ప్రధాని నరేంద్రమోడీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ఇండియా. ఈ కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అందులో ఉన్న పార్టీల నేతలందరు మాత్రం ఐకమత్యంగా ఉండటం చాలా అవసరమని ఆ మాటపై కట్టుబడి ఉన్నారు. ఇక ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో ప్రతి పార్టీకి చెందిన నేతలు తమ నాయకుడే ప్రధాని అభ్యర్థికి సమర్థుడు అంటూ ప్రకటిస్తున్నారు.
Also Read: Suryakumar Yadav Sixes: కెమరూన్ గ్రీన్‌కు దడ పుట్టించిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో చూశారా?
తాజాగా ప్రధానిగా తమ పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, జేడీయూ నేత మహేశ్వర్ హజారీ అన్నారు. ప్రధానిగా కావాల్సిన అన్ని లక్షణాలు నితీశ్ కుమార్‌లో ఉన్నాయని ఆయన కొనియాడారు. ఇండియా కూటమి ఎప్పుడు ప్రధాని పేరును ప్రకటిస్తుందో తనకు తెలియదని కానీ అలా ప్రకటిస్తే అది కచ్ఛితంగా నితీశ్ కుమార్ పేరే అయి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును త్వరలోనే ఇండియా కూటమి ప్రకటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నితీష్ కుమార్ ఐదుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారని, 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారన్న విషయాన్ని మహేశ్వర్ హజారీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థి కావడంపై నితీశ్ ను పలు సందర్భాల్లో అడగ్గా తాను ఏ పదవి కోరుకోవడం లేదని, ప్రతిపక్ష నాయకులను ఏకం చేసి ముందుకు సాగుతామని నితీష్ కుమార్ గతంలో చెప్పారు. తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇక ప్రధాన నేతలు తమకు పదవులపై ఆశలు లేవని చెబుతున్నా వారి అనుచరులు మాత్రం తమ నేతే ప్రధాని అభ్యర్థి అంటూ పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్ టీఎంసీ నేతలు కూడా తమ నాయకురాలు మమతా బెనర్జీనే ప్రధాని అభ్యర్థికి సరైన వ్యక్తి అంటూ పలుమార్లు అన్నారు.