Nagababu Nomination: శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. నాగబాబు పేరు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ఇక, నాగబాబు నామినేషన్ దాఖలుకి అవసరమైన పత్రాలు సిద్ధం చేశారు జనసేన నేతలు.. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్ , బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ.. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు.
Read Also: Vamsi, Varma, Posani Cases: వంశీ, వర్మ, పోసాని కేసుల్లో కీలక పరిణామాలు..
ఇక, రేపు మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.. కాగా, గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీ అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది.. అయితే, పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద సభలో నాగబాబు అడుగుపెడతారనే ప్రచారం జరిగింది. అది కూడా సాధ్యం కాలేదు.. ఇక ఇప్పుడు, ఎమ్మెల్సీగా నాగబాబుకు అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఏపీ శాసనమండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాగా.. అందులో ఒక స్థానం జనసేనకు కేటాయించారు.. ఆ సీటుకు నాగబాబు పేరుని ప్రకటించారు. ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉన్నా.. నాగబాబు ముందుగా ఎమ్మెల్సీ అయి.. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు..