తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఆర్ ఆర్ ట్యాక్స్.. లిక్కర్ స్కాం అంటున్నారు.. ఈ నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. దేశ ఉజ్వల భవిష్యత్ కోసం అవినీతి అనే రోగాన్ని వదిలించాలి. అవినీతి నిర్మూలన అసంభవమేమీ కాదు. 15 ఏళ్ల క్రితం ప్రతీదీ బ్లాక్ మార్కెట్ అన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అన్న మాటే లేదు. ఇప్పుడు బ్లాక్ టికెట్ మాటవినిపించడం లేదు. టెక్నాలజీ సాయంతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నాం. బ్లాక్ మార్కెట్ కూడా క్రమక్రమంగా కనుమరుగైంది. అవినీతి అనే మాటే వినపడకుండా చేస్తాననే నమ్మకం నాకుంది. నేను అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంటాను. ఇది నా కమిట్మెంట్. అవినీతి తమ జన్మహక్కు అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. అవినీతి మూలంగా బీఆర్‌ఎస్ నేత జైల్లో ఉన్నారు. ఆ పార్టీ పేరు కూడా మార్చారు. పార్టీ మనుగడ ఎంత వరకు ఉంటుందో చెప్పలేం.
అవినీతి డబ్బుతో ప్రపంచాన్ని కొనగలమని కొందరు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి పార్టీపై ఆగ్రహంతో క్లీన్ చేశారు. కుటుంబ పార్టీలు దేశానికి మంచివి కావు. కుటుంబ పాలన దేశనైపుణ్యాన్ని, టాలెంట్‌ను దెబ్బతీస్తుంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ కొన్ని సీట్లు యాదవ్ వర్గానికి ఇచ్చింది. వారు టికెట్లు ఇచ్చిన యాదవ్ సమాజంలో అందరూ వారి కుటుంబ సభ్యులే. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని మిగితావారికి కోపం వచ్చింది. మేం మధ్య ప్రదేశ్‌లో ఏం చేశామంటే.. మధ్యప్రదేశ్‌లో సీఎం యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి. యాదవుల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా చేశాం.
కుటుంబ పాలన వల్ల నైపుణ్యం బయటకు రాదు. దక్షిణాది రాష్ట్రాలలో జరిగింది ఇదే.! మంచి-చెడులను దాచిపెట్టడం జరుగుతోంది. నేను ఓ అవినీతి డాక్టర్‌ను అరెస్ట్ చేయిస్తే, ఎవరూ అభ్యంతరం తెలపరు. రాజకీయ నేతను అరెస్ట్ చేస్తే మాత్రం ‘ మోడీ వేధింపు’ అంటారు. ఇదేమిటో.!