త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’పై దేశంలోని పలుచోట్ల చెలరేగుతున్న నిరసనలను తాను ఊహించలేదని అన్నారు. ఈ పథకం దేశానికి, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిరసనలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ స్కీమ్’ అంటూ చెప్పుకొచ్చారు.
అగ్నిపథ్’ పథకాన్ని రూపొందించిన ప్రణాళిక బృందంలో తానూ సభ్యుడిగా ఉన్నానన్నారు. దీనికోసం ఏడాదిన్నర పాటు పనిచేశానన్న ఆయన… ఈ పథకం ద్వారా సైన్యంలో చేరిన వారు తర్వాత సాయుధ బలగాల్లో చేరే అవకాశం ఉందన్నారు. ఇది సాయుధ బలగాలను అనేక విధాలుగా మారుస్తుందని తెలిపారు. ఇంతకుముందు సాయుధ బలగాల్లో ఒకరు సేవ చేసే చోట.. ఈ పథకంతో నలుగురికి అవకాశం లభించవచ్చని వెల్లడించారు.
నాలుగేళ్ల సర్వీస్ చాలా తక్కువనే దానిపైనా ఆయన స్పందిస్తూ.. అగ్నివీరులుగా సైన్యంలో నాలుగేళ్లు సేవలందించిన తర్వాత అనేక అవకాశాలు ఉంటాయని పునరుద్ఘాటించారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకుంటే వారికి ఆర్థికసాయం, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తాయన్నారు. ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. కాగా.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత తమను నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం తమకు వద్దని, పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువత ఆందోళనకు దిగింది. కొన్ని చోట్ల ఈ నిరసనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఆందోళనల్లో ఒకరు మరణించినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు.