NIMS : హైదరాబాదులోని నిమ్స్ (NIMS) హాస్పిటల్‌లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఘటనకు గల ప్రధాన కారణం సిగరెట్, చెత్త వల్లేనని పోలీసులు తేల్చారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందిస్తూ, వేగంగా మంటలను అదుపులోకి తెచ్చారు. గంట వ్యవధిలోనే మంటల్ని కంట్రోల్ చేసిన ఫైర్ టీమ్ మెరుగైన చర్యలందించింది. అయితే మంటల వెనుక గల అసలు కారణం మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఐదో అంతస్తులో ఖాళీగా ఉన్న స్థలంలో కొంతమంది సిబ్బంది చెత్తను వేయడంతోపాటు సిగరెట్ తాగి అక్కడే పడేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్న బీడీ ముక్కలు లేదా సిగరెట్ నుంచి నిప్పు పడడంతో చెత్తలో మంటలు చెలరేగాయి. అది ఆపై విద్యుత్ వైర్లకు అంటుకుని మంటలు వ్యాపించినట్లు పోలీసులు ధృవీకరించారు.
ఈ ఘటనకు “కేర్‌లెస్ స్మోకింగ్” (careless smoking) ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేశారు. సిగరెట్ వాడకాన్ని నిర్లక్ష్యంగా చూడటమే ఈ ప్రమాదానికి దారితీసిందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిమ్స్ ఆరోగ్యశ్రీ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది అక్రమంగా బాణాసంచా నిల్వ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆధారంగా పోలీసులు మరో కేసును నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కేసుపై పంజాగుట్ట పోలీసులు మల్టీ యాంగిల్ దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.