Nagaland, Meghalaya: నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నెయిఫియు రియో ఐదోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. తాజా ఎన్నికల్లో అధికారానికి అవసరమైన పూర్తి మెజార్టీ సాధించిన ఎన్‌డీపీపీ కూటమి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఐదోసారి సీఎంగా నెయిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ముఖ్యమంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపాతో కలిసి అధికార ఎన్‌డీపీపీ (నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ) పోటీ చేసింది. తాజా ఫలితాల్లో ఎన్‌డీపీపీ 25 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 12 చోట్ల గెలిచింది. మొత్తంగా ఈ కూటమి 37 స్థానాలను కైవసం చేసుకొని మెజార్టీ మార్కు 31ని దాటింది. దీంతో నెయిఫియు రియో మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. నెయిఫియు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన రియో.. 1987లో ఒక్కసారి మాత్రమే ఓటమిని చవిచూశారు. ఆ సమయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో వెనక్కి తిరిగి చూడలేదు. 2002 వరకు జమీర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో హోం మంత్రిగా, అంతకు ముందు వివిధ హోదాల్లో రియో పనిచేశారు. అనంతరం కాంగ్రెసును వీడి నాగా పీపుల్స్ ఫ్రంట్‌ను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి జమీర్‌ను గద్దెదించి తొలిసారి నాగాలాండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2008లో రాష్ట్రపతి పాలన విధించడంతో సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
Read Also: Pakistan: పీఓకేలో మహిళా టీచర్లు, బాలికలకు హిజాబ్ తప్పనిసరి..
ఇదిలా ఉండగా.. మేఘాలయా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారంనాడు జరిగిన కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎన్‌సీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి. ఎన్‌పీసీ సారథ్యంలోని మేఘాలయ ప్రభుత్వంలో సంగ్మాతో పాటు అలెగ్జాండర్ లలూ హెక్, డాక్టర్ అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కమింగోన్ యంబోన్, షక్లర్ వార్‌గర్, అబు తహెర్ మోండల్, కిరమేన్ షాయలా, ఎంఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా మంత్రులుగా, ప్రెస్టోన్ త్సాంసాంగ్, ఎస్.ధర్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగు వచ్చింది. కాన్రాడ్ కె సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 26 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది.