Ahmadabad : గుజరాత్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలయింది. కేవలం అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ రికార్డుస్థాయి మెజారిటీని సాధించింది. 156 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు 17 చోట్ల మాత్రమే గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఛైతర్ వసావ-దేడియాపాడా, భూపత్ భయానీ-విసావదార్, హేమంత్ ఖావా-జంజోధ్పూర్, ఉమేష్ మక్వాణా-బొటాడ్, సుధీర్ వాఘాని-గరియాధర్ ఉన్నారు.
Read Also: Crime News: కీచక ప్రిన్సిపల్.. టూర్లో స్టూడెంట్ తినే అన్నంలో మత్తు ఇచ్చి..
కొత్తగా గెలిచిన ఐదుగురులో ఒకరు పార్టీ ఫిరాయించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. జునాగఢ్ జిల్లాలోని విసావదార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన భూపత్ భయానీ- బీజేపీలో చేరబోతోన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సమాచారం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన భూపత్ భయానీ ఆ తరువాత బీజేపీలో చేరారు. ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. విసావదార్ స్థానం నుంచి గెలుపొందారు. ఫలితాలు వెలువడిన మూడో రోజే పార్టీని ఫిరాయించనున్నారు.