Stock Markets: ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 3.58 శాతం లాభపడగా.. సెన్సెక్స్ 3.55 శాతం లాభపడి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 2,621.98 పాయింట్ల లాభంతో 76,583.29 వద్ద, నిఫ్టీ 807.20 పాయింట్ల లాభంతో 23,337.90 వద్ద ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలకు చెందిన అన్ని స్టాక్‌లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3 నుండి 7 శాతం లాభాలబాటలో ఉన్నాయి.
Read Also: Air Show: పోర్చుగల్ ఎయిర్ షోలో రెండు విమానాలు ఢీ, పైలట్ మృతి.. వీడియో
బ్యాంక్ నిఫ్టీ సూచీ తొలిసారి 50,000 మార్క్‌ను అధిగమించింది. అంతేకాకుండా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ కూడా దాదాపు 3 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ PSU బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఒక్కొక్కటి 4-5% మధ్య పెరిగాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మేలో కనిపించిన మార్కెట్ ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం 2023-24 (FY24)లో 8.2% ఆర్థిక వృద్ధి రేటు నేపథ్యంలో ఇది వస్తుంది.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు BJPకి హ్యాట్రిక్‌ని అంచనా వేసింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మకంగా మూడవసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.ఎన్‌డీఏ 2019లో 353 సీట్లను అధిగమించి 350-380 సీట్లతో గెలుపొందే అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్పాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ ఎన్‌డీఎకి 361–401 సీట్లు, ఇండియా కూటమికి 131–166 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.