NTV Telugu Site icon

Chandrababu Security: జైలులో మావోయిస్టులు ఉన్నారు.. ఏస్పీకి లేఖ వచ్చింది.. చంద్రబాబుకు భద్రతలేదు..

Lokesh

Lokesh

Chandrababu Security: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. ఈ రోజు తన తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రహ్మణితో కలిసి జైలులో ఉన్న చంద్రబాబును ములాకత్‌లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఇప్పటికీ చంద్రబాబు భద్రత పై అనుమానాలు ఉన్నాయి.. ఎస్పీకి మావోయిస్టులు లేఖరాసారు.. ఇదే జైలులో మావోలు వుండటంతో చంద్రబాబు భత్రతపై అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.. చంద్రబాబు జైలులోకి వెళ్లిన రోజున లోపల విజువల్స్ టీవీల్లో వచ్చాయి.. అవి చట్టవిరుద్ధం.. అవి ప్రసారం చేసిన ఛానళ్లపై న్యాయపోరాటం చేస్తాం అన్నారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.. ప్రజల తరఫున పోరాడినందుకు చంద్రబాబునాయుడుని కక్ష కట్టి వ్యవస్థల్ని మెనేజ్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు.

గత 28 రోజులుగా జ్యూడిషియల్ రిమాండ్ చంద్రబాబు ఉన్నారు. ఇసుక, మద్యం, మట్టి, మాఫియాలపై నిలదీసినందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు లోకేష్‌.. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును 28 రోజులు రిమాండులో ఉంచారు.. బ్రాహ్మణి, భువనేశ్వరి హెరిటేజ్ లో కష్టపడి సంపాదిస్తుంటే మేం పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాం అన్నారు. ప్రతి ఎకరం కష్టపడి కొనుక్కున్నదే. చంద్రబాబు నాయుడు ఏనాడూ అవినీతి, తప్పులు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులు అడుగడుగునా మా తెలుగుదేశం నాయకులను అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా .. లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ప్రజల తరఫున పోరాడమని మా చంద్రబాబు చెప్పారు. శాంతియుతంగా పోరాటాలు చేయాలని సూచించారని పేర్కొన్నారు.

ఇక, మొదట్లో మూడు వేల కోట్లు అవినీతి అన్నారు. తర్వాత 300 కోట్లు.. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు.. రేపు 0 అంటారు అని దుయ్యబట్టారు లోకేష్‌.. మా కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీదకు తీసుకువచ్చింది ఈ పిచ్చి జగన్ అని మండిపడ్డ ఆయన.. ప్రతి మహానాడులోనూ మా పార్టీ విధులు ఖర్చులు తెలియజేస్తుంటాం. వైసీపీ ఎప్పుడైనా ఆ పార్టీ లెక్కలు చెప్పిందా..? అని నిలదీశారు. తెలుగుదేశం – జనసేన కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తాం. వైసీపీ నాయకులు కార్యకర్తలు.. పోలీసులు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్‌ పై దాడి చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నాం.. జైల్లో ఇప్పటికి కూడా చంద్రబాబుకు సరైన భద్రత లేదని మా అభిప్రాయంగా చెప్పారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందని నేను భావించడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్‌.