YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యారు. తీర్పును లంచ్ తర్వాత కోర్టు ఇవ్వనుంది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. షర్మిలను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ మధ్యలో ఆమె తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల న్యాయవాదులు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేవే అని కోర్టుకు తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు నిబంధనలను సైతం పోలీసులు పాటించడం లేదన్నారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని.. అంతకంటే ముందు చోటు చేసుకున్న వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
పోలీస్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని, షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉంది.
Read Also: Jagadish Reddy: ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదు
షర్మిలను పరామర్శించిన విజయమ్మ
చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్ షర్మిలను వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని.. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారని విజయమ్మ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారన్నారు. “వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు?” అని విజయమ్మ పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని విజయమ్మ మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని.. ప్రజలు ఆలోంచిచాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిలకు బెయిల్ వస్తుందని ఆమె చెప్పారు. షర్మిల ఇలాంటి వాటికి భయపడదని చెప్పారు.