YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. షర్మిలను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీనితో షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైల్లో ఉన్న షర్మిల సాయంత్రం వరకు విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
Read Also: YS Sharmila: బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. షర్మిలను పరామర్శించిన విజయమ్మ
ఇరుపక్షాల న్యాయవాదులు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేవే అని కోర్టుకు తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు నిబంధనలను సైతం పోలీసులు పాటించడం లేదన్నారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని.. అంతకంటే ముందు చోటు చేసుకున్న వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. పోలీస్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని, షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు ఊరటనిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.