Nepal Floods 2025: నేపాల్‌లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు కారణంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు తూర్పు నేపాల్‌లో సుమారుగా 42 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇలాం జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయని, ఈ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 37 మంది సమాధి అయ్యారని వెల్లడించాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాలను నిలిపివేశారు. ఖాట్మండు, భరత్పూర్, జనక్‌పూర్, భద్రాపూర్, పోఖారా తుమ్లిగ్తార్లకు బయలుదేరే విమానాలను ప్రస్తుతం నిలిపివేశారు.
ముమ్మరంగా సహాయక చర్యలు..
నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళాలు, పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాం జిల్లాలో గర్భిణీ స్త్రీతో సహా నలుగురిని హెలికాప్టర్ ద్వారా రక్షించి ధరణ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ఇలాం జిల్లాలోని డ్యూమై, మైజోగ్మై ప్రాంతాలలో ఎనిమిది మంది, ఇలాం ఆరుగురు, సందక్పూర్ ఆరుగురు, సూర్యోదయ్లో ఐదుగురు, మాంగ్సేబుద్లో ముగ్గురు, ఫక్ఫోక్తుమ్ గ్రామంలో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు.
లోయలో వాహనాల రాకపోకలు బంద్..
నేపాల్‌లోని ఐదు ప్రావిన్సులు కోషి, మాధేస్, బాగ్మతి, గండకి, లుంబినిలలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఖాట్మండులో వాహనాల రాకపోకలను మూడు రోజులుగా నిలిపివేశారు. నేపాల్ విపత్తు నిర్వహణ అథారిటీ ఖాట్మండు లోయలో వాహనాల రాకపోకలను పరిమితం చేసింది. సరైన కారణం లేకుండా సుదూర ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. బాగ్మతి, తూర్పు రప్తి నదుల పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నివాసాలను ఖాళీ చేసి సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లాలని సూచించారు. పచ్తార్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఒక వ్యక్తి మృతి చెందారు. పచ్తార్, ఖోటాడ్, ఉదయపూర్ జిల్లాల్లో కూడా వరదల కారణంగా ప్రజలు మరణించారు. రసువా జిల్లాలో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. రౌతహత్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించంగా, నేపాల్‌లోని వివిధ ప్రాంతాలలో పిడుగుపాటుకు ఏడుగురు గాయపడ్డారు.
READ ALSO: Georgia Protests 2025: జార్జియాలో నిరసనలకు రష్యాకు సంబంధం ఏంటి?.. ఆ దేశంలో ఏం జరుగుతుంది!