NCRTC Pre-Wedding Rules: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఒక కీలక ముందు అడుగు వేసింది. ఇప్పుడు ఢిల్లీ-మీరట్ కారిడార్‌లోని నమో భారత్ రైళ్లు, వాటి స్టేషన్‌లలో పుట్టినరోజు పార్టీలు, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌లు, చిన్న సమావేశాలు వంటి వ్యక్తిగత కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో ప్రజలు రైలులో ప్రీ-వెడ్డింగ్ షూట్‌లను నిర్వహించగలరు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: ESI Hospital : సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
NCRTC మాట్లాడుతూ.. ఈ కొత్త విధానం ప్రకారం వ్యక్తులు, ఈవెంట్ నిర్వాహకులు, ఫోటోగ్రఫీ లేదా మీడియా కంపెనీలు నమో భారత్ రైలు కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. అవి నడుస్తున్నా లేదా స్టేషనరీ అయినా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దుహై డిపోలో ఒక మాక్-అప్ కోచ్ కూడా ఉంటుందని, దీనిని షూటింగ్ కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
ధర – ఫీచర్లు ఇవే..
పలు నివేదికల ప్రకారం.. నమో భారత్ రైలును గంటకు రూ.5 వేలు చెల్లించి ఇటువంటి కార్యక్రమాల కోసం బుక్ చేసుకోవచ్చు. అదనంగా అలంకరణలను ఏర్పాటు చేయడానికి 30 నిమిషాలు, వాటిని తొలగించడానికి 30 నిమిషాలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. NCRTC ప్రకారం.. ఇది సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఎందుకంటే నమో భారత్ రైళ్లు ఆధునిక డిజైన్లను కలిగి ఉంటాయి, ఇవి ఫోటోషూట్‌లు, చిన్న ఈవెంట్‌లకు అనువైనవి. అలాగే బుక్ చేసుకున్న వారు వీటిని ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా తమకు నచ్చిన అలంకరణలను కూడా చేసుకోవచ్చని తెలిపింది.
ఏ టైంలో బుకింగ్ చేసుకోవాలంటే..
ఈ కార్యక్రమాల కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుందని NCRTC పేర్కొంది. సాధారణ రైలు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సంస్థ పేర్కొంది. బుక్ చేసుకున్న వారు భద్రత, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి, మొత్తం ఈవెంట్‌ను NCRTC సిబ్బంది, భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపింది.
ఈ సౌకర్యం ప్రధానంగా ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ సౌత్ వంటి ప్రధాన స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. నమో భారత్ రైళ్లు, స్టేషన్లలో ఫిల్మ్ షూట్‌లు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు, ఇతర వీడియో ప్రాజెక్టుల కోసం కొత్త ఛార్జీల విధానాన్ని ఏర్పాటు చేసినట్లు NCRTC వెల్లడించింది.
READ ALSO: New Labour Codes: అమలులోకి కొత్త లేబర్ కోడ్‌లు.. కార్మికులు తప్పని సరిగా తెలుసుకోవాల్సినవి ఇవే