Nizamabad: నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారు జామున రియాజ్ బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. గత 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. 48 గంటల్లోనే సారంగాపూర్ వద్ద పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో మరో యువకుడిపై కూడా రియాజ్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో జరిగిన పెనుగులాటలో కొందరు గాయపడ్డారు. తరువాత జిల్లా ఆసుపత్రి ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. భద్రత కోసం ఉన్న కానిస్టేబుల్ వెపన్‌ను లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా, రియాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
READ MORE: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి