Terror Funding Case: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇండ్లలో సోదాలు చేస్తోంది. మే 11న, కాన్సిపోరాలోని అబ్దుల్ ఖలిక్ రెగూ నివాసంలో, సయ్యద్ కరీమ్‌లోని జావిద్ అహ్మద్ ధోబీ బారాముల్లా జిల్లాలోని సంగ్రి కాలనీలోని షోయబ్ అహ్మద్ చూర్ ఇళ్లలో ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది.
ఏప్రిల్ 20న పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. భింబర్ గలీ నుంచి సాంగ్యోట్ కు ఆర్మీ వాహనం వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నవారిని గుర్తించేపనిలో ఎన్‌ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మే 9న శ్రీనగర్, కుప్వారా, పూంచ్, రాజౌరితో సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిపారు. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేర నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను ఛేదించేందుకు అధికారులు సోదాలు నిర్వహించారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి.
Read Also: Manipur: మిజోరాంలో తలదాచుకున్న 5,800 మంది మణిపూర్ వాసులు
పూంచ్‌లో ఐదుగురు జవాన్లను చంపిన ఘోరమైన ఉగ్రదాడి జరిగిన వారాల తర్వాత ఎన్‌ఐఏ చర్యలు ప్రారంభించింది. పూంచ్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ఓ అధికారి కూడా గాయపడ్డాడు. అంతకుముందు, కోర్టు ఆదేశాలను అనుసరించి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కశ్మీర్‌లోని వివిధ ప్రదేశాలలో ముగ్గురు నిందితులకు చెందిన ఆస్తులను ఎన్‌ఐఏ అటాచ్ చేసింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ (UL J&K), ముజాహిదీన్ గజ్వత్-ఉల్-హింద్ (MGH), కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ (JKFF), కాశ్మీర్ టైగర్స్, పీఏఏఎఫ్ వంటి కొత్త ఉగ్రవాద సంస్థలను అణిచివేసేందుకు ఎన్‌ఐఏ జమ్మూ కాశ్మీర్‌లో దాడులు నిర్వహిస్తోంది. ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత ఈ ఉగ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్నాయి. గత మూడేళ్లలో ముఖ్యంగా జమ్మూలోని పీర్ పంజాల్ ప్రాంతంలో జరిగిన మిలిటెంట్ దాడులకు ఈ సంస్థలు బాధ్యత వహిస్తున్నాయి. “కాశ్మీర్ లోయలోని తమ కార్యకర్తలకు ఆయుధాలు, బాంబులు, డ్రగ్స్ మొదలైనవాటిని పంపిణీ చేయడానికి పాక్ ఆధారిత కార్యకర్తలు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది” అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలలో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, బారాముల్లా, షోపియాన్, కుల్గాం, అనంత్‌నాగ్, బుద్గాం జిల్లాలతో పాటు పూంచ్, రాజౌరి, కిష్త్వార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాల సహాయంతో కేంద్ర ఏజెన్సీకి చెందిన బృందాలు దాడులు నిర్వహించాయి.