలతో జగన్ బలప్రదర్శన కూడా చేస్తున్నారు.. ఈ పరిస్థితిలో టీడీపీ-జనసేన కూటమిలో నిశ్శబ్దం తప్ప మరేమీ కనిపించని పరిస్థితి.
పేరుకి టీడీపీ, జనసేన పార్టీల అధినేతల మధ్య అవగాహన కుదిరించదని ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో ఎవరెవరు బరిలో ఉంటారో క్లారిటీ ఉందనే టాక్ ఉన్నప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోవటంతో రెండు శిబిరాల్లో నిశ్శబ్దమే కనిపించింది. రోజులు గడవటమే తప్ప ఇరు పార్టీల్లో ఎలాంటి యాక్టివిటీ లేకుండా పోయింది. అటు వైసీపీలో హీట్, దూకుడు, వేగం స్పష్టంగా కనిపిస్తుంటే ఇటు టీడీపీ, జనసేన శిబిరంలో కదలిక లేకుండా పోయింది. దీంతో ఇరు పార్టీల నేతల్లో అయోమయం పెరుగుతూ పోయింది. ఎవరికి టిక్కెట్ వస్తుందో ఎవరికి రాదో అనే ఆందోళనలో ఎవరికి వారు టెన్షన్ పడే వరకు వచ్చింది. తమ స్థానం జనసేనకు పోతుందా అని టీడీపీ నేతలు తమకు బలమైన చోట సీటు దక్కుతుందా లేదా అని జనసేన నేతలు ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో కొంతమంది తామే అభ్యర్థులం అని ప్రకటించేసుకుని పోస్టర్లు కూడా వేసుకుంటున్నారు. ఇప్పటికైనా దీనికి చెక్ పెట్టకపోతే పరిస్థితి చేయిజారే ప్రమాదం ఉందని చంద్రబాబు పవన్ కల్యాణ్ గుర్తించారు. ఓ పక్క వైసీపీ ఇన్‌చార్జుల మార్పులు.. మరోపక్క సిద్ధం సభలతో ఈ స్థాయిలో బల ప్రదర్శన చేస్తుంటే టీడీపీ జనసేన మాత్రం పొత్తులో ఉన్నామంటూనే ఆ పొత్తు ఎంతరవకు దాని లెక్కేంటి అని మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇది ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో మైనస్ గా మారే ప్రమాదం ఏర్పడింది..
ఈ పరిస్థితికి ప్రధాన కారణం బీజేపీ ధోరణే అనేది అందరూ అనుకునే విషయమే. కానీ, ఈ ఇంకా బీజేపీ కోసం ఎదురు చూస్తూ ఉండిపోతే అసలుకే మోసం వచ్చేలా ఉందని గుర్తించిన టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు అభ్యర్థుల్ని ప్రకటించారు.. ఇంతకాలం నాలుగ్గోడల మధ్య కసరత్తు తప్ప ఏదీ కనిపించని పరిస్థితి నుండి ఇప్పటికే అభ్యర్థుల వడపోత పూర్తయినా కదలిక లేకుండా పోయింది.. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల జెండాలు రెపరెపలాడుతూ జనంలోకి వెళ్లాలంటే అభ్యర్థుల్ని ప్రకటించటం తప్ప మార్గం లేదు. నేతలకు స్పష్టత ఇవ్వటం తప్ప దారిలేదు. దీంతో పార్టీలో ఒక జోష్ తీసుకొచ్చి ఎన్నికల వైపు నడిపించేందుకు..డిసైడైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ .. మొదటి జాబితా ప్రకటించేశారు. ఈ జాబితాతో జనసేన పోటీ చేసే మొత్తం స్థానాల సంఖ్యలో క్లారిటీ వచ్చింది. ఇటు టీడీపీ మాత్రం 94 స్థానాలకు క్యాండిడేట్లను ఫైనల్ చేసింది.. అయితే ఇక్కడో విషయం గమనించాలి.. ఇప్పుడు ప్రకటించిన స్థానాలు చాలా వరకు వివాదాలు లేనివి అక్కడ ముందే ఎవరు పోటీ చేస్తారో డిసైడ్ అయినవి.. అంటే పెద్దగా కాంట్రవర్సీ లేని స్థానాలను ఇప్పటికి ఎనౌన్స్ చేశారని చెప్పవచ్చు.
అయితే ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.. బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ కల్యాణ్ అంటున్నారు.. నలభై, యాభై సీట్లలో పోటీ చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చినా ఎక్కువ సీట్లలో పోటీ చేయటం కాకుండా పోటీ చేసిన సీట్లన్నిటిలో గెలవటమే ముఖ్యం అన్నారు. అయితే ఇన్ని రోజులు బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతోందని అనే దానిపై రకరకాల అంకెలు వినిపించాయి.. అసలు బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతోంది? బయటకు వచ్చే వార్తలన్నీ తప్పేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు చూస్తే బీజేపీ ఇంకా నిశ్శబ్దం నుండి బయటకు రాలేదు ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలో రాష్ట్రంలో రెండు పార్టీలు ఇరకాటంలో పడకుండా ఉండాలంటే బీజేపీ కోసం ఎదురు చూపులు పక్కన పెట్టి కొంత వరకు యాక్టివిటీ మొదలు పెట్టడమే అవసరం అనే భావనతో సీట్లను ఎనౌన్స్ చేశాయని భావిస్తున్నారు. మొదట ఈ రెండు పార్టీలు ఎన్నికల పరుగులో భాగమైతే, బీజేపీ తన వ్యూహం ప్రకారం కలిసి వచ్చే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.