పెళ్లంటే వధువు, వరుడి జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మధురఘట్టం. మన భారతీయ సంస్కృతిలో ఈ వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాటాకు పందిరి వేసి, బ్యాండ్ బాజాలు పెట్టి, కాంతులీలే మండపంలో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు ఒకరినొకరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే క్షణాలు ఎంతో ప్రీతికరమైనవి. ఇక పెళ్లి తర్వాత కొత్త వధువరులను ఊరంతా ఊరేగించి వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఐతే మధ్యప్రదేశ్‌లోని కరేలీలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రెండు పక్షులకు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశాడో వ్యక్తి. రామ చిలుక-మైనాకు ఈ వివాహ తంతు నిర్వహించాడు. సంప్రదాయబద్ధంగా జాతకాలు కూడా చూసి మరీ పెళ్లి చేశాడా పెద్దమనిషి. పక్షుల పెళ్లిళ్లు కూడా ఇంత సందడిగా చేస్తారా అంటూ అందరూ నోరెళ్లబెట్టారు.
Also Read: Sister Saves Brother: సిరియా భూకంపం.. తమ్ముడిని కాపాడిన అక్క
పిపారియా గ్రామ వాసి అయిన రామ స్వరూప్ పరిహార్ మైనా పక్షిని సొంత కూతురిలా పెంచుకున్నాడట. అదే గ్రామానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ కూడా ఓ చిలుకను పెంచాడు. దీంతో వీరిద్దరూ ఈ రెండు పక్షులకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. మైనా-చిలుకల యజమానులు మాట్లాడుకుని వివాహ ముహూర్తం ఖాయం చేశారు. ఆ ప్రకారంగా ఆదివారం నాడు గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో పెళ్లి చేసి బరాత్ ఏర్పాటు చేశారు. నాలుగు చక్రాల పంజరంలో గ్రామ వీధుల్లో పక్షుల జంటను ఊరేగించారు. ఈ వింత పెళ్లిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి.