AI : రక్త పరీక్ష అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది – సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, నడుమున్న వయసువారు దీనికి కొంచెం భయపడుతుంటారు కూడా. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాదులోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ హాస్పిటల్ దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వైద్యరంగంలోనే కాదు, టెక్నాలజీ వినియోగంలోనూ ఒక విప్లవాత్మక ముందడుగుగా చెప్పవచ్చు.
‘అమృత్ స్వాస్థ్ భారత్’ అనే పేరుతో పరిచయమైన ఈ టూల్‌ను క్విక్ విటల్స్ (Quick Vitals) అనే హెల్త్-టెక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తి స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారితంగా పనిచేస్తుంది. రోగి శరీరంలో సూది వేయకుండానే, కేవలం చర్మంపై సెన్సార్‌ల సహాయంతో రక్త ప్రవాహంలో మార్పులను గుర్తించగల సామర్థ్యం ఈ టూల్‌కు ఉంది. ఈ ప్రక్రియకు ‘ఫోటోప్లెథిస్మోగ్రఫీ (Photoplethysmography – PPG)’ అనే సాంకేతికతను ఆధారంగా తీసుకున్నారు.
Viral : నమ్మలేని నిజాన్ని చెప్పిన AI.. ChatGPTతో భర్త మోసం బట్టబయలు
ఈ విధానం ద్వారా రక్తపోటు, SpO2, హృదయ స్పందన రేటు, హిమోగ్లోబిన్ A1c, స్ట్రెస్ స్థాయిలు వంటి ఆరోగ్య సంబంధిత కీలక సమాచారాన్ని 20-60 సెకన్ల వ్యవధిలోనే అందించగలదు. ఈ టెస్టు వల్ల రోగికి ఎలాంటి నొప్పి లేకుండానే, వేగంగా , ఖచ్చితంగా ఫలితాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే కాకుండా, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వంటి సూదులకు భయపడే వారికీ ఇది ఒక వరంలాంటిదే.
ఇలాంటి ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయడం అరుదైన విషయమే. అందులోనూ నీలోఫర్ ఆసుపత్రి మొదటగా ఈ సేవను ప్రారంభించడం గర్వకారణంగా మారింది. ప్రస్తుతం ఈ టూల్ వినియోగం మొదటి దశలో ఉన్నా, భవిష్యత్తులో ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించే అవకాశం ఉంది. ఈ మార్పు, టెక్నాలజీ ఆరోగ్యరంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందోననే ప్రశ్నకు సమాధానమే కాదు… రోగులకు దగ్గరగా, మరింత మానవీయంగా వైద్యం ఎలా ఉండాలో చూపించే మార్గదర్శకంగానూ నిలుస్తోంది. AI టెక్నాలజీ మానవ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందనటంలో ఎలాంటి సందేహం లేదు.