పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పై ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విరుచుకు పడ్డారు. మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మటంతో పెద్ద నష్టం జరిగిపోయిందన్నారు. రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగ బలహీన వర్గాల అభివృద్ధి కి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలిపారు.
READ MORE: Nandamuri Balakrishna: గుడ్లూరులో బాలయ్య ప్రచారం.. ప్రభుత్వంపై పంచ్‌లు..
ప్రజలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాడలేదని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చే సరికి హైద్రాబాద్ నుండి దిగుమతి చేశారని తెలిపారు. తెచ్చిన సూట్ కేస్ తో ఎన్నికలు అయిన తరువాత తిరిగి వెళ్ళిపోతారని విమర్శించారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నామా నాగేశ్వరరావు కంకణం కట్టుకున్నారు. ఈయన గతంలో ఖమ్మం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2009లో తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.