NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..

Neet

Neet

NEET UG 2026: మెడికల్ సీటు సాధించాలనే లక్షలాది మంది విద్యార్థుల కలలపై ‘నీట్ యూజీ 2026’ పేపర్ లీక్ ఉదంతం నీళ్లు చల్లింది. కేవలం అనుమానాలుగా మొదలైన ‘గెస్ పేపర్’ వ్యవహారం చివరకు దేశవ్యాప్త సంచలనానికి, పరీక్ష రద్దుకు దారితీసింది. అసలు మే 3న పరీక్ష జరిగినప్పటి నుంచి మే 12న రద్దు అయ్యే వరకు ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం.. మే 3న సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఈ పరీక్ష రాశారు. ఆ సమయంలో జీపీఎస్ ట్రాకింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ నిఘా, 5జీ జామ్మర్లు వంటి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎన్టీఏ (NTA) భావించింది. కానీ, మే 6, 7 తేదీల్లో ఆన్‌లైన్ వేదికగా ఆన్సర్ కీలు, ఇతర చర్చలు మొదలయ్యాయి. దీంతో అసలు కథ బయటపడింది. రాజస్థాన్‌లో పరీక్షకు ముందే చలామణి అయిన ఓ గెస్ పేపర్ లేదా ప్రాక్టీస్ బ్యాంక్, అసలు పరీక్షా పత్రంతో అచ్చుగుద్దినట్లు సరిపోలింది. ఈ విషయాన్ని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు గుర్తించాయి.

ఒక్కసారిగా విద్యార్థులు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఈ ఫిర్యాదులు తీవ్రమవ్వడంతో మే 7న ఎన్టీఏ రంగంలోకి దిగింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి అందిన సమాచారం ఆధారంగా మే 8న ఈ కేసును స్వతంత్ర విచారణ కోసం కేంద్ర ఏజెన్సీలకు అప్పగించింది. మే 10న రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ఈ అక్రమాలపై బహిరంగంగా విచారణ ప్రారంభించడంతో పరిస్థితి మరింత ముదిరింది. పరీక్షకు ముందు సుమారు 400 ప్రశ్నలు సర్క్యులేట్ అయ్యాయని, అందులో బయాలజీ, కెమిస్ట్రీకి చెందిన 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలుతున్నాయని ఏడీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. మే 11 నాటికి ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. అసలు పేపర్‌లోని 180 ప్రశ్నలకు గానూ.. ఏకంగా 135 ప్రశ్నలు (90 బయాలజీ, 45 కెమిస్ట్రీ) ఆ గెస్ పేపర్‌లో ఉన్నాయని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంటే దాదాపు 600 మార్కుల పేపర్ ముందే బయటకు వచ్చిందన్న మాట.

ఈ పరిణామాలు రాజకీయంగానూ పెను తుఫాను సృష్టించాయి. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వంటి నేతలు విమర్శలు గుప్పించడంతో పాటు 2024 నీట్ కుంభకోణాన్ని గుర్తు చేశారు. రాజస్థాన్ ఎస్ఓజీ ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇవన్నీ కేవలం ఊహాజనిత ప్రశ్నలా లేక నిజంగానే పేపర్ లీక్ అయిందా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో మే 12న ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి శ్రమించిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల్లో ఒకవైపు ఊరటనిచ్చినా, మరోవైపు కొంత మందిని తీవ్ర అసహనాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ఇక ఎన్టీవీ త్వరలోనే రీ-ఎగ్జామ్ తేదీలను ప్రకటించనుంది.