కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా కూడా దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోడీ గొప్పవారు.. అబద్ధాలను మార్కెట్ చేయడంలో కూడా ఆయన దిట్ట అంటూ సీఎం సీరియస్ అయ్యారు. అసంబద్ధమైన మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలను మోడీ రెచ్చగొడుతున్నారు. ఎదుటి వారి గౌరవాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Germany-India: ఆ నిషేధం ఎత్తివేత.. చిన్న ఆయుధాల కొనుగోలుకు జర్మనీ అనుమతి
ఈ చర్యలు ప్రధాన మంత్రి పదవిపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయని సిద్ధరామయ్య మండిపడ్డారు. మోడీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.. ఆయన ( మోడీ)పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రధాని అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు.. బాగానే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ తాము ఇచ్చిన ఎన్నికల హామీలే తమను గెలిపిస్తాయని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. అయితే, తాము ఇచ్చిన ఐదు హామీలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో వచ్చింది.. అదే తమ గెలుపుకు సంకేతమన్నారు. ప్రజలు తమ విచక్షణను బట్టి తీర్పు ఇస్తారు.. ఓటర్లు చాలా తెలివైన వారు.. ప్రధాని మోడీ మాయ మాటలు నమ్మరు.. రాజకీయంగా పరిణతి చెందారని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
