Parliament Special session: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసి మూడు వారాలే అయింది. తిరిగి పార్లమెంట్ సెషన్ డిసెంబరులో ఉండాలి. అయితే సంవత్సరాంతంలో జరగాల్సిన శీతాకాలు కాకుండా మోడీ సర్కార్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇవి ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు నిరవధికంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెషన్ దేని కోసం అన్నది ఆయన చెప్పలేదు. ఎజెండాను ప్రకటించలేదు. అయితే ఈ సెషన్ లో మోదీ సర్కార్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కోసం ఈ ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: MK Stalin: ‘మన్ కీ బాత్’ కు పోటీగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్
షెడ్యూలు ప్రకారం డిసెంబరులో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే అక్కడ బీజేపీకి అంత అనుకూల వాతావరణం లేదు. ప్రస్తుతానికి అక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి అనుకూల ఫలితాలు రాకపోతే వాటి ప్రభావం తరువాత వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడే అవకాశం ఉందని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియా కూటమి నేతలు ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దేశంలో కూడా ఇండియా కూటమికి మద్దతు పెరుగుతూ ఉండటంతో ఈ ప్రత్యేక సెషన్ ద్వారా పలు కీలక నిర్ణయాలను ప్రధాని మోడీ తీసుకోనున్నట్లు అర్థం అవుతుంది.
బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలు, ఉన్నతి, చంద్రయాన్ సక్సెస్, పెట్టుబడుల ఇలా పలు విషయాలను పార్లమెంట్ లో వివరించే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. దాంతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలను నిర్వహించునున్న ప్రకటనను కూడా మోడీ సర్కారు చేసే అవకాశం ఉందని, దాని కోసమే ఈ సెషన్ అని పలువురు భావిస్తున్నారు. ఈ సెషన్ లోనే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రకటించి దాని ద్వారా కూడా లాభం పొందాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరికొన్ని రోజుల్లో జరగనున్న సమావేశాలలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో.