NTV Telugu Site icon

AP Violence: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

Petrol

Petrol

AP Violence: ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

Read Also: Human Trafficking: ఉద్యోగాల పేరుతో మాయ.. ఏపీ, పశ్చిమ బెంగాల్‌ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు, తిరుపతి, తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఏపీలో ఎన్నికల తరవాత కూడా పరిస్ధితులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పెట్రోలు బంకుల్లో పని చేసేవాళ్ళు పెట్రోలు పోయాలంటే భయపడుతున్నారు.. బాటిల్ తీసుకొస్తే పెట్రోలు పోయవద్దని పోలీసులు నోటీసులు ఇస్తే.. బ్లేడు బ్యాచ్‌లు మాత్రం రాత్రికి వచ్చి తగులబెడతాం అంటున్నారు. బెజవాడలో పెట్రోల్ బంకుల సిబ్బందికి, యజమానులకు కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లోని సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. రాత్రిపూట రక్షణ కల్పించాలని బంకు యజమానులు కోరుతున్నారు.