అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ వంటి పథకాల పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని కూడా సీఎం స్పష్టం చేశారు.
పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లోపుగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు కొనసాగించాలని సీఎం నిర్ణయించారు.
Gyanvapi mosque: ముస్లింలు ‘‘జ్ఞానవాపి మసీదు’’ను వదులుకోవాలి: మాజీ ఏఎస్ఐ చీఫ్ కేకే ముహమ్మద్..
థర్మల్ పవర్ స్టేషన్లలో ఉత్పత్తయ్యే బూడిదను పరిశ్రమలు, నిర్మాణాలు సహా వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖకు సూచించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ పొదుపు ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం అన్నారు.
సమీక్షలో గత ప్రభుత్వ అసమర్ధతల కారణంగా విద్యుత్ రంగం అస్తవ్యస్తమైందని, ముఖ్యంగా పీపీఏల రద్దు నిర్ణయంతో ప్రజలపై ₹9,000 కోట్ల భారం పడిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ వినియోగించకుండానే ఆ మొత్తాన్ని కంపెనీలకు చెల్లించడం వైసీపీ ప్రభుత్వ గొప్ప తప్పిదమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని సరిదిద్దుతూ ఎలాంటి టారిఫ్ పెంపు లేకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా సమర్ధవంతంగా వ్యవస్థను నడిపిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె. విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు, డిస్కంల సీఎండీలు హాజరయ్యారు.