నీనా గుప్తా అంటేనే ఒక బోల్డ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్.. ‘ముల్క్’, ‘83’, ‘గుడ్ బై’ వంటి సినిమాలతో పాటు ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి వెబ్ సిరీస్ల వరకు ఆమె తన నటనతో మెప్పించారు. అయితే, నేడు సక్సెస్ఫుల్గా కనిపిస్తున్న ఆమె కెరీర్ వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చిందని, ఆ నిర్ణయాలు తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాయని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read : The Paradise: : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..
తన కెరీర్లోని చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘నేను నటించిన కొన్ని సినిమాలు అస్సలు విడుదల కాకూడదని నేను దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. ఆ సినిమాల్లోని పాత్రలు నాకు ఏమాత్రం నచ్చేవి కావు. కానీ, అప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం వేరే దారి లేక వాటిని అంగీకరించాను. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత, వీటిని ఎందుకు చేశానా అని బాధపడుతూ ఏడ్చేదాన్ని. సెట్లో కొంతమంది దర్శకులు ఎటువంటి కారణం లేకుండానే నన్ను అసభ్య పదజాలంతో తిట్టేవారు. ఎన్నో అవమానాలను భరిస్తూ కేవలం డబ్బు కోసమే అక్కడ నిలబడ్డాను’ అని వాపోయారు. ఒకవేళ ఆ సమయంలో తనకు మంచి ఆఫర్లు వచ్చి ఉంటే ఆ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. ఒక సీనియర్ నటి తన గతాన్ని ఇంత నిజాయితీగా పంచుకోవడం ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది.