బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపు (ఫిబ్రవరి 9) ప్రారంభంకానున్న తొలి టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడకుండా ప్రత్యేకంగా పిచ్ తయారు చేసుకుని మరీ ఆసీస్ ప్రిపేర్ అవతుండటంతో వారికి ఈ సిరీస్ విజయం ఎంతముఖ్యమో అర్థమవుతోంది. అలాగే టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఇరుజట్లకు ఇదే చివరి సిరీస్. ఫైనల్ చేరాలంటే ఇండియా తప్పక రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే. దీంతో రోహిత్‌సేన కూడా ఈ సిరీస్ కోసం గట్టిగానే సిద్ధమవుతోంది. దీంతో ఈ సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు జరగనున్న నాగ్‌పూర్ పిచ్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: strange marriage: బ్యాండ్ బాజా మోగింది.. చిలుక పెళ్లి అయింది!
ఐదేళ్ల తర్వాత నాగ్‌పుర్ స్టేడియం మరో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. చివరిసారిగా ఇక్కడ 2017 నవంబర్‌లో శ్రీలంకతో భారత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో లంకను మట్టికరిపించింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరగగా.. నాలుగు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓటమిపాలవ్వగా.. మరొకటి డ్రాగా ముగిసింది. సౌతాఫ్రికా చేతిలో (2010) భారత్‌కు పరాభవం ఎదురైంది. తొలి రెండు రోజులు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండి.. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలించడం నాగ్‌పూర్ పిచ్ ప్రత్యేకత.
విదర్భ స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య 2008లో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (109)తోపాటు సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ అర్ధ శతకాలతో అదరగొట్టేశారు. భారత స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (4/64), అమిత్ మిశ్రా (3/27)తోపాటు ఇషాంత్ శర్మ (2/31) రాణించారు.
అత్యధిక స్కోరు: 610/6 డిక్లేర్డ్. శ్రీలంకపై భారత్ సాధించింది.
అత్యల్ప స్కోరు: దక్షిణాఫ్రికా 2015/16 సీజన్‌లో భారత్‌పై 79 పరుగులకు ఆలౌట్.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 253* పరుగులను భారత్‌పై (2010/11)సాధించాడు.
ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన : భారత్‌పై (2008/2009) ఆసీస్ బౌలర్ జాసన్ క్రెజా 8/215.
అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్: టీమ్‌ఇండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 357 . ఆ తర్వాత విరాట్ కోహ్లీ 354 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ టెస్టులో మరో నాలుగు పరుగులు చేస్తే సెహ్వాగ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
అత్యధిక వికెట్ల వీరుడు: రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటి వరకు 19 వికెట్లను పడగొట్టాడు.