NEET Student dies by suicide in Kota: రాజస్థాన్‌లోని కోటాలో 20 ఏళ్ల విద్యార్థి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరింది. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫౌరీద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. కోటా నగరంలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తన గదిలో హుస్సేన్ ఉరివేసుకుని మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటాలో గతేడాది 15 మంది ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.
పోలీసుల వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫౌరీద్ హుస్సేన్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కోటాలో నీట్ శిక్షణ తీసుకుంటూ.. గతేడాది నుంచి స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. సోమవారం స్నేహితులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. హుస్సేన్ గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. స్నేహితులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకొని గది తలుపులు తెరిచారు. హుస్సేన్ ఉరి వేసుకుని కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Also Read: Virat Kohli Injury: ముఖం మొత్తం కమిలింది.. విరాట్ కోహ్లీకి ఏమైంది?
ఈ విషయాన్ని ఫౌరీద్ హుస్సేన్ తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేశారు. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. హుస్సేన్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. కోటాలో గత కొన్ని నెలలుగా విద్యార్థుల ఆత్మహత్యల కేసులు స్థానిక అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థులకు రెండు నెలల పాటు ఎటువంటి పోటీ పరీక్షలు నిర్వహించకూడదని ఇన్‌స్టిట్యూట్‌లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.