గవర్నమెంట్ రూల్స్ గీల్స్ జాన్తానై….. నా నియోజకవర్గంలో నేను చెప్పిందే వేదం. నేను రాసిన రాజ్యాంగమే నడవాలని ఆ ఎమ్మెల్యే అంటున్నారా? అది కాదు సార్….. కాస్త వినండని వ్యాపారులు చెప్పబోయినా, మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్…. నా మాటే శాసనం అని అంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ విషయంలో అంత కఠినంగా ఉన్నారు?.
మునుగోడు మందుగోల అంతకంతకూ పెరుగుతూ యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇందులో తగ్గేదెవరు? నెగ్గేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొత్త కొత్త మలుపులు కూడా ఉండబోతున్నాయన్న సంకేతాలు ఇంకా ఉత్కంఠ రేపుతున్నాయి. వైన్స్ షాపుల ఏర్పాటులో తన రాజ్యాంగాన్ని పూర్తిగా ఫాలో అవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూటిగా సుత్తి లేకుండా మరోసారి చెప్పేయడంతో వ్యాపారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందట. నియోజకవర్గంలో వైన్స్ షాపులు దక్కించుకున్న వాళ్ళు ఊరి చివర పెట్టాల్సిందేనని, తాను చెప్పిన టైమింగ్స్‌లో మాత్రమే అమ్మాలని, బెల్ట్ షాపుల ఊసేలేదని సొంత రూల్స్ పెట్టారు ఎమ్మెల్యే. అంతేకాదు మీకు నష్టం వస్తే….. అందులో సగం నేను భరిస్తానంటూ… తనదైన స్టైల్లో తేల్చిచెప్పేశారట ఆయన. దాంతో మిగతా సగం మాటేంటంటూ సణుక్కుంటున్నారట వ్యాపారులు. ఇలాంటి పరిస్థితుల్లో అంత్య నిష్టూరంకంటే.. ఆది నిష్టూరమే మేలనుకుంటూ… కొందరు వైన్స్ షాపుల యజమానులు చేసిన ఓ ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందట. చౌటుప్పల్ మినహా…. మిగతా మండలాల లిక్కర్ వ్యాపారులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తాజాగా మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆ సందర్భంలోనే రూల్స్ ప్రస్తావన వచ్చిందట.
కానీ… ఆయన మాత్రం నా నియోజకవర్గంలో నా మాటే శాసనం. రూల్స్ విషయంలో మార్పు లేనేలేదని కుండబద్దలు కొట్టేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు… షాపుల టెండర్స్‌లో స్థానికులే పాల్గొనాలని సూచించినా… కొందరు ఉద్దేశ్యపూర్వకంగా టెండర్లు దాఖలు చేశారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక షాపుల టైమింగ్ విషయంలో వెసులుబాటు అడిగిన వ్యాపారులకు స్ట్రైట్ గా నో చెప్పేశారట. దీంతో… అనవసరంగా వచ్చి కొరివితో తలగోక్కున్నామా అన్నట్టు ఫీలయ్యారట మద్యం వ్యాపారులంతా. తాము టెండర్ల కోసం చేసిన ఖర్చు, లిక్కర్ షాపులు దక్కించుకునేందుకు పడిన కష్టం, వ్యాపారంలో ఉన్న లాభ, నష్టాల గురించి వివరించినా … ఆయన ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదన్నది షాపుల యజమానుల బాధ. మీరు చెప్పినట్టు ఊరికి దూరంగానే షాపులు పెడతాంగానీ… ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అమ్మకాలకు అనుమతించమన్నా… నా రాజ్యాంగం నాదేనని కరాఖండిగా చెప్పేశారట ఎమ్మెల్యే. పర్మిట్ రూమ్స్‌కు కూడా ప్రభుత్వం ఫీజు వసూలు చేస్తోందని చెప్పినా… నాకవన్నీ చెప్పొద్దని సీరియస్ అయినట్టు సమాచారం.
మరో 15 రోజుల్లో కొత్త వైన్స్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున… ముందే అన్నీ సెట్ చేసుకుందామనుకున్న లిక్కర్ వ్యాపారులకు రాజగోపాల్ రెడ్డిని కలిశాక కూడా నిరాశే మిగిలిందంటున్నారు. అదే సమయంలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చే ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించారట వ్యాపారులు. లిక్కర్ షాపుల నిర్వహణలో ఎక్సైజ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు ఉంటాయనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా… వాళ్ళు యాక్షన్ తీసుకుంటే నేను అండగా ఉంటానని, సంబంధిత అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఇలా…మొత్తంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నయా రూల్స్‌తో మా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందని అంటున్నారు మునుగోడు మద్యం వ్యాపారులు. ఇటు ఎమ్మెల్యే దూకుడు, అటు ఎక్సైజ్ శాఖ నిబంధనలతో… కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు షాపుల యజమానులు. ఈ లిక్కర్ పోరులో తగ్గేది ఎవరు… నెగ్గేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.