Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?

Chairman's Desk

Chairman's Desk

Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోడీకి దరిదాపుల్లో మరో నేత కనిపించడం లేదు. అటు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోడీ మానియా బాగానే పనిచేస్తుంది. ఇప్పటికే ప్రధానిగా ఇందిర రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. వరుసగా నాలుగోసారి పీఎం అయి.. నెహ్రూ రికార్డు కూడా బద్దలు కొడతారని బీజేపీ ధీమాగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా..? మోడీ వ్యక్తిగత ఛరిష్మా సరే.. బీజేపీ పనితీరు బాగుందా..? కేవలం హిందుత్వం, భావోద్వేగ అంశాలతో.. మరో టర్మ్ అధికారం సాధ్యమేనా..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

మూడు పర్యాయాలు అప్రతిహతంగా దేశాన్ని పరిపాలించిన ప్రధానిమోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా..? బీజేపీ ..నిర్విఘ్నంగా నాలుగోసారి దేశాన్ని పరిపాలిస్తుందా..? అన్నదానిపై దేశంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇది విశ్లేషించడం అపరిపక్వమే. కానీ చాలామంది విశ్లేషకులు మాత్రం.. నాలుగోసారి మోడీ ప్రధాని కావడం కష్టసాధ్యమని అంటున్నారు. అలాగని వారేమీ మోడీ ఇమేజ్‌ని శంకించడం లేదు. కానీ ఇతర పరిస్థితులు కలిసొస్తాయా.. లేదా అనే అంశం గురించే అసలైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఓ నేత ప్రధాని కావాలంటే వ్యక్తిగత ఇమేజ్‌ ఒక్కటే సరిపోదు. దానికి తోడు పార్టీ బలం, జనం మూడ్.. సానుకూల రాజకీయ వాతావరణం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం మోడీ ప్రధానిగా పన్నెండేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ప్రధానిగా మోడీ వ్యక్తిగత ఆకర్షణకు ఢోకా లేదనే విషయం ఎప్పటికప్పుడు నిరూపితమౌతూనే ఉంది. కానీ బీజేపీ ఓ పార్టీగా ఆశించిన స్థాయి విజయాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుకోలేకపోతోంది. సూటిగా చెప్పాలంటే మోడీ వ్యక్తిగత ఆకర్షణపై అతిగా ఆధారపడుతోంది. సంస్థాగతంగా పార్టీ బలం తగ్గకపోయినా.. ఎన్నికల్లో పార్టీ చూపే ప్రభావం మాత్రం తగ్గుతూ వస్తోంది. చివరకు బీజేపీకి ఓటేయాలని అడగటం పోయి.. మోడీకి ఓటేయాలని అడిదేకా పరిస్థితి వచ్చింది. ఇది మోడీకి ఇమేజ్‌ పరంగా మంచి గుర్తింపే. కానీ బీజేపీ పార్టీ పరంగా మంచిదా.. కాదా అనేది కచ్చితంగా చర్చనీయాంశమే.

×
×
Ad

ఎందుకంటే 2014 నుంచి ఇప్పటిదాకా బీజేపీ మూడుసార్లు దేశంలో అధికారంలోకి వచ్చింది. దానికి ప్రధాన కర్త, కర్మ, క్రియ మోడీనే అని చెప్పడానికి సందేహించక్కర్లేదు. కానీ అదే తీరుగా నాలుగోసారి దేశంలో అధికారంలోకి రాగలరా.. అంటే కచ్చితంగా చెప్పలేం అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రధాని మోడీపై ఎటువంటి ఆరోపణలు, విమర్శలు, లేకపోయినప్పటికీ.. మూడుపర్యాయాలు , 15 ఏళ్లపాటు ఒకేపార్టీ పాలన చూసిన, దేశప్రజానీకం.. సహజంగానే మార్పు కోరుకుంటుందనేది కొందరి వాదన. 2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు ..2024లో 240 సీట్లు బీజేపీ గెల్చుకుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమితో 292 సీట్ల బలంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అదికూడా అత్తెసరు మెజార్టీతోనే.

అయితే బీజేపీకి వచ్చిన సీట్లతో సంబంధం లేకుండా మోడీ తన వ్యక్తిగత ఇమేజ్ కారణంగా తిరుగులేని అధికారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ సీట్లు పెరిగినప్పుడు ఉత్సాహం ఉరకలేస్తున్న బీజేపీ.. కాస్త సీట్లు తగ్గగానే నీరసపడుతోందనేది కాదనలేని నిజం. ఇప్పటిదాకా మోడీని ఎక్కువగా నమ్ముకుని రాజకీయ మనుగడ సాగిస్తున్న బీజేపీ.. ఇదే పద్ధతిలో వెళ్లి.. మరోసారి దేశంలో జెండా పాతేద్దామనుకుంటే.. అంత తేలిక కాదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఓ నేత వ్యక్తిగత ఆకర్షణకు జనం ఎక్కువకాలం ప్రభావితం కావడం అరుదు. ఆ మాటకొస్తే మోడీ సమకాలీన రాజకీయాల్లో ఇప్పటికే మోయాల్సిందానికంటే చాలా ఎక్కువ బరువు మోసేశారనే చెప్పాలి. ప్రతిసారీ అంచనాల భారం పెరుగుతున్నా.. ఏదోలా ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ వచ్చారు. అలాగని మోడీ మోస్తున్నారు కదా అని భారమంతా ఆయనపై వేయడం కరెక్టా.. కాదా అనేది భారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఆత్మావలోకనం చేసుకోవాలి. నిజానికి నేత బలం, పార్టీ బలం ప్రజలపై సమానస్థాయిలో ప్రభావం చూపించాలి. పోనీ నేత బలానికి.. వేడ్నీళ్లకు చన్నీళ్లలా అయినా పార్టీ బలం తోడవ్వాలి. అంతే కానీ అంతా మోడీ చూసుకుంటారులే అనే ఉదాసీన వైఖరితో నష్టం తప్పదని గత సార్వత్రిక ఎన్నికల్లోనే తేటతెల్లమైంది. ఆ సంగతి గుర్తించిన మోడీ.. పార్టీని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. మరి ఆయన హితబోధను పార్టీ ఏ మేరకు చెవికెక్కించుకుందనేది వచ్చే సార్వత్రిక ఎన్నికలు తేల్చేస్తాయి.

ప్రస్తుతానికి మూడు విడతలుగా వరుసగా దేశంలో బీజేపీ పాలన నడుస్తోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ పాలనా కాలమంతా బీజేపీ బలం అలాగే ఉందా.. అంటే మాత్రం లేదనే చెప్పాలి. ఇప్పటిదాకా బీజేపీకి తిరుగులేని బలం కారణంగా అప్రతిహత అధికారం దక్కలేదు. అది 2019లో ఒక్కసారే సాధ్యమైంది. కానీ 2014, 2019లో మిత్రుల బలమే ఆదరువుగా కేంద్రంలో సర్కారు వచ్చింది. నిలబడింది. కొనసాగింది. కాకపోతే ఇక్కడ మిత్రుల రాజకీయ అనివార్యతలు.. బీజేపీకి అదనపు బలం చేకూర్చాయి. అంటే ఇది రాజకీయ వాపే కానీ బలుపు కాదని చెప్పుకోవచ్చు. ఈ పాలనా కాలంలోనే బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించామని చెప్పుకుంది. కానీ అందుకు తగ్గట్టుగా పనితీరు మాత్రం చూపలేకపోతోంది. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఆ ఎన్నికలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. ఎందుకంటే మోడీ ప్రచారానికి వచ్చేదాకా ఆపసోపాలు పడుతున్న బీజేపీ.. ఆయన వచ్చి వెళ్లాక మాత్రం ఒక్కసారిగా పుంజుకుని ఎన్నికల్లో గెలిచేస్తోంది. కానీ ఇదే పద్ధతి ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్న కమలనాథుల్ని వేధిస్తోందో లేదో కానీ.. రాజకీయ విశ్లేషకుల్ని మాత్రం ఆలోచింపచేస్తోంది.

ఒక్కసారి చరిత్ర చూసుకుంటే నెహ్రూ, ఇందిరాగాంధీ బలమైన ప్రధానులుగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే వారి బలానికి.. పార్టీ అదనపు బలమైంది. కానీ ఇప్పుడు మోడీ విషయంలో బీజేపీ అలా కాలేకపోవడమే అసలు సమస్య. పైగా ప్రతిదానికీ మోడీ మీద ఆధారపడే తంతు బాగా ఎక్కువైంది. దేశంలో అధికారం చేపట్టి ఇంతకాలం అయ్యాక కూడా.. పార్టీ ఎందుకు సంస్థాగతంగా తిరుగులేని స్థాయికి చేరడం లేదనేది కాషాయ పార్టీ తనకు తానే వేసుకోవాల్సిన ప్రశ్న. నిజానికి దేశంలో అధికారం కోసం బీజేపీ కొన్ని దశాబ్దాలు ఎదురుచూసింది. తీరా ఇప్పుడు మోడీ రూపంలో బలమైన ప్రధాని వచ్చాక కూడా.. పార్టీ పరంగా బలం పుంజుకోవటానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందనే ప్రశ్న వస్తోంది. అలాగని బీజేపీ మరీ బలహీనంగా ఉందని ఎవరూ అనడం లేదు. ఇప్పటికీ మిగతా పార్టీల కంటే బీజేపీ బలంగానే ఉంది. అలాగని బీజేపీ ఉండాల్సినంత బలంగా అయితే లేదు. అంటే ప్రతిపక్షాల బలహీనతల కారణంగా బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తోందే తప్ప.. నిజంగా బలమైన ప్రతిపక్షం ఉంటే.. అంతకుమించిన బలంగా ఉండగలదా అనే సందేహాలు ఆ పార్టీ క్యాడర్‌కు కూడా వస్తున్నాయంటే నమ్మాల్సిందే.

2014 నుంచి 2019 వరకు పార్టీ ప్రస్థానం ఒకలా ఉంది. సూటిగా చెప్పాలంటే ఆరోహణ క్రమంలోనే ఉంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా అవరోహణ క్రమంలోకి జారింది. అదే సమయంలో మోడీ వ్యక్తిగత ఇమేజ్ ఎక్కడా అవరోహణ క్రమంలోకి పోలేదు. అయినా సరే పార్టీ మాత్రం తిరోగమనంలోకి వెళ్లడం కచ్చితంగా ప్రమాదకర సంకేతమే. ఈ సంగతి గుర్తించారు కాబట్టే మోడీ, అమిత్ షా పార్టీపై ఇటీవలి కాలంలో మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. కానీ వారిద్దరూ పాలనాపరంగా కీలక స్థానాల్లో ఉన్నారు కాబట్టి.. ఎక్కువ సమయం కేటాయించడం ఎల్లకాలం కుదరకపోవచ్చు. పార్టీలో మిగతా సీనియర్లు కూడా చొరవ తీసుకుని పార్టీ బలోపేతానికి సరైన ప్రణాళికలు రచించి.. అందుకు తగ్గ కార్యాచరణ తీసుకోవాలి. లేకపోతే అంగట్లో అన్నీ ఉన్నా.. అనే సామెతను బీజేపీ భవిష్యత్తులో గుర్తుచేసుకునే ప్రమాదం లేకపోలేదనేది విశ్లేషకుల హెచ్చరిక.

ఇప్పుడోసారి ప్రధానిగా మోడీ బలాబలాలు చూద్దాం. ప్రధానిగా మోడీ చాలా విజయాలు సాధించారు. హిందుత్వం విషయంలో తిరుగులేదనిపించుకున్నారు. దేశ భద్రత, రక్షణ పరమైన అంశాల్లోనూ మోడీకి నూటికి నూరు మార్కులు పడ్డాయి. అంతేకాదు క్లిష్ట పరిస్థితుల్ని నిభాయించటం.. కష్టకాలంలో దేశ ప్రజల్ని ఒక్కతాటిపై నడిపించడంలోనూ ఆయన సామర్థ్యానికి తిరుగులేదు. ఇక ఎన్నికల్లో విజయాలు సరేసరి. ప్రధానిగా పన్నెండేళ్లు పూర్తిచేసిన తర్వాత కూడా.. మోడీ మాటకు ఇంకా ప్రజలు అంతే విలువ ఇస్తున్నారనే విషయాన్ని కూడా తేలికగా కొట్టిపారేయలేం. కానీ మోడీ పాలనలో కేవలం విజయాలే కాదు.. కొన్ని అసంతృప్తులూ లేకపోలేదు. ఆర్థికాంశాల్లో ఆయన చేయాల్సినంత చేయలేదనే మాటొస్తోంది. అంతే కాదు మోడీపై దేశ ప్రజలకు ఉన్న భారీ అంచనాల్ని కూడా పూర్తిస్థాయిలో అందుకోలేదని చెబుతారు విశ్లేషకులు. నల్లధనం వెనక్కితేవడం, అఖండ భారత్, పీఓకే స్వాధీనం లాంటి అంశాల్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పెట్రోల్ ధరలు, పేపర్ లీకేజీలు కూడా మోడీకి కొత్త సవాళ్లు విసురుతున్నాయనడంలో సందేహం లేదు. ఇక్కడ అన్నింటికీ ఆయనే బాధ్యుడే అనే ప్రశ్నకు విలువలేదు. ఎందుకంటే ఓ ప్రధాని హయాంలో జిరిగిన మంచి చెడులన్నింటికీ.. ప్రత్యక్ష సంబంధం ఉన్నా.. లేకున్నా.. ఆ పదవిలో ఉన్నవారిదే బాధ్యత అవుతుంది. ఎవరేమనుకున్నా.. దేశ ప్రజలు వాటిని ప్రధాని ఖాతాలోనే వేస్తారు. 2014లో దేశాన్ని మారుస్తానన్న మోడీ మాటను నమ్మి బీజేపీని గద్దెనెక్కించారు దేశ ప్రజలు. అలాగే 2019లో మరింత బలం ఇస్తే.. దేశాన్ని తిరుగులేని విధంగా తయారు చేస్తాననే మాటకూ విలువిచ్చి రెండోసారి కూడా గద్దెనెక్కించారు. కానీ రెండో విడత పాలనలో సంపూర్ణ మెజార్టీ ఇచ్చినా.. అనుకున్నంతగా పని జరగలేదనే చర్చలు నడిచాయి. కానీ రెండో విడత పాలనపై కాస్త అసంతృప్తి ఉన్నా.. మోడీ వ్యక్తిగత ఆకర్షణ తగ్గకపోవడంతో.. మూడోసారి అధికారం కష్టం మీద దక్కింది. ఎన్నికల సమయంలో ఆఖరి క్షణంలో కుదుర్చుకున్న పొత్తులే ఎన్డీఏ 3.0 సర్కారుకి ఊపిరి పోసిందనే వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. నిజానికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత మోడీ మూడోసారి పీఎం అయినా.. పాలన గతంలో మాదిరిగా నల్లేరుపై నడక కాదని.. మిత్రులతో కష్టాలు తప్పవని ఎన్నికల పండితులు అంచనా వేశారు. కానీ వారి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. మోడీ ఎప్పటిలాగే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నరు. ఇటు కీలక మిత్రపక్షాలు వారి రాష్ట్ర అవసరాల దృష్ట్యా.. మోడీకి పెద్దగా సమస్యలు సృష్టించడం లేదు. దీంతో విశ్లేషకులతో పాటు ప్రతిపక్షాలు అంచనా వేసిన సంకీర్ణ పదనిసలు ఎక్కడా వినిపించడం లేదు. అన్నింటికీ మించి మిత్రపక్షాలు కూడా మోడీ నాయకత్వంలో పనిచేయటానికి, భవిష్యత్తులోనూ కొనసాగటానికీ ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ ఊపులోనే నాలుగోసారి అధికారం ఖాయమేనని బీజేపీ అంచనాలు వేసుకుంటోంది.

కానీ 2024 ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు రావటానికి.. పార్టీ పరంగా జరిగిన కొన్ని తప్పులే కారణం. వాటిని సరిదిద్దటానికి మోడీ, అమిత్‌ షా వేగవంతమైన ప్రయత్నాలైతే చేశారు. కానీ అవన్నీ సర్దుకున్నాయా.. లేదా అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికలే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్ని అందుకు ఓ నిర్దిష్ట ఉదాహరణగా తీసుకోలేం. ఎందుకంటే బీజేపీ ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ ఒకేలా గెలవటం లేదు. ఒక్కోసారి ప్రీపోల్ స్ట్రాటజీ.. మరోసారి పోస్ట్ పోల్ స్ట్రాటజీతో అధికారం దక్కించుకుంటోంది. ఒక్కోసారి బలమైన స్థానిక నేతల్ని.. మరోసారి మోడీ మానియాను.. తప్పదనుకుంటే సంక్షేమానికీ పెద్దపీట వేసి ఎలాగోలా అధికారం దక్కించుకుంటోంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ మూకుమ్మడిగా ప్రయోగించాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకుమించిన సమగ్ర వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. దేశ ప్రజలంతా కనెక్టయ్యే ఓ కీలకాంశాన్ని హైలైట్ చేయాలి. ప్రచారమంతా దాని చుట్టూ తిరగాలి. ఆ కీలకాంశాన్ని ప్రజలకు కనెక్ట్ చేయాలి. ప్రతిపక్షాలు అందుకోలేని స్థాయిలో ఆ అంశాన్ని బీజేపీ భుజాన వేసుకోవాలి. తొలి నుంచీ చివరి దాకా ఒకే టెంపో కొనసాగించి.. అంతిమంగా నాలుగోసారి అధికారం దక్కించుకోవాలి. ఇక్కడిదాకా ప్లానే. కానీ దీన్ని అనుకున్నట్టుగా అమలు చేయాలంటే నిర్దిష్టమైన కార్యాచరణ కావాల్సిందే.

కానీ ఆ కార్యాచరణకు సమష్టిగా ముందుకు కదలాల్సి ఉంటుంది. ఉన్న బలాల్ని కాపాడుకుంటూనే.. కొత్త బలాల్ని సమీకరించాలి. అన్నింటికీ మించి బలహీనతల్ని కూడా బలాలుగా మార్చుకోవాలి. సహజంగానే 15 ఏళ్లపాటు ఓపార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రజల్లో అసంతృప్తి రావడం మామూలే. దానికి తోడు నిరుద్యోగం పెరగడం, ఆర్థిక సమస్యలు, అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న పెట్రోల్ రేట్లు, ఇవన్నీ వెరసి.. నాలుగోసారి మోడీ ప్రధాని అవ్వడం కష్టమేనేమో అనే సందేహం కలుగుతోంది. చాలా మంది విశ్లేషకులు చెబుతుంది కూడా ఇదే. కానీ వీరి అంచనాలు వమ్ము చేయాలంటే.. బీజేపీ కచ్చితంగా ప్రత్యేక కార్యాచరణ తీసుకోక తప్పని స్థితి కనిపిస్తుంది. తొలిసారి అధికారం దక్కినప్పుడు.. కొత్త కదా.. పాత తప్పులు సరిచేయటానికి సమయం పడుతుందని సరిపెట్టొచ్చు. రెండోసారి అధికారం దక్కినప్పుడు మాదైన విధానం తయారుచేస్తున్నామని సంతృప్తి పరచొచ్చు. కానీ మూడోసారి అధికారం దక్కాక ఇక సాకులు చెప్పడం కుదరదు. ఇప్పుడు దేశ ప్రజలు కూడా మోడీ ఏదో చేయాలని ఆశిస్తారే తప్ప.. ఎందుకు చేయలేకపోతున్నారో కారణాలు వినటానికి ఆసక్తి చూపకపోవచ్చు. ఇంకెన్నేళ్లు సమయం కావాలనే ప్రశ్నలు ఎదురుకావచ్చు. మరీ ముఖ్యంగా మోడీకి మొదట్నుంచీ మద్దతుగా ఉన్న యువత ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కీలకమైన ఈ వర్గాన్ని సంతృప్తిపరచడం మోడీ సర్కారుకు అత్యంత కీలకం. నాలుగోసారి అధికారం దక్కాలంటే వీరి ఓట్లు గంపగుత్తగా పడటం చాలా ముఖ్యం అని బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటారు.

ఇంకా విశ్లేషిస్తే.. ఇక్కడ కేవలం బీజేపీ, మోడీ కోణం నుంచే కాకుండా.. ప్రతిపక్షాల వైపు నుంచి కూడా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు గతంలో మాదిరిగా కేవలం మోడీ మాటల్ని మాత్రమే దేశ ప్రజలు వినడం లేదు. అడపాదడపా ప్రతిపక్ష నేతల మాటలకూ విలువ ఇస్తున్నారు. కొన్ని మాటలు నిజమేనని కూడా నమ్ముతున్నారు. అందుకే బీజేపీకి అక్కడక్కడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న ఈ వాస్తవాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గమనంలోకి తీసుకోవాలి. ప్రస్తుతం మోడీ ముందున్న ప్రధాన సవాళ్లలో ఇది కూడా ముఖ్యమైనదని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇప్పుడు మోడీ కేవలం తనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంతో పని పూర్తి కాదు. దాంతో పాటు ప్రతిపక్షాల వాదనలో వాస్తవం లేదని కూడా దేశప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. అందుకే ఈ మధ్యకాలంలో మోడీ ప్రసంగాల్లో ఈ మార్పు కూడా కాస్త కనిపిస్తూనే ఉంది. మోడీ స్పీచ్‌లు తన కోణంలో కూడా ప్రతిపక్షాల కోణం నుంచి మొదలై.. చివరకు బీజేపీ కోణంలో ముగుస్తున్నాయి. కానీ ఈ మార్పును బీజేపీ నేతల్లో ఎంతమంది గమనించారనేది మరో చిక్కు ప్రశ్న. అసలు మోడీని, ఆయన కార్యాచరణను బీజేపీ ఓ పార్టీగా నిజంగా నిశితంగా గమనిస్తోందా..? ఏ మేరకు ఆయన హితబోధను చెవికెక్కించుకుంటుందనేది తేలాల్సి ఉంది.

దేశంలో ప్రస్తుతం బీజేపీ అనుభవిస్తున్న అధికారానికి మూలం హిందుత్వమే అని ఆ పార్టీ కూడా ఒప్పుకుంటుంది. ఇప్పటిదాకా హిందూ ఓట్లను సంఘటిత పరచే పని కాషాయ పార్టీ సమర్థవంతంగా చేస్తూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే అసలా స్పృహ లేని రాష్ట్రాల్లో కూడా ఓటర్లను ఆ మేరకు కాస్తో కూస్తో సంఘటితం చేయగలుగుతోంది. బీజేపీ హిందుత్వ ప్లాన్‌ను కౌంటర్ చేయలేకే ఓడిపోతున్నామని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదులు చేస్తున్నాయి. అందుకే తాము ఇండి కూటమి కట్టినా అనుకున్నంతగా ఫలితం రావడం లేదనీ వాపోతున్నాయి. అంతమాత్రాన బీజేపీ ఎంతకాలం హిందుత్వ మంత్రంతో నెట్టుకురాగలదనే విషయాన్ని ఆలోచించాల్సిందే. ప్రతీసారి హిందూత్వ మంత్రమే పనిచేస్తుందనుకోవడం కూడా కష్టం.. కులం, మతం, వర్గం వీటన్నింటికన్నా దేశప్రజల్ని ఆర్థిక అంశాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. భానావేశాలు కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఆర్థికాంశాలు కచ్చితంగా .. ప్రజల్ని ప్రభావితం చేయకుండా ఉండవు. ఏరకంగా చూసినా యుద్ధం వల్ల అయితేనేమి, అంతర్గతపరిస్థితుల వల్ల అయితేనేమీ.., ఆర్థిక స్థితిగతులు నానాటికి దిగజారుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. జీవన ప్రమాణాలు మెరుగవ్వడం లేదు. వీటిని జనం పరిగణనలోకి తీసుకుంటే..మోడీ నాలుగోసారి రావడం కష్టమే అన్నది విశ్లేషకుల అంచనా. దీనికి తోడు దేశంలో zen -Z అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. వారు నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ అందరికీ షాకిచ్చింది. దీని వెనుకున్నది యువతే కాబట్టి.. వారు నిరాశానిస్పృహల్లో ఉన్నారా.. అనే సందేహాలూ రాకపోలేదు. అయితే ఈ ట్రెండ్ సోషల్ మీడియాకే పరిమితం కావడంతో.. పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్రంలో నాలుగోసారి బీజేపీ రావడం కష్టమేనని అధికారమార్పిడికి అవకాశం ఉండొచ్చని చాలా మంది అంచనా.

ప్రస్తుతం బీజేపీ ఎదుర్కుంటున్న సవాళ్లలో కొన్ని దీర్ఘకాలికంగా నలుగుతున్నవి కాగా.. మరికొన్ని మాత్రం కొత్తగా పుట్టుకొస్తున్నాయి. పాతవాటిని ఎలాగోలా మేనేజ్ చేసినా.. కొత్తవాటిని ఎలా అధిగమించాలనేది కచ్చితంగా సమస్యే. దీనికి వీలైనంత త్వరగా పరిష్కారాలు వెతక్కపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ సవాళ్ల విషయంలో ప్రతికూల అంశాలతో పాటు సానుకూల అంశాలూ లేకపోలేదు. కొన్ని సమస్యలు మోడీ పెంచిన అంచనాల నుంచి కూడా పుట్టుకొచ్చాయనే సెటైర్లు పడుతున్నాయి. ఉదాహరణకు దేశాన్ని విశ్వగురు అన్న మోడీ.. పేపర్ లీకేజీలకు ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అలాగే దేశం మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ దిశగా పరుగులు తీస్తుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో.. మన ఆర్థిక వ్యవస్థ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ రెండు సవాళ్లకూ సరైన సమాధానాలు చెప్పటానికి ఓ సమర్థ ప్రాతిపదిక తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

నిజమైన నాయకుడి బలం ఏమిటో.. అత్యంత క్లిష్ట సమయాల్లోనే తెలుస్తుందంటారు. ఆ రకంగా చూస్తే.. మోడీ నాయకత్వ పటిమకు రాబోయేది పరీక్షా సమయం అని అర్థం చేసుకోవాలేమో. ఆ కఠిన సమయాన్ని ఎంత సమర్థవంతంగా అధిగమిస్తారనే అంశం మీదే నాలుగోసారి అధికారం ఆధారపడి ఉంది. దీనికి కేవలం మోడీ ఒక్కరే కష్టపడితే సరిపోదు.. ఆయనంత కాకపోయినా.. కనీసం చేదోడువాదోడుగా అయినా పార్టీ నిలబడాలి. అంతకుమించి ప్రజాభిప్రాయాన్ని సానుకూలపరచడం కేవలం ఓ వ్యక్తికి అయ్యే పని కాదు. దానికి సంస్థాగత తోడ్పాటు అవసరం అవుతుంది. ఇప్పటిదాకా మోడీ మాట మేరకు దండులా కదిలి పనిచేసిన బీజేపీ క్యాడర్.. ఇక ముందు కూడా అంతకు మించిన ఉత్సాహంతో పనిచేస్తేనే అనుకున్న ఫలితం దక్కుతుంది. మోడీ నాలుగోసారి ప్రధాని అయితే మనేకేంటి..? మహా అయితే ఆయనకు వ్యక్తిగత రికార్డులు దక్కుతాయనే భావన రానీయకుండా చూసుకోవాలి. నాలుగోసారి అధికారం దక్కితే బీజేపీ మరింత బలపడుతుందని, పార్టీ దేశంలో మరింతగా వేళ్లూనుకుంటుందనే విషయం కార్యకర్తలందరి మెదళ్లలోకి చొప్పించాలి. అంతేకానీ ఎన్నికలొస్తే అమిత్ షా ప్లాన్ చేస్తారు. మోడీ ప్రచారం చేస్తారు. మేం తేలికగా గెలిచేస్తాం అనే అతివిశ్వాసంతో బీజేపీలో కొందరు నేతలు, క్యాడర్ ఉన్నారని ఇటీవల ఆరెస్సెస్ కూడా కాషాయ నేతలకు తలంటింది. దీంతో ఇప్పటికే మోడీ, అమిత్‌ షా కేవలం తమ ప్రచారంతో గెలవలేమని, క్యాడర్ డోర్ టు డోర్ క్యాంపైన్, బూత్ మేనేజ్‌మెంట్‌ కూడా కీలకమేనని నూరిపోస్తున్నారు. మేం ఎంత ఊపు తెచ్చినా.. దాన్ని విస్తృతం చేయాల్సింది కార్యకర్తలేనని తేల్చిచెబుతున్నారు.

మొత్తం మీద బీజేపీ పైకి బలంగా కనిపిస్తున్నా.. తీర్చుకోవాల్సిన అంతర్గత సమస్యలున్నాయి. అలాగే తిరుగులేని మోడీ ఛరిష్మాను సానుకూలంగా ఉపయోగించుకోవాలే కానీ.. దానిపై అతిగా ఆధారపడి ఎక్కువ ఇమేజ్‌ను శాపంగా మార్చుకునే ధోరణికి స్వస్తి పలకాలి. పనిలోపనిగా అధికారం కోసం సమష్టిగా పనిచేయాలనే ప్రాథమిక సూత్రాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మోడీ ఇమేజ్ పెరిగితే పార్టీ బలం పెరగాలి. పార్టీ బలం పెరిగితే.. మోడీ ఇమేజ్ పెరగాలి. ఇలా రెండూ పరస్పర ఆధారితంగానే ఉండాలి. కానీ దేనికదే సంబంధం లేనట్టుగా ఉండటం ఎవరికీ మంచిది కాదని గుర్తించడమే బీజేపీ తక్షణ కర్తవ్యం. ఆ మేరకు కర్తవ్యాన్ని తెలుసుకుంటే.. బీజేపీకి నాలుగోసారి అధికారం కష్టసాధ్యం కావచ్చేమో కానీ.. అసాధ్యం మాత్రం కాదనే వాదన లేకపోలేదు. ఇక్కడ మరో విషయం కూడా బీజేపీ మర్చిపోకూడదు. ప్రస్తుతం కాషాయ పార్టీ డ్రీమ్‌ రన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ రన్ కొనసాగించటానికి ప్రతి ఒక్కరూ కష్టపడి సమష్టి కార్యాచరణ తీసుకోవాలి. అంతే కానీ అంతా మోడీ చూసుకుంటారులే అనే ఉదాసీన వైఖరికి ఇకనైనా తెరదించాలి. కాదంటే మాత్రం నాలుగోసారి అధికారం కష్టమేననే కొందరు విశ్లేషకుల అంచనాలు నిజమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదీ ఈవారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.