Kim Jong un: ఆత్మాహుతి దాడి డ్రోన్‌లను భారీగా ఉత్పత్తి చేయాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీనికి ఒక రోజు ముందు అతను ఈ ఆయుధ వ్యవస్థ పరీక్షను వీక్షించాడు. ఉత్తరకొరియా మానవరహిత ఏరియల్ టెక్నాలజీ కాంప్లెక్స్ (UATC) తయారు చేసిన భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన డ్రోన్‌ల పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారు. ఇందుకు సంబంధించి కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సమాచారం ఇచ్చింది.
Also Read: MCLR Rate Hike: రుణాల వడ్డీ రేటును పెంచేసిన ఎస్బిఐ
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) నివేదించిన ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ ఆత్మాహుతి దాడి డ్రోన్‌ల భారీ ఉత్పత్తి అవసరాన్ని నొక్కి చెప్పారని తెలిపింది. సూసైడ్ డ్రోన్‌లు పేలుడు పదార్థాలను మోసుకెళ్లే మానవరహిత డ్రోన్‌లు, వీటిని ఉద్దేశపూర్వకంగా శత్రు లక్ష్యాలపై పడేలా రూపొందించారు. ఇవి గైడెడ్ క్షిపణులుగా సమర్థవంతంగా పనిచేస్తాయని నివేదించింది. ఆగస్ట్‌లో ప్యోంగ్యాంగ్ తన సూసైడ్ డ్రోన్‌ను మొదటిసారిగా ఆవిష్కరించింది. రష్యాతో పెరుగుతున్న సంబంధాల కారణంగా ఇప్పుడు ఉత్తర కొరియా ఈ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. గురువారం నాటి పరీక్షలో, డ్రోన్‌లు ముందుగా నిర్ణయించిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాలను “ఖచ్చితంగా” చేధించాయని KCNA నివేదించింది.
Also Read: Aadhaar Update: ఆధార్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చంటే? నిబంధనలు ఏమంటున్నాయంటే
భూమి, సముద్రం మీద శత్రువుల లక్ష్యాలకు వ్యతిరేకంగా ఖచ్చితమైన దాడులను నిర్వహించే లక్ష్యంతో ఆత్మాహుతి దాడి డ్రోన్‌లు వివిధ స్ట్రైక్ రేంజ్‌లలో ఉపయోగించబడతాయని ఏజెన్సీ తెలిపింది. ఆగస్టులో ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలలో ఈ డ్రోన్లు ఇజ్రాయెల్ తయారు చేసిన ‘హరోప్’, రష్యాలో తయారు చేసిన ‘లాన్సెట్-3’ అలాగే ఇజ్రాయెల్ తయారీ ‘హీరో 30’లను పోలి ఉన్నాయని నిపుణులు తెలిపారు. రష్యా నుంచి ఉత్తర కొరియా ఈ సాంకేతికతను పొంది ఉండవచ్చొని అంచనాలు వేస్తున్నారు.