Nadendla Manohar : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
ధాన్యం కొనుగోలు సంబంధిత ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ ఆలస్యం, ఆర్ఎస్కే/మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్‌టిఒ పెండింగ్, రవాణా, గోనె సంచుల కొరత, లేదా ఏదైనా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై, రైతులు నేరుగా 1967కు కాల్ చేయొచ్చని మంత్రి స్పష్టం చేశారు.
కాల్ చేసేముందు రైతులు ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, టోకెన్ నెంబర్, గ్రామం పేరు, ఆర్ఎస్కే… ఈ వివరాలు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు.. కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు నమోదు చేసి… సంబంధిత అధికారులకు పంపబడుతుందని, సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు, మండలాల వారీగా రైతులు, రైస్ మిల్లర్లు, ఆర్ఎస్కే నిర్వాహకులను సంప్రదించి… ధాన్యం కొనుగోలు సమస్యలను తెలుసుకుని వెంటనే సూచనలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
