Site icon NTV Telugu

Fake Paneer Racket: అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం.. పనీర్ లవర్స్‌కు అలర్ట్.. “మీరు తినేది పనీరా లేక పాయిజనా?”

Fake Paneer Racket

Fake Paneer Racket

Fake Paneer Racket: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కల్తీ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఓ ఇద్దరు అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం ప్రజల ఆరోగ్యంపై విశేష ప్రభావం చూపే ప్రమాదం నుంచి అధికారులు జనాలను కాపాడారు. మీరట్ పరిధిలోని జానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా కుంభా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు నకిలీ పనీర్ ఫ్యాక్టరీలపై లక్నో ఆహార విభాగం అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. అసలు ఏం జరిగిందంటే..

READ ALSO: Wipro Buyback: విప్రో ఇన్వెస్టర్లకు కాసుల పండగే.. రూ.15 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన ఐటీ దిగ్గజం

నగ్లా కుంభా గ్రామానికి చెందిన హమీద్, జాబిర్ అనే అన్నదమ్ములు ఎటువంటి అనుమతులు లేకుండా సొంతంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నకిలీ పనీర్ తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాలకు ఈ కల్తీ పనీర్‌ను సరఫరా చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కమిషనర్ డాక్టర్ రోషన్ జాకబ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో హమీద్ ఫ్యాక్టరీ నుంచి 16 క్వింటాళ్లు, జాబిర్ ఫ్యాక్టరీ నుంచి 12 క్వింటాళ్ల నకిలీ పనీర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలలో నిర్వహించిన సోదాల్లో అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పనీర్ తయారీ కోసం ఈ అన్నదమ్ములు కేవలం పాలు మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో పామొలిన్ ఆయిల్, మైదా పిండి, నీలి రంగులో ఉన్న అనుమానాస్పద కెమికల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. సోదాల్లో లభ్యమైన 5300 లీటర్ల పాలు, 510 లీటర్ల రిఫైన్డ్ పామొలిన్ ఆయిల్, 35 కిలోల మైదా, కెమికల్స్‌ను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల రాకను గమనించిన నిందితులు హమీద్, జాబిర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలను సీల్ వేసినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

READ ALSO: Gold vs Stocks: “గోల్డ్ కంటే ‘స్మార్ట్’గా పెరిగిన స్టాక్స్ ఇవే! ఈ రెండు షేర్లు కొన్నవారికి కాసుల వర్షం”

Exit mobile version